ఆదివారం 05 జూలై 2020
Khammam - Jun 08, 2020 , 02:51:23

కలవరపెడుతున్న కరోనా

కలవరపెడుతున్న కరోనా

  • అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన   
  • పెడచెవిన పెడుతున్న జనం
  • ఉమ్మడి జిల్లాలో 15 యాక్టివ్‌ కేసులు
  • మోగుతున్న ప్రమాద ఘంటికలు
  • జాగ్రత్తలు పాటించకుంటే అంతే సంగతులు..!

చాపకింద నీరులా కరోనా వ్యాపిస్తున్నది.. ఒకరి నుంచి ఒకరికి వేగంగా ప్రబలుతున్నది.. రాష్ట్ర వ్యాప్తంగా కేసుల సంఖ్య నానాటికీ   పెరుగుతున్నది.. మూడు విడుతల లాక్‌డౌన్‌ను బాధ్యతాయుతంగా పాటించిన ప్రజానీకం నాలుగో విడుతలో మాత్రం  గాడితప్పుతున్నారు.. మాస్క్‌లు ధరించకపోవడమనే నిర్లక్ష్యం, భౌతిక దూరం పాటించకపోవడమనే చిన్న అలసత్వం మహమ్మారి వ్యాప్తికి కారణమవుతున్నది.. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 15 యాక్టివ్‌ కరోనా కేసులు ఉండగా బాధితులు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు.. వందలాది మంది క్వారంటైన్‌లో ఉన్నారు.. ఈ నేపథ్యంలో వ్యక్తిగత క్రమశిక్షణతో మాస్క్‌లు ధరించాలని, బహిరంగ ప్రదేశాల్లో తప్పకుండా భౌతిక దూరం పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు..  శానిటైజర్‌ లేదా సబ్బుతో ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలంటున్నారు. 

ఖమ్మం, నమస్తే తెలంగాణ/కొత్తగూడెం: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా పట్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారు. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నా నిబంధనలు పాటించడం లేదు. వైరస్‌ కట్టడికి తెలంగాణ ప్రభు త్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ   ప్రజలు, వ్యాపార వర్గాలు నిబంధనలు పాటించకపోవడంతో  కేసులు పెరుగుతున్నాయి. తొలివిడుత లాక్‌డౌన్‌లో నిబంధనలు కచ్చి తంగా పాటించారు. సడలింపుల అనంతరం అందరిలోనూ   నిర్లక్ష్యం ఆవహించింది. వ్యాపారం, ఇతర అవసరాల కోసం ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి యథేచ్ఛగా నిబంధనలు పాటించకుండా తిరుగుతున్నారు. దీని వలన పెనుప్రమాదం పొంచివుందని తెలిసినప్పటికీ పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

మాస్క్‌ లేకుండా సంచారం..  

ఇంటినుంచి బయటకు వస్తున్నప్పుడే మాస్కు ధరించాలనే కనీస జాగ్రత్తను కూడా చాలా మంది పాటించడం లేదు. దీని వల్ల వారికే కాకుండా ఇతరులకు ఇబ్బందికరం. దుకాణాలు, ప్రయాణాల్లో , కూడలిలో భౌతిక దూరం కనిపించడం లేదు. శానిటైజేషన్‌ తదితర జాగ్రత్తలను పూర్తిగా విస్మరించారు. చేతులను తరుచూ శుభ్రం చేసుకోవడం, బయట నుంచి వచ్చిన అనంతరం స్నానం చేయడం వంటి కార్యక్రమాలను వది లేశా రు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పెళ్లిళ్లు,ఫంక్షన్లు  జోరుగా నిర్వహిస్తున్నారు. విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు.

ప్రయాణాల్లో నిబంధనలు తూచ్‌..

ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాహనాల రద్దీ విపరీతంగా ఉటుంది. లాక్‌డౌన్‌కు ముందు నాటి పరిస్థితులు రోడ్లపై కనిపిస్తున్నాయి. రవాణా సౌకర్యం పరిమితంగా ఉండడంతో కార్లలో, ద్విచక్ర వాహనాల్లో, ఆటోల్లో ప్రభుత్వం అనుమతించిన సంఖ్య కంటే అధికంగా ప్రయాణిస్తున్నారు. ప్రయాణ సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు చేపట్టడం లేదు. 

గుంపుగుంపులుగా జనం..

పట్టణాల్లో కూరగాయల మార్కెట్లు, చేపల మార్కెట్‌ తదితర ప్రాంతాల్లో ప్రజలు అవసరాల నిమిత్తం భారీగా గుమిగూడుతున్నారు. వీరిలో విద్యావంతులు కూడా అధికంగా ఉండడం విస్మయం కలిగిస్తున్నది. లాక్‌డౌన్‌ నిబంధనలతో సోమవారం నుంచి ఆలయాలు, ప్రార్థన మందిరాలు తెరుచుకోనున్నాయి. అయినప్పటికీ నిబంధనలను అతిక్రమిస్తూ ఆయా ప్రాంతాలకు వెళ్లే అవకాశాలుండడంతో మరింత ఆందోళన వ్యక్తమవుతుంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ ప్రభుత్వం నిబంధనలను పటిష్టంగా అమలు చేస్తుంది. పరిమిత స్థాయిలో వివాహాలకు కూడా హాజరయ్యేందుకు అవకాశం కలిపించడంతో దాన్ని అనేకమంది దుర్వినియోగం చేస్తున్నారు. ప్రధానంగా ఖమ్మం నగరం వంటి ప్రాంతాల్లో పలుచోట్ల రాత్రి సమయాల్లో అల్లరి మూకలు రోడ్లపైకి వచ్చి హల్‌చల్‌ చేస్తున్నాయి. లాక్‌డౌన్‌  నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించినైట్లెతే మరిన్ని పాజిటివ్‌ కేసులు పెరిగే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ సడలింపు అనంతరం ప్రైవేట్‌ వైద్యశాలలకు వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో ఆయా ప్రాంతాల్లో సరైన జాగ్రత్తలు పాటించడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం కరోనా వైరస్‌ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ ప్రజలే వారి బాధ్యతలను విస్మరిస్తూ నిబంధనలను పాటించకపోవడం బాధాకరం.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 15 యాక్టివ్‌ కేసులు..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం 15 యాక్టివ్‌ కేసులు ఉన్నా యి. క్వారంటైన్‌లో వందలాది మంది ఉన్నారు. లాక్‌డౌన్‌ విధించడంతో పూర్తిస్థాయిలో పరిస్థితి చక్కపడ్డప్పటికీ సడలింపు నివ్వడంతో పరిస్థితులు మారాయి. ప్రధానంగా నిబంధనలను పట్టించుకోకుండా వ్యవహరించడం కేసుల సంఖ్య పెరుగు తుంది. ఎక్కువ శాతం మంది పనిలేకపోయినా బయటికి వస్తు న్నారు. అవసరం లేకపోయినా మాల్స్‌కు వెళ్లి తిరుగుతున్నా రు.ప్రభుత్వం  ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నా చాలా మం దిలో మార్పు రావడం లేదు. మాకు వస్తుందా అనే నిర్లక్ష్యం నుంచి బయటికి రాండి.తస్మాత్‌ జాగ్రత్త..!

ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటించాలి..

  స్వీయ నియంత్రణ చాలా ముఖ్యం. ఎవరికి వారు కచ్చితంగా నిబంధనలు పాటించాలి. ముఖ్యంగా చేతులు శుభ్రం చేసుకోవాలి. గ్లౌ జులు వేసుకుంటే కొంతవరకు కాపాడుకోవచ్చు. బయటకు వస్తే ఎవరినీ తాకకుండా ఇంటికి వెళ్లాలి. ఒక వేళ ఎవరినైనా తాకినా ఇంటికి వెళ్లి  వెంటనే దుస్తులు బయటనే విడిచి లోపలికి వెళ్లాలి. మనం జాగ్రత్తగా ఉంటే చాలదు ఎదుట వారు అలా ఉండరు కాబట్టి శుభ్రత పాటించాల్సి ఉంటుంది. బయట వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి.  ఎక్కువ జనం వచ్చే ప్రదేశాలకు వెళ్లడం కూడా మానేయాలి. బస్‌లో ప్రయాణం తప్పని సరైతే శానిటైజర్‌తో వెళ్లి ఇంటికి రాగానే స్నానం చేసిన తర్వాతే ఇంట్లోకి వెళ్లడం ఉత్తమం.

-డాక్టర్‌ రమేశ్‌. భద్రాద్రి జిల్లా ఆసుపత్రి సమన్వయ కర్త

అప్రమత్తతే రక్షణ కవచం..

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్న నిబంధనలను పాటించి వైరస్‌ మహమ్మారి నుంచి రక్షించు కునేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బయటకు వెళ్లినప్పుడు ముఖానికి మాస్కులు ధరించి, ప్రతి  ఒక్కరూ తప్పకుండా భౌతిక దూరం పాటించాలి. లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత ప్రజలు కరోనా వైరస్‌ వ్యాప్తి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 60 సంవత్సరాలు దాటిన వారు, 10 సంవత్సరాలలోపు చిన్నారులు బయటకురాకుండా స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది. ఎవరికివారు ప్రభుత్వం పైనే ఆధారపడకుండా జాగ్రత్తలు తీసుకుంటే సమాజానికి మేలు జరుగుతుంది. ఆరోగ్య సమాజాన్ని నిర్మించేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాల్సిన అవసరం ఉంది. 

-డాక్టర్‌ బి. మాలతి, ఖమ్మం జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిణి

  ప్రజల్లో మార్పు అవసరం..

కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరూ పోలీస్‌ యంత్రాం గానికి సహకరించాల్సిన అవసరం ఉంది. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా మేం నిరం తరం విధులు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ విధివిధానాలను నిరంతరం అమలు చేసేందుకు కృషి చేస్తున్నాం.  ప్రజల్లో మార్పు అవసరం. ప్రభుత్వ లక్ష్యా న్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. వైరస్‌ అనేది వ్యాప్తి చెందకుండా అన్ని వర్గాలు అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. కేవలం పోలీసులు మాత్రమే నిబం ధనలు అమలయ్యే విధంగా కార్యక్రమాన్ని చేపట్టాలని అనుకోవడం బాధ్యతా రాహిత్యం. వ్యాపార వర్గాలు, ప్రజలు, యువకులు ముందుకు వచ్చి కరోనా వైరస్‌ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. మేము లాక్‌డౌన్‌ సమయంలో పకడ్బందీగా 24 గంటలు విధులు నిర్వహించాం. ప్రజల కోసం మేము ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడుతున్నాం. అలాంటిది మేము చేస్తున్న విధి నిర్వహణలో ఒక్క శాతమైనా అన్ని వర్గాలు పాటించినైట్లెతే కరోనా కట్టడి తప్పకుండా జరుగుతుంది. ప్రజలు నిరంతరం బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. 

-తఫ్సీర్‌ ఇక్బాల్‌,ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌logo