సోమవారం 06 జూలై 2020
Khammam - Jun 06, 2020 , 01:25:22

జిల్లాలో 18కి చేరిన కరోనా కేసుల సంఖ్య

జిల్లాలో 18కి చేరిన కరోనా కేసుల సంఖ్య

మయూరిసెంటర్‌:  జిల్లా కేంద్రంలో మరో రెండు కరోనా కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 18కి చేరింది.

మధిర యువకుడికి...

మధిర మండలానికి చెందిన పాతికేళ్ల యువకుడు సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో బ్యాంక్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. క్యాన్సర్‌తో బాధపడుతున్న తన తల్లిని 20 రోజుల క్రితం హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ మూడు రోజులు తల్లితోపాటు ఉన్నాడు. ఆ తరువాత సూర్యాపేటలోని అంజనాపురం కాలనీలోని తన నివాసానికి వచ్చాడు. బ్యాంక్‌ విధులకు వెళ్లొస్తున్నాడు. జలుబు, దగ్గు, జ్వరం రావడంతో స్వచ్ఛందంగా ఈ నెల 2న ఖమ్మంలోని ప్రభుత్వ ప్రధాన ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. రిపోర్టులో అతడికి పాజిటివ్‌గా తేలింది. శుక్రవారం సాయంత్రం ఈ రిపోర్ట్‌ వచ్చింది.

ఖమ్మం వ్యాపారికి...

మరో పాజిటివ్‌ కేసు కూడా నమోదైంది. ఖమ్మం నగరంలోని త్రీ టౌన్‌ డాబాల బజార్‌కు చెందిన 50 ఏళ్ల వయసున్న వ్యాపారికి దగ్గు, జలుబు, జ్వరం ఉన్నాయి. ఆయన నాలుగు రోజుల క్రితం ఖమ్మంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. అతడికి కరోనా పాజిటివ్‌గా శుక్రవారం సాయంత్రం రిపోర్ట్‌ వచ్చింది.

‘గాంధీ’కి తరలింపు...

వీరిద్దరినీ హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు తరలించారు.  వీరిద్దరితో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 18కి చేరింది.


logo