మంగళవారం 14 జూలై 2020
Khammam - Jun 10, 2020 , 04:31:55

పకడ్బందీగా సాగిన ప్రత్యేక పారిశుధ్య పనులు

పకడ్బందీగా సాగిన  ప్రత్యేక పారిశుధ్య పనులు

  • సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు 
  • కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు 
  • 23,819 ఇళ్లల్లో రెండు డస్టుబిన్ల చొప్పున పంపిణీ 
  • అన్ని వర్గాల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధికి బాటలు 

ఇల్లు మనదే, ఊరూ మనదే.. కలిసి నడిస్తే అన్నీ మనవే.. సమిష్టిగా కదిలితే సాధించలేనిది ఉండదు.. పైపైన కనిపించేది కాదు, క్షేత్రస్థాయిలో కూడా జరిగితేనే అసలైన అభివృద్ధి  అని తలిచిన సీఎం కేసీఆర్‌ ఆ దిశగా ఆలోచనలు చేశారు.. మార్పు గ్రామాల నుంచి జరగాలని సంకల్పించారు.. పల్లెల అభివృద్ధికి పక్కా ప్రణాళికలు రూపొందించారు.. దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలకు రోజుల వ్యవధిలోనే పరిష్కార మార్గాలు చూపించారు.. ‘పల్లె ప్రగతి’తో అభివృద్ధికి బాటలు తెరిచారు.. ఇందులో భాగంగా ఈనెల 1 నుంచి 8వ తేదీ వరకు ఊర్లల్లో జరిగిన ‘ప్రగతి’ కార్యక్రమాల్లో   కోట్లాది రూపాయల  అభివృద్ధి పనులు జరిగాయి.. రానున్న వానకాలం దృష్ట్యా సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యంత్రాంగం ప్రజలను చైతన్యపర్చే కార్యక్రమాలు చేపట్టింది.. అందరి భాగస్వామ్యంతో   పారిశుధ్య పనులను  పకడ్బందీగా జరిపించింది.   

ఖమ్మం, నమస్తే తెలంగాణ : గ్రామాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పకడ్బందీగా అమలు చేస్తున్నది. గ్రామ ప్రజల శ్రేయస్సే ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామసీమలను అభివృద్ధి బాటలో పయనింపజేస్తూ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు అనువైన కార్యాచరణ అమలు చేస్తున్నారు. జిల్లాలో ఈ నెల 1 నుంచి 8వ తేదీ వరకు పల్లె ప్రగతి కార్యక్రమం ముమ్మరంగా కొనసాగింది. గ్రామస్తులను భాగస్వా మ్యం చేస్తూ అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రజలను సమావేశ పరిచి పాదయాత్రలు నిర్వహించారు. అనేక ఏండ్లగా పేరుకుపోయిన పనులకు మోక్షం కల్పించారు. జిల్లాలోని 20 మండలాల్లో గల 376 గ్రామాల్లో 8 రో జుల పాటు ప్రత్యేక పారిశుధ్య వారోత్సవం ఉద్యమంలా సాగింది. డ్రైన్‌లలో పూడికతీత, రోడ్లపై పేరుకుపోయిన చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు తొలగించారు. పలు ప్రాంతాల్లో రోడ్లపై ఏర్పడిన గుంతలు పూడ్చి అందంగా తీర్చిదిద్దారు. మురికి కాల్వల్లో బ్లీచింగ్‌ చల్లి, రహదారులపై హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ చేశారు. తాగునీటి సౌకర్యాన్ని పెంపొందిస్తూ వాటర్‌ ట్యాంకులను శుభ్రం చేశారు.

పైపులైన్ల లీకేజీలను గుర్తించి మరమ్మతులు చేశారు. పాఠశాలలు, ఆరోగ్యకేంద్రాలు, కమ్యూనిటీ హాళ్లు, సంత, మార్కెట్‌ ప్రాంతాలతో పాటు పలుచోట్ల పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలోని 376 గ్రామాల్లో 1976 డ్రైన్లలో పూడిక తీసి మురుగునీరు పారుదలకు అనువుగా మలిచారు. 1052 ప్రాంతాలు, ఇండ్లల్లో, 2122 ప్రాంతాల్లో పిచ్చి చిన్నపొదలు, సర్కార్‌ తుమ్మలను తొలగించి రాకపోకలకు అనువుగా మలిచారు. జిల్లాలో 1017 చోట్ల ఖాళీస్థలాలు, సామూహిక ప్రదేశాలను గుర్తించి శుభ్రపరిచారు. 1065 చోట్ల రోడ్లపై నీరు నిలిచే ప్రదేశాలను గుర్తించి గుంతలను పూడ్చివేశారు. 1022 ప్రాంతాల్లో మొరం తోలించి, 986 ప్రాంతాల్లో మరమ్మతులు చేశారు. 4059 ప్రాంతాల్లో రోడ్లపై బ్లీచింగ్‌ చల్లి హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ చేశారు. 754 వాటర్‌ ట్యాంక్‌లను శుభ్రం చేసి, 969 ప్రాంతాల్లో పైపులను గుర్తించి మరమ్మతులు చేశారు. 538 చోట్ల కొత్త ట్యాప్‌లను  అమర్చారు. 2597 చోట్ల మురికి కాలువలో ఆయిల్‌ బాల్స్‌ వేసి లార్వా నివారణకు చర్యలు తీసుకున్నారు. 375 ప్రాంతాల్లో దోమల నివారణకు ఫాగింగ్‌, 764 అంగన్‌వాడీ కేంద్రాలు, 415 ప్రాథమిక , 109 ప్రైమరీ, 122 ఉన్నత పాఠశాలలు, 128 ఆరోగ్య కేంద్రాలు, 125 కమ్యూనిటీ హాళ్లలో, 273 ఇతర భవనాల్లో అపరిశుభ్రతను గుర్తించారు.

ఈ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో ఆయా ప్రాంతాల్లో చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రపరిచారు. జిల్లాలోని 52 సంతలు, 8 మార్కెట్‌ ప్రాంతాలు, 82 బస్టాండ్‌, రైల్వే, బందెలదొడ్ల ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేపట్టారు. లక్షా 20 వేల 960 ఇండ్లలో చెత్తాచెదారాన్ని వేసేందుకు 23,819 ఇండ్లలో రెండు డస్టుబిన్లు చొప్పున పంపిణీ చేశారు. 376 గ్రామ సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సుల్లో 4,903 మంది గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారు. పారిశుధ్యం పట్ల ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించేందుకు 8,550 మందితో 376 పాదయాత్రలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు, యువకులు, మహిళలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు పాల్గొన్ని గ్రామాభివృద్ధిలో భాగస్వాములయ్యారు.


logo