ఆదివారం 12 జూలై 2020
Khammam - Jun 10, 2020 , 04:36:52

రేషన్‌ కార్డుదారులకు బియ్యంతో పాటు కిలోకందిపప్పు అందజేత

రేషన్‌ కార్డుదారులకు బియ్యంతో పాటు కిలోకందిపప్పు అందజేత

  • జిల్లాలో 4,05,120 కార్డులకు 380 మెట్రిక్‌ టన్నులు.. 
  • ఈ నెలలోనే పంపిణీ

మన నిత్యావసర సరుకుల్లో ఒకింత ఎక్కువ ధర ఉన్న  కందిపప్పును కిలో చొప్పున రేషన్‌ కార్డుదారులకు ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా కష్టకాలంలో రాష్ట్రవ్యాప్తంగా నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు రేషన్‌ కార్డుపై కుటుంబంలో ఒక్కొక్కరికీ 12 కేజీల చొప్పున బియ్యాన్ని ఏప్రిల్‌, మే నెలల్లో అందించింది. జూన్‌ నెలలో బియ్యంతోపాటు కిలో కందిపప్పును కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

- ఖమ్మం, నమస్తే తెలంగాణ: 

ఖమ్మం జిల్లాలో 4,05,120 మంది రేషన్‌కార్డుదారులు ఉన్నారు. వీరిలో ఎఫ్‌ఎస్‌సీ కార్డుదారులు 3,78,163 మంది, ఏఎఫ్‌సీ కార్డుదారులు 26,952 మంది, అన్నపూర్ణ కార్డుదారులు ఐదుగురు ఉన్నారు. వీరందరికీ మూడు నెలల నుంచి కుటుంబంలో ఒక్కొక్కరికీ 12 కేజీల చొప్పున ఉచితంగా బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. ఖమ్మం జిల్లాలోని రేషన్‌ కార్డుదారులకు ఏప్రిల్‌లో 12,920 మెట్రిక్‌ టన్నులు, మే నెలలో 63,616 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేసింది. జూన్‌లో పంపిణీ చేసేందుకు 13,086 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని జిల్లాలోగల 669 రేషన్‌ దుకాణాలకు సరఫరా చేసింది. ఈ నెల 1వ తేదీ నుంచి రేషన్‌ డీలర్లు కార్డుదారులకు ఉచితంగా బియ్యం పంపిణీని ప్రారంభించారు. రేషన్‌ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.1500 చొప్పున ఏప్రిల్‌, మే నెలల్లోనే ప్రభుత్వం అందజేసింది. జూన్‌లో నగదు ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. బ్యాంక్‌ ఖాతాకు ఆధార్‌ నెంబర్‌ లింక్‌ చేసిన రేషన్‌ కార్డుదారులకు ఇప్పటికే నగదు అందింది. ఆధార్‌ లింక్‌ లేని కార్డుదారుల బ్యాంక్‌ ఖాతాల నెంబర్లను రెవెన్యూ అధికారులు సేకరించి ఆన్‌లైన్‌ చేశారు. వారి ఖాతాల్లో కూడా డబ్బులు జమ అయ్యాయి. మరికొద్ది మందికి పోస్టాఫీసుల ద్వారా అందాయి. 

ఈ నెలలో ప్రతి కార్డుకు  ఉచితంగా కిలో కందిపప్పు..

లాక్‌డౌన్‌ అమలైన మూడు నెలలకు రేషన్‌ కార్డుదారులందరికీ మొత్తం మూడు కిలోల చొప్పున కందిపప్పును ఉచితంగా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కందిపప్పు నిల్వల ఆధారంగా ఖమ్మం జిల్లాలో జూన్‌ నెలకు మాత్రమే కిలో కందిపప్పును ఉచితంగా అందజేస్తున్నది. మిగిలిన రెండు కిలోలను జూలై నెలలో అందించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు నెలలకు మూడు కిలోల చొప్పున ఖమ్మం జిల్లాకు 1210 మెట్రిక్‌ టన్నుల కందిపప్పును ప్రభుత్వం కేటాయించింది. జూన్‌లో జిల్లాలోని రేషన్‌ కార్డులకు ఒక్కో కిలో చొప్పున 380 మెట్రిక్‌ టన్నులను రేషన్‌ దుకాణాలకు సరఫరా చేసింది. ఈ నెలలో బియ్యంతోపాటు కిలో కందిపప్పును ఉచితంగా ఇస్తున్నారు. దీనికి పౌర సరఫరాల శాఖాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కందిపప్పును ప్యాకెట్ల రూపంలో కాకుండా విడిగా ఇస్తారు. 

రేషన్‌ డీలర్లు జాగ్రత్తలు పాటించాలి...

కరోనా వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో రేషన్‌ డీలర్లు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. రేషన్‌ సరుకులను తీసుకెళ్లేందుకు ప్రజలు సమూహంగా ఒకేసారి వచ్చే అవకాశం ఉన్నందున కార్డుదారులు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలని చెబుతున్నారు. ఒక్కొక్కరి మధ్య కనీసం ఆరు అడుగుల దూరం ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి. రేషన్‌కార్డుదారులవి కాకుండా థర్డ్‌ పార్టీ అయిన వీఆర్‌వో, వీఆర్‌ఏలతో మాత్రమే బయోమెట్రిక్‌ మిషన్‌పై వేలి ముద్రలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. కరోనా కారణంగా తెలంగాణలో ఇప్పటికే ఒక రేషన్‌ డీలర్‌ మృతిచెందారు. ఈ నేపథ్యంలో డీలర్లు శానిటైజర్‌ను విరివిగా వాడేలా ఏర్పాట్లు చేసుకోవాలి. మాస్క్‌ ఉన్నవారికే బియ్యం అందించాలని, కనీస జాగ్రత్తలు పాటించకుండా ప్రమాదాలను తెచ్చుకోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

జిల్లాలో రేషన్‌కార్డులు

ఎఫ్‌ఎస్‌సీ కార్డుదారులు : 3,78,163

ఏఎఫ్‌సీ కార్డుదారులు : 26,952

అన్నపూర్ణ కార్డుదారులు :05

మొత్తం రేషన్‌కార్డులు : 4,05,120logo