సోమవారం 06 జూలై 2020
Khammam - Jun 04, 2020 , 03:23:01

ఇల్లెందు రూపురేఖలు మారుస్తా..

ఇల్లెందు రూపురేఖలు మారుస్తా..

స్కిల్‌ డెవలప్‌మెంట్‌, మల్టీయుటిలిటీ,  పార్కుతో కొత్తకళ

ఎమ్మెల్యే బానోతు హరిప్రియ 

అభివృద్ధి పనులకు శంకుస్థాపన 

ఇల్లెందు : రానున్న రెండేళ్లలో ఇల్లెందు రూపురేఖలు మారుస్తానని ఎమ్మెల్యే బానోతు హరిప్రియనాయక్‌ అన్నారు. పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని తెలిపారు. బుధవారం ఇల్లెందు పట్టణంలోని 24వ వార్డులో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, 19వ వార్డులో మల్టీ యుటిలిటీ సెంటర్‌, 13వ వార్డులో పార్కుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రూ.1.50 లక్షలతో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, రూ.1.36 లక్షలతో మల్టీ యుటిలిటీ సెంటర్‌, రూ.1.30 లక్షలతో పార్కు నిర్మిస్తున్నట్లు తెలిపారు. మున్ముందు బుగ్గవాగు కరకట్ట, ఇల్లెందు బస్‌డిపో మంజూరయ్యే అవకాశం ఉందన్నారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. ఘనచరిత్ర ఉన్న ఇల్లెందుకు ఇంతవరకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌, మల్టీ యుటిలిటీ లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఇవి పూర్తయితే ఇల్లెందుకు నూతన కళ సంతరించుకుంటుందని తెలిపారు. ప్రతి వీధి, డ్రైనేజీలు పరిశుభ్రంగా పచ్చదనంతో విరసిల్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ఆకాంక్ష అని గుర్తుచేశారు. వారి ఆదేశాల మేరకు పట్టణాభివృద్ధి చేశామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ దిండిగాల రాజేందర్‌, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు పులిగళ్ల మాధవరావు, వైస్‌ చైర్మన్‌ ఎస్‌డీ జానీ, ఫ్లోర్‌ లీడర్‌ కొక్కు నాగేశ్వరావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


logo