ఆదివారం 05 జూలై 2020
Khammam - Jun 05, 2020 , 02:01:20

పారి‘శ్రామికులకు’ ఆహ్వానం

పారి‘శ్రామికులకు’ ఆహ్వానం

  • ఖమ్మం జిల్లాలో పారిశ్రామిక రంగానికి పెద్దపీట..
  • ఔత్సాహికులకు ప్రోత్సాహం..
  • భారీగా రాయితీలు..
  • 367 మంది దరఖాస్తు.. 
  • 316 మందికి అనుమతులు

ఖమ్మం, నమస్తే తెలంగాణ : ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలవాలని-ఎదగాలని ఆరాటపడుతున్న వారికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆహ్వానం పలుకుతున్నది. శ్రమిస్తామని, పారి‘శ్రామిక’వేత్తలుగా మారుతామని ముందుకొచ్చే వారికి చేయూతనిస్తున్నది. వారి ఆశలను.. ఆకాంక్షలను నెర వేర్చేందుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. జిల్లాలోని ఔత్సాహిక పారిశ్రామికులకు ప్రోత్సాహకాలను అందిస్తున్నది. ఇందుకు తగిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నది.

ఇదిగో... ఇలా..

వ్యక్తిగతంగాగానీ, సమూహంగాగానీ ఏదేని పరిశ్రమను స్థాపించేందుకు ముందుకొచ్చే వారికి ప్రభుత్వం ఆహ్వానం పలుకుతున్నది. నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా జిల్లాలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను జిల్లా పరిశ్రమల శాఖ ప్రోత్సహిస్తున్నది. తెలంగాణ స్టేట్‌ ఇండస్ట్రియల్‌ ప్రాజెక్ట్‌ అప్రూవల్‌ అండ్‌ సెల్ఫ్‌ సర్టిఫికెట్‌ సిస్టం(టీఎస్‌ ఐపాస్‌)ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఔత్సాహికులు ఈ టీఎస్‌ ఐపాస్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. పరిశ్రమ స్థాపించదలిచిన వారు అందుకు అవసరమైన భూమిని, శ్రామికులను, మూలధనాన్ని, వసతులను సమకూర్చుకోవాలి.

ఆర్థిక వనరులను స్వయంగాకానీ, బ్యాంక్‌ రుణం రూపంలోగానీ సిద్ధం చేసుకోవాలి. పరిశ్రమ నెలకొల్పేందుకు అవసరమైన కార్యకలాపాలన్నీ పూర్తి చేసుకున్న తరువాత టీఎస్‌ ఐపాస్‌ ద్వారా పరిశ్రమల కేంద్రంలో నమోదు చేసుకోవాలి. ఇవన్నీ సక్రమంగా-సంతృప్తికరంగా ఉన్నట్లయితే ప్రభుత్వం నుంచి కొన్ని రాయితీలను పొందేందుకు అవకాశముంటుంది. పరిశ్రమ స్థాపనకు అనుమతి కోరుతూ 2019-2020 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 367 మంది జిల్లా పరిశ్రమల శాఖకు దరఖాస్తు చేశారు. వీటిలో 316 దరఖాస్తులకు అధికారులు అనుమతి మంజూరు చేశారు.

రాయితీల వివరాలు ఇవిగో.. 

ఖమ్మం జిల్లాలో ప్రధానంగా గ్రానైట్‌, రైస్‌ మిల్లులు, జిన్నింగ్‌ మిల్లులు, ఫ్లైయాష్‌ బ్రిక్స్‌ తదితర పరిశ్రమలను నెలకొల్పేందుకు ఎక్కువమంది దరఖాస్తు చేసుకుంటున్నారు. జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహలు అందిస్తున్నది. రూ.25 లక్షల లోపు పెట్టుబడి కలిగిన పరిశ్రమను సూక్ష్మ పరిశ్రమగా, రూ.25 లక్షల నుంచి రూ.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే పరిశ్రమలను చిన్న తరహా పరిశ్రమలుగా, రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వ్యయంతో కూడిన యంత్రాలతో ఏర్పాటు చేసే పరిశ్రమలను మధ్యతరహా పరిశ్రమలుగా ప్రభుత్వం వర్గీకరించింది. వీటి ఏర్పాటుకు రాయితీలను ఇస్తున్నది. రూ.2 లక్షలతో పరిశ్రమను నెలకొల్పిన పురుషులకు 15 శాతం, మహిళలకైతే అదనంగా మరో 10 శాతం (మొత్తం 25 శాతం) రాయితీ ఇస్తున్నది.

మహిళలను పారిశ్రామికంగా ప్రోత్సహించేందుకు ఇలా రాయితీ ప్రకటించింది. సామాజికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీలకు మరిన్ని రాయితీలు ఇస్తున్నది. రూ.75 లక్షల వ్యయంతో పరిశ్రమలు నెలకొల్పే ఎస్సీ, ఎస్టీ పురుషులకు 35 శాతం వరకు, మహిళలకు 45 శాతం వరకు ప్రోత్సాహక రాయితీ ఇస్తున్నది. ఈ రాయితీతోపాటు మరికొన్ని ప్రోత్సాహకాలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. పరిశ్రమ స్థాపించిన ఐదేళ్లపాటు పావలా వడ్డీతో రాయితీ ఇస్తుంది. విద్యుత్‌ చార్జీలపై ఐదేళ్లపాటు యూనిట్‌కు ఒక్క రూపాయి చొప్పున రాయితీ ఇస్తుంది. సేల్స్‌ ట్యాక్స్‌పై ఐదేళ్లపాటు వందకు వంద శాతం రాయితీ ఇస్తుంది. అనుమతి పొందిన ఆరు నెలల్లోగా పరిశ్రమ ఏర్పాటు చేసుకున్నప్పుడు మాత్రమే ఈ రాయితీలన్నీ వర్తిస్తాయి. సంవత్సరం లోపు ఏర్పాటు చేసుకున్నట్లయితే సగం రాయితీలు అందుతాయి.

జిల్లాలో పలు రకాల పరిశ్రమలను స్థాపించేందుకు అవకాశాలున్నాయని జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు చెబుతున్నారు. పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా ఆర్థిక స్థిరత్వం సాధించవచ్చని, జిల్లా కూడా ఆర్థిక ప్రగతి దిశగా పయనిస్తుందని అంటున్నారు. ఇదంతా చదివిన తరువాత& ఏదేని పరిశ్రమ స్థాపించాలని తీవ్రంగా ఆలోచిస్తున్నారా..? ఇంకెందుకు ఆలస్యం...! తగినంత కసరత్తు చేసి, సమగ్ర ప్రణాళిక (ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌)తో జిల్లా పరిశ్రమల శాఖ అధికారులను సంప్రదించండి. ఆల్‌ ది బెస్ట్‌!!


logo