ఆదివారం 05 జూలై 2020
Khammam - May 30, 2020 , 02:46:10

రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ చేయూత

రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ చేయూత

  • వరిలో సన్నాల సాగుకు ప్రాధాన్యత
  • పక్కా విజన్‌తో ‘వానకాలం-2020’
  • ప్రణాళికలు రూపొందించిన వ్యవసాయశాఖ
  • ఈ సీజన్‌లో మక్కల సాగుకు విరామం 
  • మొక్కజొన్న సాగుకు విరామం

రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తెలంగాణ సర్కార్‌ నడుం బిగించింది.. ఒకవైపు రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు రాయితీపై విత్తనాలు, ఎరువులు అందిస్తున్నది.. లాక్‌డౌన్‌ వంటి ఆపత్కాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేయని విధంగా ధాన్యం, మక్కలకు మద్దతు ధర ఇచ్చి స్వయంగా కొనుగోలు చేసింది.. తాజాగా రాష్ట్రంలో  నియంత్రిత సాగు విధానం అమలు చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నది.. ఇందులో భాగంగా మక్కల సాగుకు విరామమివ్వాలని, వరిలో సన్న రకాలు మాత్రమే సాగు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలు మాత్రమే సాగు చేసి లబ్ధిపొందాలని ఆకాంక్షించింది.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లాలో  మూడు లక్షల ఎకరాలకు పైగా రైతులు ‘సోనా’ పండించనున్నారు.

-భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ


భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తెలంగాణ సర్కార్‌ వ్యవసాయంలో అనేక నూతన ఒరవడులకు శ్రీకారం చుట్టింది. రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ, సబ్సిడీ  విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు అందిస్తూ ముందుకుసాగుతోంది. మూస పద్ధతికి స్వస్తిచెప్పి శాస్త్రీయ పద్ధతిలో పంట మార్పిడికి శ్రీకారం చుట్టింది. వరిలో దొడ్డురకానికి బదులు పూర్తిగా సన్నరకాలే వేయాలని, అందుకు రైతులను మానసికంగా సంసిద్ధం చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నుంచి వ్యవసాయ అధికారులకు సూచనలు అందాయి. దీంతో వ్యవసాయ అధికారులు నియంత్రిత పంటల సాగు విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వారి సందేహాలను నివృత్తి చేస్తూ సన్నరకాలను సాగు చేయడం ద్వారా వచ్చే ప్రయోజనాలను తెలుపుతూ సాగుకు సిద్ధం చేస్తున్నారు. 

వరిలో సన్న రకాలే మేలు..

వానకాలంలో వరిలో సన్నరకాలు వేయాలని ప్రభుత్వం సూచించింది. ముఖ్యంగా జిల్లాలో తెలంగాణ సోనా 40,960 ఎకరాల్లో, బీపీటీ సాంబ 39,992 ఎకరాల్లో, జేజీఎల్‌ 3600 ఎకరాల్లో, హెచ్‌ఎంటీ సోనా 800 ఎకరాల్లో, ఇతర సన్నరకాలు మరో 7 వేల ఎకరాల్లో సాగు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. పంటను యూనిట్‌గా తీసుకొని సాగు శాతాన్ని నిర్ణయించింది. జిల్లాలో 44 శాతం వరి వేయాలని, 60 శాతం పత్తి సాగు చేయాలని, ఇతర పంటలు మరో 14 శాతం సాగు చేయాలని, దొడ్డురకం వరి కూడా 61,507 ఎకరాల్లో సాగు చేయాలని  వ్యవసాయ ప్రణాళికలో పొందుపర్చింది. 

1,53,767 ఎకరాల్లో వరి సాగు

జిల్లాలో 4,50,345 ఎకరాల్లో పంటలు సాగు చేస్తుండగా అందులో 1,53,767 ఎకరాల్లో వరి వేస్తున్నారు. అందులో ఇంతకాలం ఎక్కువగా దొడ్డురకాన్ని సాగు చేశారు. ఇప్పుడు వ్యవసాయ అధికారుల వానకాలం 2020 ప్రణాళికలో దొడ్డురకాన్ని తగ్గించి 61,507 ఎకరాలకే పరిమితం చేశారు. ఎక్కువగా సన్నరకాలను సాగు చేసేలా రైతులను చైతన్యపరుస్తున్నారు. 40,960 ఎకరాల్లో తెలంగాణ సోనా రకం వరి సాగు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. 

వానకాలంలో మొక్కజొన్నకు చెల్లుచీటి

నీటిని ఎక్కువగా తీసుకొని భూమిలో ఉన్న సారాన్ని మొత్తం పీల్చుకునే మొక్కజొన్న పంటను వానకాలంలో సాగు చేయవద్దని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దానికి బదులు ప్రత్యామ్నాయ పంటలైన పత్తి, మిర్చి, కందులతో పాటు అంతర పంటలుగా జొన్నలు, మినుములు, పెసర్లు, వేరుశనగ వంటి వాణిజ్య పంటలను వేసుకోవాలని సూచిస్తున్నారు. మొక్కజొన్నను యాసంగిలో సాగు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. 

ఖమ్మం జిల్లాలో.. 

ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది 2.30 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసేలా జిల్లా వ్యవసాయశాఖ అధికారులు వానకాలం సాగు ప్రణాళిక సిద్ధం చేశారు. ఆయకట్టు ప్రాంతంలోని కొన్ని గ్రామాలు మినహా మిగిలిన అన్ని గ్రామాలు, మైదాన ప్రాంతాల్లో విరివిగా సన్నరకాల వరి సాగు జరుగనుంది. 1,72,500 ఎకరాల్లో సన్నరకం వరి సాగు చేయనున్నారు. మొత్తం వరి పంట సాగులో దాదాపు 75 శాతం సన్నరకమే సాగు జరుగనుంది. సన్న రకాల్లో మేలైన విత్తనాలైన తెలంగాణ సోనా, బీపీటీ-5204 (సాంబమసూరి), జేజీఎల్‌-284, హెచ్‌ఎంటీ సోనా, పూజా, గంగా కావేరీ వంటి రకాల విత్తనాలు వేయనున్నారు. ఇప్పటికే జిల్లా వ్యవసాయ యంత్రాంగం ఆయా సొసైటీలకు విత్తనాలను పంపిణీ చేసింది. 

నియంత్రిత సాగు విధానమే మేలు..

వానకాలం పంటలో వరి సన్నరకాలు వేయడం వల్ల రైతులకు లాభం చేకూరుతుంది. దొడ్డురకాలకు గిట్టుబాటు ధర ఉండదు. అందుకని ఆ రకాన్ని తగ్గించి ఎక్కువగా సన్నరకాలే సాగు చేయాలి. సన్నరకాల్లో ముఖ్యం గా తెలంగాణ సోనా మేలు రకమైన వంగడం. దీనిని పండించడం ద్వారా రైతు ఆర్థికంగా బలోపేతం కావచ్చు. మొక్కజొన్న సాగు చేయవద్దని ఇప్పటికే రైతులకు సూచించాం. ప్రత్యామ్నాయ పంటల వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించాం. ఇప్పటికే ఏవోలు, ఏ ఈవోలు అవగాహన కల్పిస్తున్నారు. 

-కొర్సా అభిమన్యుడు, డీఏవో, భద్రాద్రి కొత్తగూడెం 

logo