బుధవారం 08 జూలై 2020
Khammam - May 29, 2020 , 00:47:59

విత్తనం.. పుష్కలం

విత్తనం.. పుష్కలం

ఉమ్మడి జిల్లాలో 96 కేంద్రాల్లో విక్రయాలు

సొసైటీల ద్వారా  పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు

కొనుగోలుకు వ్యవసాయశాఖ ఆమోదం తప్పనిసరి

దశల వారీగా సహకార సంఘాలకు సీడ్స్‌

వానకాలానికి 20 వేల క్వింటాళ్ల ఇండెంట్‌

వానకాలం వచ్చేస్తోంది.. రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు.. ప్రభుత్వం వారికి  చేయూతనిస్తూ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నది.. సీడ్స్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో సొసైటీల ద్వారా విత్తనాలు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది.. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో 96 కేంద్రాల ద్వారా పంపిణీ ప్రక్రియ జరుగనుండగా.. వరి, కంది, పెసర, మినుముల విత్తనాలు రైతుల  అవసరానికి  అనుగుణంగా అందనున్నాయి.. సర్కార్‌ ఆదేశాల మేరకు నాణ్యమైన విత్తనాలు అందజేసేందుకు వ్యవసాయశాఖ, సొసైటీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.. కృత్రిమ కొరత, అక్రమాలను నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు  చేపట్టింది.. ఆదేశాలు  అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకునేలా    నిబంధనలు అమలు  చేయనుంది..     

 ఖమ్మం వ్యవసాయం: వానకాలం సీజన్‌ విత్తనాల విక్ర యాలు కొన్ని సొసైటీల్లో ఇప్పటికే ప్రారంభమైంది. మిగిలిన అన్ని సొసైటీల్లో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సీజన్‌కు ముందుగానే అన్నదాతలకు విత్తనాలు అందించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేయడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో విత్తనాల విక్రయాలు ప్రారంభం కానున్నాయి. వానకాలం సీజన్‌కు సంబంధించి ప్రధాన పంటలైన వరి, కంది, పెసర, మినుముల విత్తనాలు తెలంగాణ సీడ్స్‌ కార్పొరేషన్‌ ద్వారా ఆయా సొసైటీలకు చేరుతున్నాయి. ఖమ్మం జిల్లాకు సంబంధించి 75, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి 21 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు విత్తనాలు అందించేందుకు వ్యవసాయశాఖ, సీడ్స్‌ కార్పొరేషన్‌ ఇప్పటికే సంయుక్తంగా ప్రణాళిక తయారు చేసుకున్నాయి. కొద్దిరోజుల నుంచి ఉమ్మడి జిల్లాలో పచ్చిరొట్టకు చెందిన జీలుగు, పిల్లి పెసర, జనుము వంటి విత్తనాల పంపిణీ కార్యక్రమం శరవేగంగా జరుగుతున్నది. వాటితోపాటు వరి పంటకు సంబంధించిన ఆయా రకాల విత్తనాలను సైతం రైతులకు అందజేస్తున్నారు. అయితే ఇప్పటికే పలు సొసైటీలు కొన్ని రకాల విత్తనాలను మాత్రమే పంపిణీ చేస్తున్నాయి. మిలిలిన సొసైటీలు అన్నదాతల ఆసక్తి, అవసరాలకు అనుగుణంగా విక్రయాలు జరుపనున్నాయి. మారుమూల గ్రామాల రైతులకు సైతం విత్తన కేంద్రాలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో విరివిగా విత్తనాల విక్రయ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పా టు చేస్తున్నది. ఇప్పటికే సీడ్స్‌ కార్పొరేషన్‌ ఆయా మండలాల వ్యవసాయ శాఖ అధికారులు, సొసైటీల బాధ్యులు ఇచ్చిన ఇండెంట్‌కు అనుగుణంగా విత్తనాలను సరఫరా చేశారు. కొద్దిరోజుల క్రితం తయారుచేసిన విత్తన ప్రణాళికకు మించి సీడ్స్‌ కార్పొరేషన్‌ జిల్లా కేంద్రంలో విత్తనాలను అందుబాటులో ఉంచింది. 

విత్తనాల కొనుగోలుకు ఏవో అనుమతి తప్పనిసరి

తెలంగాణ సీడ్స్‌ కార్పొరేషన్‌ సొసైటీలకు పంపిన విత్తనాలను కొనాలంటే రైతులు తప్పనిసరిగా మండల వ్యవసాయశాఖ అనుమతి కలిగి ఉండాలి. ఏవో ధ్రువీకరణ పత్రం ఉంటేనే సదరు రైతులకు సొసైటీల నిర్వాహకులు విత్తనాలు విక్రయిస్తారు. కృత్రిమ కొరత రాకుండా, ఇష్టారీతిన రైతులు విత్తనాలు కొనుగోలు చేయకుండా ఉండేందుకు వ్యవసాయశాఖ ఈ నిర్ణయం తీ సుకున్నది. దీనికి తోడు ఈ ఏడాది గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా వానకాలం కార్డులను వ్యవసాయశాఖ అధికారులు తయారు చేశారు. ఇందుకు అనుగుణంగానే ఆయా గ్రామాల రైతులకు సొసైటీ బాధ్యులు విత్తనాలు విక్రయిస్తారు. ఏ గ్రామంలో ఎంత మేర పంటల విస్తీర్ణం ఉందో అదే నిష్పత్తిలో విత్తనాల పంపిణీ జరిగేలా ప్రణాళిక తయారు చేశారు. పత్తి విత్తనాలు మినహా వరి, అపరాల విత్తనాలకు ఇదే నిబంధన వర్తించనుంది. 

ఏ ఒక్క రైతుకూ విత్తనాల కొరత ఉండదు

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రైతుల అవసరాలకు అనుగుణంగా  విత్తనాలను అందుబాటులో ఉంచాం. మన జిల్లాకు సరిపోయాక ఇతర జిల్లా రైతులకు సైతం వరి విత్తనాలతోపాటు అపరాల విత్తనాలను సైతం అందిస్తాం. రెండు జిల్లాల వ్యవసాయశాఖ అధికారులు ఇచ్చిన ఇండెంట్‌కు అనుగుణంగా ప్రణాళిక తయారు చేశారు. తక్షణం అవసరం వస్తే సొసైటీలకు ఏ రోజుకారోజు విత్తనాలను పంపిస్తాం. రైతులు విత్తనాలకు సంబంధించి ఎలాంటి అపోహలకు గురికావద్దు. 

-ఏ.రాజీవ్‌కుమార్‌, ఉమ్మడి ఖమ్మం జిల్లా సీడ్స్‌ మేనేజర్‌


logo