బుధవారం 15 జూలై 2020
Khammam - Jun 13, 2020 , 02:09:25

గ్రామాల్లోనే కల్లాలు..

గ్రామాల్లోనే కల్లాలు..

ధాన్యం ఆరబోసేందుకు జిల్లా వ్యాప్తంగా కల్లాలు

ఉపాధిహామీ నిధులతో నిర్మాణం

నేడో రేపో అధికారికంగా ఉత్తర్వులు

పంటలను ఆరబోసుకునేందుకు గ్రామాల్లో కల్లాల ఏర్పాటుకు సర్కార్‌ సుముఖత చూపింది. ఇందుకోసం వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రతి గ్రామంలో ధాన్యం కల్లాలు ఉంటేనే పంట నష్టం జరుగదనే ఉద్దేశంతో ఉపాధి హామీ నిధులతో త్వరలో గ్రామాల్లో కల్లాల నిర్మాణం  చేపట్టనున్నారు. కొందరు సరైన చోటు లేక రోడ్లపైన లేదా బండలపై ఆరబోస్తున్నారు. కానీ వర్షాలు వచ్చే సమయంలో ఆరుగాలం కష్టించి పండించిన పంట నీటిపాలవుతున్నది. ఈ నేపథ్యంలో రైతులు  పంట ఆరబోసుకునేందుకు వీలుగా అన్ని గ్రామాల్లో కల్లాలు నిర్మించాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగానే ఒక్కో నిర్మాణానికి రూ.46,045 చొప్పున జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కల్లాలు ఏర్పాటు చేయనున్నారు. 

గ్రామానికి ఐదు నుంచి ఏడు..

కల్లాలు ఒక్కొక్కటి 45 సెంటీ మీటర్ల ఎత్తు, 45 చదరపు మీట ర్ల విస్తీర్ణంలో ఉండాలని మంత్రివర్గ ఉప సంఘం అభిప్రాయపడింది. ప్రతి గ్రామానికి ఐదు నుంచి ఏడు కల్లాలు నిర్మించే అవకాశం ఉంది. ఈ వానకాలంలో రాష్ట్రంలో 45 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసే అవకాశం ఉండటంతో నేషనల్‌ రూరల్‌ లైవ్లీహుడ్‌ మిషన్‌కింద వ్యవసాయ ఉత్పత్తులను పెంచేందుకు, సేంద్రి య ఎరువుల తయారీకి ప్రోత్సాహం కల్పించాలని నిర్ణయించింది. 

ఉపాధి నిధులతో కల్లాల ఏర్పాటు

ప్రతి గ్రామంలో కల్లాల ఏర్పాటుకు ఉపాధిహామీ పథకం నిధులను వెచ్చించనున్నారు. ఇప్పటికే వ్యవసాయ అనుబంధ పనులకు ఉపాధి పనులు చేపడుతున్నారు. రైతుల పొలాలను చదును చేసుకునేందుకు వేసవి కాలంలో ఉపాధి పథకం ద్వారా పనులు కూడా చేపట్టారు. అదే తరహాలో గ్రామస్థాయిలో ఏర్పాటు చేయబోయే పంట పొలాలను కూ డా ఉపాధి హామీ పనులతో పూర్తి చేయించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇక నుంచి వానకాలం, యాసంగి సాగు పంటలను ఈ కల్లాల్లో ఆరబోసుకునే అవకాశం కలగనుంది. దీని వల్ల రైతులకు ఎలాంటి పంటనష్టం జరిగే అవకాశం ఉండదు. గాలి దుమారం, అకాల వర్షాలు వచ్చినా ధాన్యం చెక్కు చెదరకుండా ఉండనుంది. 

రైతులకు లాభం

గ్రామస్థాయిలో ఏర్పాటుచేయబోయే పంట కల్లాలు రైతులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ప్రభుత్వం దీనిపై కార్యాచరణ చేపట్టి కల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. అధికారికంగా ఆమోదం రాగానే పనులు చేపడతారు. ముఖ్యంగా అకాల వర్షాలకు పంట నష్టపోకుండా కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, ఇతర పంటలపై టార్పాలిన్‌ కప్పుకొని అవసరమైతే పంటను నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనిపై ఉన్నతస్థాయి అధికారులు కార్యాచరణ చేపడుతున్నారు. 

-కొర్సా అభిమన్యుడు, జిల్లా వ్యవసాయ అధికారి


logo