ఆదివారం 05 జూలై 2020
Khammam - May 27, 2020 , 02:01:05

జోరుగా ‘ఉపాధి’

జోరుగా ‘ఉపాధి’

మండలంలో చురుగ్గా సాగుతున్న ఈజీఎస్‌ పనులు

కరోనా లాక్‌డౌన్‌ కాలంలో పేదలకు చేతినిండా పని

రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలంలో ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతున్నాయి. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో నిరుపేదలకు ఈజీఎస్‌ పనులు ఆసరాగా నిలుస్తున్నాయి. ఉపాధి కోసం ఇతర రాష్ర్టాలకు, పట్టణాలకు వెళ్లిన పేదలు తిరిగి సొంతూళ్లకు చేరుకొని ఉపాధి హామీ పనులు చేసుకుంటున్నారు. ఫలితంగా మండలంలో ఏ గ్రామాన్ని పరిశీలించిన ఈజీఎస్‌ పనుల సందడి కనిపిస్తున్నది. 

గ్రామాల్లో ప్రజలు ఈజీఎస్‌ పనుల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల పట్ల ఆసక్తి చూపిన ప్రతి ఒక్కరికీ పని కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఉపాధి పనుల ద్వారా రోజుకు రూ.165 నుంచి రూ.237 వరకు కూలి అందుతుండటంతో నిరుపేదలు సంతోషిస్తున్నారు. జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారు సైతం ఇప్పుడు ఉపాధి పనుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో అధికారులు వారికి వెంటనే జాబ్‌కార్డులు మంజూరు చేస్తూ పనులు కల్పిస్తున్నారు. అయితే పని చేసే సమయంలో కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలను తప్పక పాటిస్తున్నారు. కూలీలందరూ మాస్కులు ధరిస్తూ, భౌతికదూరం పాటిస్తూ పనులు చే స్తున్నారు. అధికారులు సైతం  జాగ్రత్తలు చెబుతున్నారు.

40 పంచాయతీల్లోనూ పనులు..

మండలంలోని 40 గ్రామ పంచాయతీల్లోనూ ఉపాధి హామీ పనులు కొనసాగుతున్నాయి. నిరుటితో పోల్చితే ఈ ఏడాది పనులు చేసే వారి సంఖ్య పెరిగింది. ప్రస్తుతం మండలంలో నిత్యం ఉపాధి పనులు చేసే వారి సంఖ్య నాలుగు వేలకు చేరింది. గ్రామాల్లోని చెరువుల పూడికతీత, వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే రోడ్ల విస్తరణ, ఫాంపాండ్‌ నిర్మాణాలు వంటి పనులు చేపడుతున్నారు. చేసిన పనులకు సంబంధించి అధికారులు వారం రోజులకు ఒకసారి కూలీల బ్యాంకు ఖాతాల్లో కూలి డబ్బులు జమచేస్తున్నారు.

పని ప్రదేశంలో ఏర్పాట్లు..

రోజురోజుకూ పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉం చుకొని కూలీలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా అధికారులు పని ప్రదేశంలో అన్ని రకాల వసతులూ కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతుండడంతో వడ దెబ్బకు గురికాకుండా ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే పనులు చేయిస్తున్నారు. తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నారు. నీడ ఏర్పాటు చేస్తున్నారు. 

అడిగిన వారందరికీ పని కల్పిస్తున్నాం..

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పని ప్రదేశంలో నిబంధనలు పాటిస్తున్నాం. గ్రామంలో అడిగిన ప్రతి ఒక్కరికీ పని కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నిరుటికంటే ఈ ఏడాది కూలీల సంఖ్య పెరిగింది. వలస కూలీలు పని అడిగినా జాబ్‌కార్డు మంజూరు చేసి ఉపాధి కల్పిస్తున్నాం. పని ప్రదేశాల్లో అన్ని వసతులు సమకూర్చుతున్నాం. 

-బీ.కల్పన, పంచాయతీ కార్యదర్శి, ఏఆర్‌ బంజర       

పనులు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు..

లాక్‌డౌన్‌ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉపాధి హామీ పనులు కల్పిస్తున్నది. దీంతో ఈ పనులు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆదేశాల మేరకు ఉపాధి హామీ కూలీలకు బత్తాయిలు, మజ్జిగ ప్యాకెట్లు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మాస్కులు పంపిణీ చేశాం.”

-గుత్తా రవికుమార్‌, వైస్‌ ఎంపీపీ, రఘునాథపాలెం


logo