గురువారం 02 జూలై 2020
Khammam - May 28, 2020 , 01:10:00

ఖమ్మం ఏఎంసీలో క్రయవిక్రయాలు షురూ..

ఖమ్మం ఏఎంసీలో క్రయవిక్రయాలు షురూ..

  • 70 రోజుల తరువాత కళకళలాడిన మార్కెట్‌ 
  • తొలి రోజు 8వేల మిర్చి బస్తాలు రాక 
  • స్క్రీనింగ్‌ పరీక్షల అనంతరం మార్కెట్‌లోకి అనుమతి
  • పరిశీలించిన చైర్మన్‌ మద్దినేని, డీఎంవో, సెక్రటరీ

ఖమ్మం వ్యవసాయం : సుదీర్ఘ సెలవుల అనంతరం బుధవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో పంటల క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. మార్చి 20వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్కెట్‌లో విక్రయాలు నిలిచిపోయాయి.  మిర్చి సీజన్‌ ప్రారంభమైన కొద్ది రోజులకే మార్కెట్‌ మూతపడటంతో జిల్లా రైతులతో పాటు పొరుగు జిల్లాల రైతులు ఇబ్బందులకు గురయ్యారు.    దీంతో పంటను కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున  రైతులు కోల్డ్‌స్టోరేజ్‌ల్లో నిల్వ చేసుకున్నారు. మరికొందరూ ఏమిచేయలేక ఇంట్లోనే నిల్వ చేసుకున్నారు. అయితే రైతుల ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఎట్టకేలకు నిబంధనలు పాటిస్తూ మార్కెట్‌లో క్రయవిక్రయాలు జరిపేందుకు షరతులతో కూడిన అనుమతులు  ఇచ్చింది. దీంతో బుధవారం నుంచి తిరిగి మార్కెట్‌లో క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి.

తొలిరోజున దాదాపు 1500 మంది రైతులు 9 వేల బస్తాల పంటను తీసుకొచ్చారు. వీటిలో మిర్చి పంట అధికంగా 8 వేల బస్తాలు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రభావం ఉన్న నేపథ్యంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. మార్కెట్‌ యార్డులకు వచ్చే వ్యాపారులు, కార్మికులు, రైతులకు యార్డు ముఖద్వారం వద్ద స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించి అనుమతించారు. ప్రతి గేటు  వద్ద ప్రత్యేకంగా తయారు చేసిన హ్యాండ్‌వాష్‌, శానిటైజేషన్‌ మిషన్లను ఏర్పాటు చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఉదయం జరిగిన జెండా పాటలో మిర్చి పంటకు గరిష్ఠ ధర రూ.13,400 ధర పలకగా, పత్తి పంటకు గరిష్ఠ ధర ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌లో రూ.4,400 చొప్పున ధరనిర్ణయించారు. పంటను తీసుకొచ్చిన రైతులు, కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వయంగా చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, సెక్రటరీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, జిల్లా మార్కెటింగ్‌ శాఖాధికారి కే. నాగరాజు పర్యవేక్షణ చేశారు. మూడు యార్డుల్లో వారు పర్యవేక్షించారు. పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో తొలిరోజు క్రయవిక్రయాలు ప్రశాంతంగా ముగిశాయి. 


logo