శనివారం 04 జూలై 2020
Khammam - Jun 13, 2020 , 02:06:05

హరితోత్సవం

హరితోత్సవం

479 పంచాయతీల నర్సరీల్లో పెరుగుతున్న మొక్కలు 

ఆరో విడుత హరితహారంలో 

డీఆర్‌డీఏ లక్ష్యం 50 లక్షలు

రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల20 నుంచి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ఆరో విడత   హరితహారానికి మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. ఈ విడత కార్యక్రమాన్ని కూడా  విజయవంతం చేసేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ చర్యలు చేపట్టింది. సీఎం కేసీఆర్  ఆదేశాల మేరకు ప్రతి గ్రామ పంచాయతీకీ ఒక నర్సరీని ఏర్పాటు చేశారు. ‘ఒక గ్రామ        పంచాయతీ - ఒక నర్సరీ’ పద్ధతిన మొక్కలు పెంచుతున్నారు. పంచాయతీ సిబ్బంది వాటిని      సంరక్షిస్తున్నారు. హరితహారం కార్యక్రమానికి కలెక్టర్‌ ఎంవీ రెడ్డి ఆదేశాలతో డీఆర్‌డీఓ అధికారులు 50 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.     -కొత్తగూడెం అర్బన్‌

ప్రతి గ్రామ పంచాయతీకీ ఒక నర్సరీ ఉంటే మొక్కలను పెంచడం, సంరక్షించడం, తరలించడం, నాటడం వంటివి సులువుగా ఉంటాయని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ (డీఆర్‌డీఏ) భావించింది. ఈ మేరకు జిల్లాలోని 479 పంచాయతీల  నర్సరీల్లో టేకు, వెదురు, దానిమ్మ, నిమ్మ, జామ, సీతాఫలం, మునగ, బొప్పాయి, సీమతంగేడు, కర్జూరం, నిద్ర గన్నేరు, గానుగ, వేప, కదంబ, మారేడు, ఫెల్టోఫారం, చింత, కృష్ణ తులసి, నేరేడు వంటి వాటితోపాటు పూల మొక్కలు, ఇతరత్రా మొక్కలను పెంచుతున్నారు. నిరుడు డీఆర్‌డీఏ, పీఆర్‌ అధికారులు దాదాపు 33 లక్షల టేకు మొక్కలు పెంచి రైతుల పొలాల గట్ల మీద, ఇతరత్రా ఖాళీ స్థలాల్లో నాటారు. అవి ప్రస్తుతం పెరుగుతున్నాయి. ఇక పూల మొక్కలు, పండ్ల మొక్కలను వివిధ పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రధాన రోడ్ల వెంట నాటారు. ఈ ఏడాది మొత్తంగా 50 లక్షల మొక్కలు నాటేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. జిల్లా ఏర్పడ్డాక 2018-19లో 22 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించుకొని  20.56 లక్షల మొక్కలను నాటారు. 2019-20లో 88.66 లక్షల మొక్కలకు గాను 82 లక్షల మొక్కలను నాటారు. ఈ ఏడాది 50 లక్షల మొక్కలను నాటి సంరక్షించాలని    అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

నర్సరీలపై కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి 

పంచాయతీల్లో ఏర్పాటు చేసిన నర్సరీలపై కలెక్టర్‌ ఎంవీ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లోని మొక్కలను మండలాధికారులు ఏ విధంగా పెంచుతున్నారో పరిశీలించేందుకు ప్రతి రోజూ ఒక మండలానికి వెళ్తున్నారు. హరితహారం ప్రారంభం కాబోయే తేదీ వారం రోజుల ముందుగానే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు అవసరమైన మొక్కలను సిద్ధంగా ఉంచాలని మండలాధికారులను ఆదేశించారు. మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహించిన అధికారులకు ఇప్పటికే షోకాజ్‌ నోటీసులు సైతం జారీ చేశారు. 

మొక్కలు ఎదుగుతున్నాయి..

ప్రభుత్వం జిల్లాకు నిర్దేశించిన మొక్కల లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తున్నాం. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రతి గ్రామ పంచాయతీకీ ఒక నర్సరీని ఏర్పాటు చేశాం. నర్సరీలో మొక్కలు పెరుగుతున్నాయి. ఈ నెల 20 నుంచి ఆరో విడత హరితహారం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈలోగా నర్సరీల్లోని మొక్కలు సిద్ధంగా ఉంటాయి.

-మధుసూదనరాజు, ఇన్‌చార్జి డీఆర్‌డీఓ, కొత్తగూడెం logo