శనివారం 04 జూలై 2020
Khammam - Jun 09, 2020 , 05:04:22

పరీక్షలు లేకుండానే పైతరగతులకు ప్రమోట్‌

పరీక్షలు లేకుండానే పైతరగతులకు ప్రమోట్‌

  • ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా గ్రేడింగ్‌లు
  • కరోనా నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ నిర్ణయం
  • జిల్లాలో 18,657 మంది విద్యార్థులు 

టెన్త్‌ పరీక్షల విషయంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న తరుణంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు కాబట్టి ఎలాంటి పరీక్షలూ నిర్వహించకుండానే ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా విద్యార్థులందరినీ పైతరగతులకు ప్రమోట్‌ చేస్తూ సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 

ఖమ్మం ఎడ్యుకేషన్‌: టెన్త్‌ పరీక్షల్లో 11 పేపర్లు ఉండగా మూడు పేపర్లకు పరీక్షలు జరిగాయి. లాక్‌డౌన్‌ కారణంగా 8 పేపర్ల పరీక్షలను పెండింగ్‌లో పెట్టారు. ఇటీవల వాటిని నిర్వహించాలని భావించారు. కానీ కరోనా విస్తరిస్తుండడంతో విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉంది. దీంతో సోమవారం ప్రగతిభవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. టెన్త్‌ పరీక్షలను రద్దు చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులందరినీ పైతరగతులకు ప్రమోట్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్స్‌ ఇవ్వనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఇంటర్నల్స్‌ ఆధారంగా గ్రేడ్స్‌..

నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ)లో భాగంగా 2014-15 నుంచి టెన్త్‌లో ప్రతి సబ్జెక్టుకూ 4 అంశాల ప్రాతిపాదికగా 20 మార్కులకు నాలుగు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్స్‌ను నిర్వహిస్తున్నారు. ఈ నాలుగు అసెస్‌మెంట్స్‌నూ సరాసరి చేసి మోడిఫికేషన్‌ టీమ్స్‌ పరిశీలిస్తాయి. వాటి వివరాలను ఎస్‌ఎస్‌సీ బోర్డుకు ఆన్‌లైన్‌ ద్వారా పంపుతాయి. ప్రతి సబ్జెక్టులో మిగిలిన 80 మార్కులకు పబ్లిక్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పుడు పబ్లిక్‌ పరీక్షలు రద్దు చేయడంతో ఆన్‌లైన్‌లో పంపిన ఇంటర్నల్‌ మార్కుల ప్రాతిపదికగానే విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో గ్రేడింగ్స్‌ ఇస్తారు. ఈ విధానంతో దాదాపు అంద రు విద్యార్థులూ ప్రమోట్‌ అవుతారు. 

టెన్త్‌ విద్యార్థులకు శుభవార్త..

టెన్త్‌ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. అందరూ పాస్‌ అని ప్రకటించడంతో వారికి గొప్ప ఉపశమనం కలిగినట్లయింది. జిల్లాలో 475 పాఠశాలల్లో 17854 మంది రెగ్యులర్‌, 803 మంది ప్రైవేట్‌ విద్యార్థులున్నారు. 

ప్రభుత్వ నిర్ణయం చరిత్రాత్మకం

కరోనా విస్తరణ పరిస్థితుల్లో టెన్త్‌లో మిగిలిన పేపర్లకు పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం. ఒకే ఒక్క నిర్ణయంతో సీఎం కేసీఆర్‌ అనేక సమస్యలకు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. పదో తరగతి విద్యార్థులందరినీ ప్రమోట్‌ చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు.

-బుగ్గినేని నాగేశ్వరరావు,  హెచ్‌ఎంల సంఘం నాయకుడు


logo