సోమవారం 06 జూలై 2020
Khammam - Jun 04, 2020 , 03:20:24

పైసా ఖర్చు లేకుండా ‘డబుల్‌'ఇండ్లు

పైసా ఖర్చు లేకుండా ‘డబుల్‌'ఇండ్లు

  • ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

సత్తుపల్లి : అర్హులైన ప్రతి పేదవాడికి పైసా ఖర్చు లేకుండా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డబుల్‌బెడ్‌రూం ఇండ్లు కట్టించి ఇస్తుందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. బుధవారం మండలంలోని సిద్ధారంలో నూతనంగా నిర్మించిన 30 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను ఆయన కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్యేయమని అన్నారు. సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మిస్తుందన్నారు.

పార్టీలకతీతంగా లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్లు ఇస్తున్నామని చెప్పారు. కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ మాట్లాడుతూ.. అర్హులైన నిరుపేదలకు వారి సొంత స్థలాల్లోనే డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తుందని అన్నారు.  అనంతరం ట్రైనీ కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి,   ఆదర్శ్‌సురభిను ఎమ్మెల్యే సన్మానించారు.  పట్టణ ప్రగతిలో భాగంగా సత్తుపల్లి మున్సిపాలిటీలోని రాజీవ్‌నగర్‌ కాలనీలో పర్యటించి పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. గౌరిగూడెంలో రూ.5లక్షలతో నిర్మించిన నూతన సీసీ రోడ్డు, నూతనంగా నిర్మించిన వైకుంఠధామాన్ని ఎమ్మెల్యే, కలెక్టర్‌ ప్రారంభించారు. సదాశివునిపేటలో ఇంకుడుగుంత, నర్సరీలను పరిశీలించారు. నర్సరీలో 100 రకాల ఔషధ మొక్కలు ఉండటాన్ని చూసి సర్పంచ్‌ తుమ్మూరు సరస్వతిని అభినందించారు. అసిస్టెంట్‌ కలెక్టర్‌ మొగిలి స్నేహలత డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. 


logo