గురువారం 09 జూలై 2020
Khammam - May 31, 2020 , 04:06:00

నియంత్రిత సాగుతో ఆర్థికాభివృద్ధి

నియంత్రిత సాగుతో ఆర్థికాభివృద్ధి

నేలకొండపల్లి:  రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రైతు చుట్టూనే పరిపాలన సాగుతున్నదని, రైతు సంక్షేమ కార్యక్రమాలను సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెంలో నియంత్రిత పంటల సాగు విధానంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ముఖ్యఅతిథిగా మంత్రి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గడిచిన ఆరేళ్లలో ప్రతి రైతుకూ ధైర్యం ఏర్పడిందని, రైతు అభివృద్ధి చెందేలా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతుబీమాతో పాటు విత్తనాలు, ఎరువులు     పండించిన పంటను సైతం ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదన్నారు. దేశంలో ఎఫ్‌సీఐ ద్వారా 83 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించగా, అందులో తెలంగాణలోనే 50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించారని తెలిపారు. రాష్ట్రంలో రైతుల కోసం 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌  చేసి క్లస్టర్‌కు ఒక రైతు వేదికను ప్రభుత్వం నిర్మిస్తున్నదని, భవిష్యత్తులో రైతులందరూ వీటి ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. ఒకప్పుడు ప్రాజెక్ట్టులకు శంకుస్థాపన చేస్తే శిలాఫలకాలు తప్ప, పనులు ఎక్కడా కనపడేవికావని, ఇప్పుడు..  సీఎం కేసీఆర్‌ మూడు సంవత్సరాల్లోనే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి చూపించారన్నారు. త్వరలో జిల్లాలోని సీతారామా  పాలేరు వరకు గోదావరి జలాలు రాబోతున్నాయని, ఇందుకు రూ.15 వేల కోట్లతో ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నట్లు చెప్పారు. సాగర్‌ పరిధిలో 3 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ ఉన్నదని, గోదావరి జలాలు వస్తే మరో మూడు లక్షల ఎకరాల ఆయకట్టును పెంచుకోవచ్చన్నారు. రైతులను సమన్వయ పరిచేందుకు, విభిన్న పంటలు వేసుకునేలా రైతుబంధు సమితులను బలోపేతం చేయనున్నట్లు చెప్పారు. అందులో భాగంగా సీఎం కేసీఆర్‌ నియంత్రిత పంటల సాగు విధానం అమలు చేస్తారన్నారు. జిల్లాలో పెద్దగా పంటల మార్పు ఉండదని, వానకాలంలో మొక్కజొన్న బదులు కంది పంటలను వేసుకుంటే పంటల సమగ్ర విధానాన్ని పూర్తిగా అవలంబించిన వాళ్లమవుతామన్నారు. రైతాంగానికి ఉపయోగపడే విధంగా పంటలను సాగు చేసుకోవాలన్నారు. 25 శాతం రైతు రుణమాఫీ నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని, రైతుబంధు ద్వారా ఏడాదికి రూ.14వేల కోట్లు ఇస్తున్నట్లు చెప్పారు. వానకాలానికి సంబంధించి రైతులకు పంట పెట్టుబడి అందించేందుకు రూ.7 వేల కోట్లను వ్యవసాయశాఖకు అందించడం జరుగుతుందని, అందులో రూ.3వేల కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. 

    పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతుకు ఏవిధంగా లాభం చేకూరాలో ఆలోచించి సీఎం కేసీఆర్‌ నియంత్రిత పంటల సాగు పద్ధతిని అమలు చేస్తున్నారని తెలిపారు. రైతులు కూడా అధికారుల సూచనల మేరకు పంటలను సాగు చేసుకొని లాభం పొందాలన్నారు. కలెక్టర్‌ కర్ణన్‌ మాట్లాడుతూ.. రైతులు వానకాలంలో మొక్కజొన్న వేయవద్దని, దానికి బదులు కంది సాగు చేసుకోవాలన్నారు. పత్తిని సాగు చేసే రైతులు అంతర పంటగా కందిని వేసుకోవడం చాలా మంచిదన్నారు. రైతులెవరూ పొలాలను కాలబెట్టొద్దని, అలా ఎవరైనా చేస్తే వారిపై చర్యలు ఉంటాయన్నారు. అనంతరం రైతులకు రాయితీపై విత్తనాలను మంత్రి పువ్వాడ, ఎమ్మెల్యే కందాల, కలెక్టర్‌ కర్ణన్‌ అందజేశారు. ఈ అవగాహన సదస్సులో డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయాధికారిణి ఝాన్సీలక్ష్మీకుమారి, ఆర్డీవో రవీంద్రనాథ్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ మరికంటి ధనలక్ష్మి, ఎంపీపీ వజ్జా రమ్య, సర్పంచ్‌ ఉన్నం బ్రహ్మయ్య, ఎంపీటీసీ మేళ్లచెరువు అరుణకుమారి, ఆత్మా డివిజన్‌ అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి, రైతుబంధు మండల కన్వీనర్‌ యడవల్లి సైదులు, జిల్లా ఉద్యానశాఖ అధికారి అనసూయ, ఏడీఏ విజయ్‌చంద్ర, సొసైటీ చైర్మన్‌ తన్నీరు సత్యనారాయణ, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

వైకుంఠధామాన్ని ప్రారంభించిన మంత్రి 

మండలంలోని ముజ్జుగూడెంలో రూ.11.84 లక్షలతో నిర్మించిన వైకుంఠధామాన్ని  అజయ్‌కుమార్‌ శనివారం ప్రారంభించారు. వైకుంఠధామంలో నిర్మించిన గదులను ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందాల మాట్లాడుతూ.. ముజ్జుగూడెం వైకుంఠధామాన్ని మోడల్‌గా నిలపాలన్నారు. గ్రామస్తులు సైతం రూ.2.50లక్షలు వితరణ ఇవ్వడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రూ.50 వేలను వైకుంఠధామం అభివృద్ధికి మంత్రి చేతులమీదుగా సర్పంచ్‌ ఉన్నం బ్రహ్మయ్యకు అందజేశారు.


logo