శనివారం 04 జూలై 2020
Khammam - Jun 08, 2020 , 02:55:47

పారిశుధ్య పనులనుఉద్యమంలాచేపట్టాలి

పారిశుధ్య పనులనుఉద్యమంలాచేపట్టాలి

  • సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలి 
  • పట్టణ ప్రగతి పనులు నిరంతరం కొనసాగాలి
  • రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌
  • నగరంలో పారిశుధ్య పనుల పరిశీలన
  • ధంసలాపురం ఆర్వోబీ పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశం

ఖమ్మం /రఘునాథపాలెం : ఖమ్మం జిల్లాలో పారిశుధ్య కార్యక్రమం ఒక ఉద్యమంలా నిరంతరం కొనసాగాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆదేశించారు. ప్రతి ఆదివారం 10 గంటలకు ప్రజలందరూ తప్పనిసరిగా 10 నిమిషాల పాటు తమ ఇండ్లలో పరిశుభ్రత పనులు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని 35వ డివిజన్‌లో ఖమ్మం కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, నగర మేయర్‌ డాక్టర్‌ పాపాలాల్‌తో కలిసి పట్టణ ప్రగతి పనులను పరిశీలించారు. డ్రీమ్‌వ్యాలీ అపార్ట్‌మెంట్‌ను తనిఖీ చేసి నిల్వ ఉన్న నీటిని, చెత్తాచెదారాన్ని  తొలగించారు. డివిజన్‌లోని ప్రధాన కాలువలను తనిఖీ చేసి కాల్వలోని మురుగును శుభ్రపర్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు నీటి నిల్వలు, చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు.  కరోనా వ్యాపిస్తున్న క్రమంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు భౌతికదూరం పాటించాలన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, కార్పొరేటర్లు లక్ష్మీసుజాత, కమర్తపు మురళీ, కర్నాటి కృష్ణ, నగర పాలక సంస్థ డీఈ రంగారావు, కృష్ణారెడ్డి, ఖమ్మం అర్బన్‌ తహసీల్దార్‌ శ్రీనివాసరావు, అపార్టుమెంట్‌ నిర్వాహకులు,  డివిజన్‌ ప్రజలు 

తదితరులు పాల్గొన్నారు. 

పల్లె ప్రగతిలో ఆదర్శంగా నిలవాలి

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో రఘునాథపాలెం మండలం ఖమ్మం జిల్లాకు ఆదర్శం కావాలని మంత్రి అజయ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని రఘునాథపాలెం గ్రామంలో కలెక్టర్‌తో కలిసి పల్లె ప్రగతి పనులను పరిశీలించారు.

గ్రామానికి చెందిన ఎస్టీ కాలనీ, మోడల్‌ కాలనీల్లోని పలు వీధుల్లో కాలినడకన తిరిగారు. పారిశుధ్య పనులను మంత్రి స్వయంగా పరిశీలించారు. ఎస్టీకాలనీలో పారిశుధ్య వవస్థ సక్రమంగా లేకపోవడం పట్ల గ్రామ కార్యదర్శిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని 37గ్రామ పంచాయతీల్లో వైకుంఠధామాల నిర్మాణం, ఇంకుడు గుంతలు, ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకున్న గ్రామాల నివేదికను తనకు సమర్పించాలని అదనపు కలెక్టర్‌ స్నేహలత మొగిలిని మంత్రి కోరారు. పెండింగ్‌ పనులు రెండు నెలల్లో పూర్తి కావాలని ప్రజాప్రతినిధులు, అధికారులను మంత్రి ఆదేశించారు.

అలాగే రూ.77కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ధంసలాపురం రైల్వే ఓవర్‌ బ్రిడ్జి పనులను పరిశీలించారు. పెండింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఆగస్టు 15నాటికి బ్రిడ్జిని ప్రారంభించే విధంగా పనులు పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, జెడ్పీటీసీ మాళోతు ప్రియాంక, ఎంపీపీ భుక్యా గౌరి, సర్పంచ్‌ గుడిపుడి శారద, ఉపసర్పంచ్‌ షేక్‌ కుందేసాహెబ్‌, ఎంపీటీసీ మద్దినేని రజినీ, డీపీవో శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ప్రవీణ, తహసీల్దార్‌ నర్సింహారావు, ఎంపీడీవో శ్రీదేవి, రైతుబంధు జిల్లా కమిటీ సభ్యుడు మందడపు సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.


logo