బుధవారం 15 జూలై 2020
Khammam - Jun 11, 2020 , 02:37:33

లాక్‌డౌన్‌ సడలింపులతో జోరందుకున్న మద్యం విక్రయాలు

లాక్‌డౌన్‌ సడలింపులతో జోరందుకున్న మద్యం విక్రయాలు

  • గత నెలలో రూ.103కోట్ల ఆదాయం
  • దుకాణాల వద్ద నిబంధనల అమలు
  • భౌతిక దూరం పాటిస్తూ లిక్కర్‌ కొనుగోళ్లు

లాక్‌డౌన్‌ సడలింపులతో ఖమ్మం జిల్లాలో మద్యం విక్రయాలు జోరందుకున్నాయి.. అమ్మకాలు ప్రారంభించిన మొదటి రోజే రూ.3 కోట్ల ఆదాయం వచ్చిందంటే కొనుగోళ్లు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.. గత నెలలో రూ.103 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్‌శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి.. డిమాండ్‌కు తగిన సప్లయి లేకపోవడంతో కాస్త ఆదాయం తగ్గినట్లు తెలుస్తున్నది.. ఈ నెలలో ఆదాయం మరింత పెరుగనున్నట్లు తెలుస్తున్నది.. 

ఖమ్మం, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యల అనంతరం లాక్‌డౌన్‌ సడలింపుతో జిల్లాలో భారీగా మద్యం విక్రయాలు జరిగాయి. సుమారు 42 రోజుల పాటు రాష్ట్రంలో మద్యం విక్రయాలను ప్రభుత్వం నిలిపివేసింది. స్వీయనియంత్రణ పాటించే విధంగా ప్రజలను చైతన్యపరిచడంతో రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాలు నిలిచిపోయాయి. లాక్‌డౌన్‌ సడలింపు అనంతరం పొరుగు రాష్ర్టాల్లో మద్యం విక్రయాలకు అవకాశం కల్పించడంతో జిల్లా సరిహద్దు ప్రాంతాలకు చెందిన పలువురు గ్రామస్తులు ఏపీలో ప్రవేశించి మద్యం కొనుగోలు చేశారు. దీనిని నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నప్పటికి పూర్తిస్థాయిలో కట్టడి జరగకపోవడంతో మన రాష్ట్రంలో కూడా మద్యం విక్రయాలకు అవకాశం కల్పించాలని వచ్చిన డిమాండ్‌ అనంతరం ప్రభుత్వం పరిశీలన చేసింది.

మే 7వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలకు నిబంధనలతో కూడిన సడలింపు ఇవ్వడంతో అమ్మకాలు భారీగా పెరిగాయి. లాక్‌డౌన్‌ కంటే ముందు కొద్దిపాటి మద్యం నిల్వలుండడంతో వాటి విక్రయాలు మాత్రమే సడలింపు అనంతరం జరిగాయి. బ్రేవరీస్‌లో మద్యం తయారీకి కొంత సమయం కావాల్సి ఉండడంతో డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా జరగకపోవడంతో విక్రయాల్లో జాప్యం చోటుచేసుకుంది. మే 7వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జిల్లాలో రూ. 103 కోట్లకు పైగా విక్రయాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో సరాసరి 16 శాతం ధరలను పెంచి విక్రయాలు నిర్వహించారు. మధ్యతరగతి, నిరుపేదలు తాగే లిక్కర్‌పై 11 శాతం మాత్రమే ప్రభుత్వ అధికంగా ధరలను పెంచి విక్రయించింది. అదే పొరుగునవున్న ఏపీలో 70 శాతం పైగా  ధరలను పెంచి అమ్మకాలు జరిపారు. మద్యం ప్రియులపై అధిక భారం పడకుండా తెలంగాణ ప్రభుత్వం  అతితక్కువ ధరలకు మద్యం విక్రయాలు జరిపింది.

జిల్లాలో ఖమ్మం-1, ఖమ్మం-2, మధిర, నేలకొండపల్లి, సత్తుపల్లి, సింగరేణి, వైరాలల్లో ఎక్సైజ్‌స్టేషన్లున్నాయి. వీటి పరిధిలో మద్యం విక్రయాల కొనసాగింపుపై అవసరమైన నియంత్రణ  చేసేందుకు ఎక్సైజ్‌ సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు. కేవలం లాక్‌డౌన్‌ అనంతరం మే నెల చివరి వరకు 55,914 బీరుబాటిళ్లు, 1,51,094 మద్యం బాటిళ్ల విక్రయాలు జరిగాయి. ఖమ్మం 1వ ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలో 14,407 బీరుబాటిళ్లు, 34,904 మద్యం బాటిళ్లు, ఖమ్మం -2 ఎక్సైజ్‌స్టేషన్‌ పరిధిలో 10,693 బీరుబాటిళ్లు, 22,216 మద్యం బాటిళ్లు, మధిర స్టేషన్‌ పరిధిలో 5,616 బీరుబాటిళ్లు, 24,693 మద్యం బాటిళ్లు, నేలకొండపల్లి స్టేషన్‌ పరిధిలో 7,486 బీరుబాటిళ్లు, 13,761 మద్యం బాటిళ్లు, సత్తుపల్లి ఎక్సైజ్‌స్టేషన్‌ పరిధిలో 7,565 బీరుబాటిళ్లు, 27,716 మద్యం బాటిళ్లు, సింగరేణిస్టేషన్‌ పరిధిలో 4,636 బీరుబాటిళ్లు, 13,854 మద్యం బాటిళ్లు, వైరా ఎక్సైజ్‌స్టేషన్‌ పరిధిలో 5,914 బీర్లు, 13,950 మద్యం బాటిళ్లు విక్రయించారు.   ఏటా మే, జూన్‌ నెలల్లో మద్యం విక్రయాలు భారీగా జరుగుతాయి. ఈ ఏడాది కరోనా ప్రభావం అన్నిరంగాలతో పాటు మద్యం విక్రయాలపై కూడా పడింది. దీంతో గాలివాటం విక్రయాలు జరిగినట్లు తెలుస్తున్నది.  తొలిరోజు జిల్లాలో రూ. 3 కోట్ల విక్రయాలు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.  

మాస్కు ఉంటేనే విక్రయం..

మద్యం దుకాణాల వద్ద కొనుగోలుదారులు కిక్కిరిస్తుండడంతో లాక్‌డౌన్‌ సడలింపు అనంతరం జిల్లా ఎక్సైజ్‌ అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. మాస్కులున్న వారికే అమ్మకాలు జరపాలని ఆదేశాలు జారీచేశారు. భౌతికదూరం పాటించడంతో పాటు గుమిగూడకుండా నియంత్రణ చర్యలు తీసుకున్నారు. విక్రయాల్లో అక్రమాలు చోటుచేసుకోకుండా  కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి అమలు చేశారు. జిల్లాలోని అన్ని ఎక్సైజ్‌ స్టేషన్ల పరిధిలో అధికారులు నిఘా ఏర్పాటు చేసి విక్రయాలు సక్రమంగా సాగేలా చర్యలు చేపట్టారు. లాక్‌డౌన్‌ సడలింపుతో ఒక్కసారిగా మద్యం కొనుగోళ్ల కోసం ప్రజలు ముందుకు రావడంతో రద్దీని తగ్గించేందుకు ఎక్సైజ్‌ సిబ్బంది చర్యలు తీసుకున్నారు. కల్తీ మద్యం, గుడుంబాలను నియంత్రించేందుకు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. బెల్ట్‌షాపుల్లో విక్రయాల  నియంత్రణకు చర్యలు చేపట్టారు.  ప్రతి దుకాణం వద్ద ధరల జాబితా బహిరంగంగాకనిపించేలా ఏర్పాట్లు చేశారు. శానిటైజర్లను అందుబాటులో ఉంచి కొనుగోలుదారుల్లో అవగాహన పెంచేందుకు దుకాణదారులను చైతన్యపరిచారు. 

భౌతికదూరం పాటిస్తేనే మద్యం..

మద్యం విక్రయాల సందర్భంగా దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించే విధంగా చర్యలను పకడ్బందీగా చేపట్టాం. నో మాస్కు..నో లిక్కర్‌, నో గూడ్స్‌ అని ఎక్సైజ్‌ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్న విధంగా మద్యం షాపుల వద్ద  అన్ని ఏర్పాట్లు చేశాం. అధిక ధరలకు మద్యం అమ్మకుండా నిఘా ఏర్పాటు చేశాం. అధిక ధరలకు విక్రయిస్తే తమకు ఫిర్యాదు చేయాలని కోరాం. అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అధిక ధరలతో పాటు కల్తీ మద్యం విక్రయాలు జరగకుండా కార్యచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేశాం.  సిబ్బంది ద్వారా  నిరంతరం నిఘా ఏర్పాటు చేసి ఎలాంటి అవకతవకలు లేకుండా చూశాం. జిల్లాలో వేసవిలో సాధారణంగా భారీస్థాయిలో మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. ఈ ఏడాది కొవిడ్‌-19 ప్రభావం కొంత మేర అమ్మకాలపై చూపింది. సడలింపు అనంతరం భారీగా విక్రయాలు జరిగినప్పటికి మరింత పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. 

: వీ.సోమిరెడ్డి, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ 
logo