శనివారం 11 జూలై 2020
Khammam - May 28, 2020 , 01:15:59

విద్యుత్‌ ఉత్పత్తిలో రికార్డు..

విద్యుత్‌ ఉత్పత్తిలో రికార్డు..

  • వార్షిక మరమ్మతులు లేకున్నా 
  • దూసుకుపోతున్న పాల్వంచ కేటీపీఎస్‌ 9వ యూనిట్‌

పాల్వంచ:పాల్వంచ కేటీపీఎస్‌  థర్మల్‌ విద్యుత్‌ కర్మాగారం ఉత్పత్తిలో రికార్డులు  సృష్టిస్తున్నది. కేటీపీఎస్‌ ప్రాంగణంలో ప్రస్తుతం 1800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుండగా ఇందులో 5,6 దశల కర్మాగారం ఉత్పత్తి పరంగా తన సత్తాను చాటుకుంటున్నది. 5వ దశలోని 9వ యూనిట్‌ 250 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కర్మాగారం బుధవారం నాటికి వంద  రోజుల పాటు విద్యుత్‌ ఉత్పత్తిని నిరాటంకంగా కొనసాగిస్తున్నది. అలాగే  6వ దశలోని 11వ యూనిట్‌ 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కర్మాగారం కూడా 114 రోజుల పాటు నిరాటంకంగా ఉత్పత్తి చేసి 91.3శాతం పీఎల్‌ఎఫ్‌తో అగ్రగామిగా నిలిచింది. లాక్‌డౌన్‌ వంటి క్లిష్ట సమయంలో కూడా ఈ యూనిట్లలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఉత్పత్తి కొనసాగడం విశేషం. 9వ యూనిట్‌లో ప్రతి ఏడాది ఓవరాల్‌ పనులు చేయాల్సి ఉండగా మూడేళ్ల నుంచి వాటిని చేపట్టపోయినప్పటికీ విద్యుత్‌ ఉత్పత్తి  కొనసాగడంతో మరో రికార్డును సృష్టించింది. కేటీపీఎస్‌ ఏడో దశ 800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కర్మాగారంలో ఓవరాల్‌ పనులు పూర్తి చేసిన తర్వాత 9వ యూనిట్‌లో ఓవరాల్‌ పనులు చేయాలని టీఎస్‌ జెన్కో అధికారులు నిర్ణయించారు.

అనుకోని పరిస్థితుల్లో ఏడో దశ యూనిట్‌ నాలుగు నెలల పాటు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. దీంతో 9వ యూనిట్‌లో ఓవరాల్‌ పనులను వాయిదా వేశారు. ప్రస్తుతం ఎండాకాలం కావడంతో విద్యుత్‌కు డిమాండ్‌ ఉన్న తరుణంలో ఉత్పత్తి కొనసాగించాల్సిందేనని జెన్‌కో అధికారులు భావించి యూనిట్‌ను రన్నింగ్‌ చేసుకుంటూ వస్తున్నారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా యూనిట్‌లో ఉత్పత్తి జరుగుతుంది. ఈ సందర్భంగా కేటీపీఎస్‌ 5,6 దశల సీఈ రవీంద్రకుమార్‌ నేతృత్వంలో సీఈకి ఎస్‌ఈలు, ఇంజినీర్లు, అధికారులు స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు. అన్ని యూనిట్లలో కార్మికులకు స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఈలు అనీ ల్‌కుమార్‌, కాటం సంజీవయ్య, కృష్ణ, ఆరుద్ర, వరప్రసాద్‌, అనిల్‌కుమార్‌ ఇంజినీర్లు, కార్మికులు పాల్గొన్నారు. 


logo