గురువారం 09 జూలై 2020
Khammam - Jun 11, 2020 , 02:50:56

అల్లం సాగుకు అడుగులు

అల్లం సాగుకు అడుగులు

  • సీఎం కేసీఆర్‌ ఆలోచనకు పదును
  • మూడు మండలాల రైతుల సన్నద్ధం
  • 30 ఎకరాల్లో సాగు దిశగా కార్యాచరణ
  • అవగాహన కల్పిస్తున్న ఉద్యాన అధికారులు

ఖమ్మం వ్యవసాయం : వ్యవసాయ, ఉద్యాన పంటల సాగులో జిల్లా ఇప్పటికే ముందువరుసలో ఉంది. ఈ వానకాలం సీజన్‌లో అల్లం పంట సాగు జరుగనుంది. సీఎం కేసీఆర్‌ ఆలోచనకు అనుగుణంగా జిల్లాలో తొలిసారిగా అల్లం సాగుకు శ్రీకారం చుడుతున్నారు. సాగుకు అవసరమైన నేలలు, సరిపడా సాగునీరు, భౌగోళిక వాతావరణం వంటివి అనూకలంగా, అవకాశంగా ఉన్నాయి. జిల్లా ఉద్యానశాఖ కూడా అల్లం సాగుపై ప్రత్యేక దృష్టి సారించింది. 

సుమారు 30 ఎకరాల్లో సాగు..  : ఈ వానకాలం సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా కనీసం 30 ఎకరాల్లో అల్లం సాగును చేయించాలని ఉద్యాన అధికారులు ప్రణాళిక తయారు చేశారు. ఇప్పటికే రఘునాథపాలెం, కొణిజర్ల, బోనకల్లు మండలాల్లో సాగు చేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేశారు. ఇసుక, దుబ్బ నేలలకు అనుకూలంగా ఉండే సారవంతమైన భూములు ఈ సాగుకు అనుకూలమని భావించిన అధికారులు సంబంధిత రైతులను గుర్తించి అవగాహన కల్పించారు. ఎంపిక చేసిన రైతులు రెండు రోజుల నుంచి అల్లం సాగుకు శ్రీకారం చుట్టారు. ఉద్యాన అధికారులు కూడా క్షేత్రస్థాయి పర్యటన చేసి సహకరిస్తున్నారు. ఐదు నెలల్లో చేతికొచ్చే ఈ పంట.. ఎకరానికి దాదాపు 100 క్వింటాళ్ల దిగుబడిని ఇచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం వచ్చే ఫలితాలను బట్టి మరికొంత మంది రైతులతో ఉల్లి, వెల్లుల్లి సాగు చేయించే యోచనలో అధికారులు ఉన్నారు. 

ఆసక్తి కలిగిన రైతులకు అవగాహన కల్పిస్తున్నాం

అల్లం సాగు చేసుకునేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఆ రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. జిల్లాలో అల్లం సాగు జరుగుతున్నప్పటికీ ఇంటి అవసరాలకే పరిమితమవుతున్నది. ఈ ఏడాది జిల్లాలో 30 ఎకరాల్లో సాగు చేపట్టే విధంగా అవగాహన కల్పిస్తున్నాం. అల్లం సాగుకు జిల్లా నేలలు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. మార్కెటింగ్‌ సౌకర్యం కూడా ఉంది.  

-జీ.అనసూయ, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారిణిlogo