ఆదివారం 05 జూలై 2020
Khammam - May 29, 2020 , 00:45:44

విషాదాన్ని మరువలేక మృత్యుఒడికి..

విషాదాన్ని మరువలేక మృత్యుఒడికి..

2017లో ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి

మూడేళ్లుగా యువకుని మనో వ్యథ

నిశ్చితార్థానికి ముందురోజు ఆత్మహత్య

కూసుమంచి: మండలంలోని జీళ్లచెరువుకు చెందిన యువకుడు ఎస్‌కె.లాల్‌సాబ్‌(24) గురువారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం అతడి నిశ్చితార్థం జరుగాల్సి ఉంది. కానీ అతడు గురువారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాల్‌సాబ్‌ తన కుటుంబం మొత్తాన్ని 2017లో కోల్పోయాడు. ఒంటరివాడైన ఇతడిని సమీప బంధువులు చేరదీశారు. అన్నపురెడ్డిపల్లి సమీప ప్రాంతానికి చెందిన ఓ యువతితో పెళ్లి కుదిర్చారు. శుక్రవారం నిశ్చితార్థ్ధం జరుగాల్సి ఉంది.  గురువారం ఓ వెంచర్‌లో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఒంటరి జీవితం.. వెంటాడిన భూతం.. 

మూడేళ్ల క్రితం ఒక కాళరాత్రి వేళ.. కుటుంబం మొత్తాన్ని (తల్లిదండ్రులు, అన్నావదిన, వారి ఇద్దరు పిల్లలు) లాల్‌సాబ్‌ కోల్పోయాడు. అప్పటి నుంచి అతడు మానసిక ప్రశాంతతకు దూరమయ్యాడు. చాలా కాలంపాటు ఇంటి నుంచి బయటకు రాలేదు. అతడిని చిన్నమ్మ చేరదీసి ధైర్యం చెప్పింది. కానీ, ‘ఒంటరితనం’ అనే భూతం అతడిని వదల్లేదు. నిరాశకు.. నిస్పృహకు లోనయ్యాడు. ‘నాకు బతకాలని లేదు’ అని అనేకమార్లు తన బంధువులు, స్నేహితులతో చెప్పాడు. పెళ్లి చేస్తే తోడు దొరుకుతుందని, ఒంటరితనం దూరమవుతుందని బంధువులు ఆశించారు. అందరూ కలిసి వివాహానికి అతడిని ఒప్పించారు. అన్నపురెడ్డిపల్లి ప్రాంతానికి చెందిన అమ్మాయితో నిశ్చితార్థానికి శుక్రవారం ముహూర్తం పెట్టుకున్నారు. ఆ శుభ ఘడియకు ముందు రోజు ఈ లోకం నుంచి వెళ్లిపోయాడు. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. కూసుమంచి ఎస్సై అశోక్‌రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.

2017లో ఏం జరిగిందంటే...

రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ఆ దుర్ఘటన 17.7.2017న జరిగింది. ఆ రోజు అర్ధరాత్రి లాల్‌సాబ్‌ తల్లిదండ్రులు, అన్నావదినలు, వారి ఇద్దరు చిన్న పిల్లలు.. మొత్తం ఆరుగురు ఆ రోజు అర్ధరాత్రి.. పాలేరు చెరువులో శవాలుగా తేలారు. ఆ రోజు ఏం జరిగిందంటే.. జీళ్లచెరువులో పెంటూసాబ్‌ కుటుంబం నివసిస్తోంది. ఆయనకు భార్య మైబూబీ, పెద్ద కుమారుడు సలీం, చిన్న కుమారుడు లాల్‌సాబ్‌ (ఆత్మహత్య చేసుకుంది ఇతడే), పెద్ద కోడలు రజియా, మనుమరాళ్లు హసీనా, సోనీ ఉన్నారు. అందరూ కలిసే ఉంటున్నారు. ఇంట్లోకి దుష్ట శక్తులు వచ్చాయని అర్ధరాత్రి వేళ పాలేరు చెరువు ఒడ్డున మంత్రగాళ్లతో పూజలు చేయిద్దామని అందరినీ నమ్మించాడు. అర్ధరాత్రి పాలేరు కాలువ వద్దకు ముందుగా తన తండ్రి పెంటూసాబ్‌ను బైక్‌పై తీసుకెళ్లి నీటిలోకి నెట్టాడు. ఆ తరువాత పూజకు ముందు ఇలా కట్టుకోవాలట అని చెప్పి తల్లి, భార్య, ఇద్దరు పిల్లలను చీరతో కట్టి చెరువులోకి నెట్టేశాడు. అప్పటికే అక్కడకు కొంచెం దూరంలో బైక్‌పై వస్తున్న తన తమ్ముడు కనిపించడంతో.. సలీం ఎదురెళ్లి ఇంట్లో పూజ సామగ్రి ఉంది తీసుకురా.. అని  పంపించాడు. వెంటనే అదే చెరువులోకి దూకి సలీం కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి వెళ్లిన తమ్ముడు లాల్‌సాబ్‌  చిన్న గిన్నెలో పూజాసామగ్రికి బదులుగా అన్న సలీం రాసిన లేఖ ఉంది. ‘తమ్ముడూ.. అందరినీ చెరువులోకి నెట్టేసి చంపాను. నేను కూడా దూకి చనిపోతున్నా..’ అని ఉంది.  వెంటనే లాల్‌సాబ్‌ స్థానికులకు విషయం చెప్పి చెరువు వద్దకు వెళ్లేసరికి అక్కడ తన వాళ్లెవరూ కనిపించలేదు. తన తల్లిదండ్రులు, అన్నావదినలు, వారి ఇద్దరు పిల్లల మృతదేహాలను  బయటకు తీయించారు. అప్పటి నుంచి ఏకాకిగా మారిన లాల్‌సాబ్‌.. ఒంటరితనాన్ని భరింలేక బలవన్మరణాకి పాల్పడ్డాడు.


logo