సోమవారం 06 జూలై 2020
Khammam - May 29, 2020 , 00:45:52

నియంత్రిత వ్యవసాయమే చేస్తాం..

నియంత్రిత వ్యవసాయమే చేస్తాం..

 ప్రతిజ్ఞ చేసిన మేడేపల్లి గ్రామస్తులు 

 డిమాండ్‌ ఉన్న పంటలే సాగు చేయాలి

 జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు

  పంట వ్యర్థాలను తగులబెడితే కఠిన చర్యలు

 ఖమ్మం కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌

సర్కార్‌ సూచనల మేరకు నియంత్రిత పద్ధతిలో వ్యవసాయం చేస్తామని పలు గ్రామాల్లో రైతులు ప్రతిజ్ఞ చేస్తున్నారు. అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని, రైతులకు మంచి రోజులు రాబోతున్నాయని జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు అన్నారు.. గురువారం ముదిగొండ మండలంలోని         మేడేపల్లిలో  నియంత్రిత సాగు విధానంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతుల వద్దకు          వ్యాపారులే వచ్చి పంట కొనుగోలు చేసేలా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని, రైతులు డిమాండ్‌ ఉన్న పంటలే సాగు చేయాలని సూచించారు.  

ముదిగొండ : నియంత్రిత పద్ధతిలోనే వ్యవసాయం చేస్తామని మండలంలోని మేడేపల్లి గ్రామస్తులు అధికారుల సమక్షంలో ప్రతిజ్ఞ చేశారు. గురువారం మండలంలోని మేడేపల్లి గ్రామంలో నియంత్రిత సాగు విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్‌ లింగాల మాట్లాడుతూ.. డిమాండ్‌ ఉన్న పంటలే సాగు చేయాలని వివరించారు. రైతులకు మంచి రోజులు రాబోతున్నాయని, రైతుల వద్దకు వ్యాపారస్తులే వచ్చి పంట కొనుగోలు చేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని అన్నారు. అందుకే ప్రభుత్వం సూచించిన పంటలు వేస్తేనే అధిక లాభాలు వస్తాయన్నారు. ఈ వానకాలంలో మొక్కజొన్న పంటలు వేసి నష్టపోవద్దని సూచించారు. పత్తి పంట వేసుకోవచ్చన్నారు. అలాగే సన్నరకం వరిని సాగు చేయాలన్నారు. కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ మాట్లాడుతూ.. పత్తి పంటలో విత్తనాలను 40 అంగుళాల దూరంతో నాటుతున్నారని, అలా కాకుండా 30 అంగుళాల దూరంతో నాటి అంతర పంటలను సాగు చేయాలన్నారు. రైతులు పంట కోత తర్వాత వ్యర్థ్దాలను కాలుస్తున్నారని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం సొసైటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ సబ్సిడీలో ఇచ్చే జీలుగులు, పెసర విత్తనాలు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ప్రియాంక, మధిర డివిజన్‌ వ్యవసాయ శాఖ ఏడీ కొంగర వెంకటేశ్వర్లు, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఏఓ రాధ, ఎంపీపీ సామినేని హరిప్రసాద్‌, జడ్పీటీసీ పసుపులేటి దుర్గ, మేడేపల్లి సొసైటీ అధ్యక్షుడు సామినేని వెంకటేశ్వర్లు, సర్పంచ్‌ సామినేని రమేశ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మీగడ శ్రీనివాస్‌ యాదవ్‌ పాల్గొన్నారు. 


logo