ఆదివారం 05 జూలై 2020
Khammam - Jun 05, 2020 , 01:47:31

ఖమ్మం నగర పాలక సంస్థపై మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సమీక్ష

ఖమ్మం నగర పాలక సంస్థపై మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సమీక్ష

  • కార్పొరేషన్‌ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి 
  • ఫుట్‌పాత్‌ల నిర్మాణం, గ్రీనరీకి ఏర్పాట్లు, జంక్షన్ల  అభివృద్ధికి కార్యాచరణ 
  • విలీన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన..
  • హాజరైనకలెక్టర్‌ కర్ణన్‌, కార్పొరేషన్‌ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి
  • ఈ నెల మూడో వారంలో నగరంలో పర్యటించనున్న యువనేత

“సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నది.. అందుకనుగుణంగా ప్రజలకు మౌలిక వసతుల కల్పనే   పరమావధిగా యంత్రాంగం పని చేయాలి.. క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి...” అని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.. గురువారం హైదరాబాద్‌లో ఏసీ గార్డెన్స్‌లోని పురపాలక శాఖ కాంప్లెక్స్‌లో మంత్రి ఖమ్మం, వరంగల్‌ నగరపాలక సంస్థల కార్యకలాపాలపై చర్చించారు.  ఈ సందర్భంగా ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలో ఫుట్‌పాత్‌ల నిర్మాణం, గ్రీనరీ, జంక్షన్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విలీన పంచాయతీల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. గ్రామాల్లో చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈనెల మూడో వారంలో పనుల  పర్యవేక్షణకు స్వయంగా వస్తానని పేర్కొన్నారు. సమీక్షలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌,  కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.   

-ఖమ్మం, నమస్తే తెలంగాణ 

ఖమ్మం, నమస్తే తెలంగాణ: పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దృష్టి సారించింది. అలాగే ఇతరత్ర సమస్యల పరిష్కారానికి ప్రణాళికను రూపొందిస్తున్నది. ఇందులో భాగంగా గురువారం ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌పై హైదరాబాద్‌లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి  కేటీఆర్‌ సమీక్షించారు. ఖమ్మం నగరాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి కేటీఆర్‌.. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, కలెక్టర్‌, కమిషనర్లకు సూచించారు. పట్టణ ప్రాంతాల్లో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి అవసరమైన చర్యలను తీసుకోవాలన్నారు. నిరంతరం అభివృద్ధి చెందుతున్న ఖమ్మం పట్టణంలో పేదలకు వసతి సౌకర్యాలను కల్పించాలని సూచించారు.

జిల్లాలోని పలు పట్టణాలతో పాటు ఖమ్మం నగరంలో కూడా మౌలిక వసతుల కల్పనకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రజావసరాలకు అనుగుణంగా ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. పురపాలకశాఖ నుంచి అవసరమైన నిధులను అందజేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి కేటీఆర్‌ వివరించారు. మౌలిక వసతుల నిర్మాణ కార్యక్రమాల్లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. నిర్మాణ పనుల్లో అలసత్వం వహించే కాంట్రాక్టర్ల నుంచి ఆ పనులను తొలగించి ఇతరులకు బాధ్యతలు అప్పజెప్పాలని అధికారులను ఆదేశించారు. ప్రజా రవాణాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలని అన్నారు. తాగునీటి కొరత లేకుండా మరిన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహించకుండా నిరంతరం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. నగరాలతో పాటు, పట్టణాల్లో పలు గ్రామాలు విలీనమయ్యాయని, వాటిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. నూతన మున్సిపల్‌ చట్టం ప్రకారం వాటి అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయించి ఆయా ప్రాంతాల్లో డ్రైనేజీలు, రోడ్లు, తాగునీరు, గ్రీనరీకీ అవసరమైన తక్షణ చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. తానే స్వయంగా ఈ నెల మూడో వారంలో ఖమ్మం నగరంలో పర్యటించి జరుగుతున్న అభివృద్ధ్దిని పరిశీలిస్తానన్నారు.

ఖమ్మం నగరాభివృద్ధికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తీసుకుంటున్న ప్రత్యేక చర్య అభినందనీయమని అన్నారు. ఆయన నగరంలో అనేక ప్రాంతాల్లో నిరంతరం పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటు నగరాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారని పేర్కొన్నారు. నగరంలో నిరుపేదలను గుర్తించి వారి అభ్యున్నతికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.  హైదరాబాద్‌లోని ఏసీ గార్డెన్స్‌లోని పురపాలక శాఖ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ సమీక్షలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహిళా శిశుసంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌, ఖమ్మం కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి  పాల్గొన్నారు.logo