ఆదివారం 05 జూలై 2020
Khammam - May 25, 2020 , 00:16:25

సోలార్‌ ‘చెలిమ’

 సోలార్‌ ‘చెలిమ’

వన్యప్రాణుల కోసం నీటికుంటల ఏర్పాటు

వేటగాళ్ల కదలికలపై కెమెరాలతో నిఘా

కారేపల్లి రేంజ్‌లో ప్రయోగాత్మకంగా అమలు

ఏన్కూరు  : మండు వేసవి. నీటి సమస్య తీవ్రంగా ఉంటుంది. ఇక అడవుల్లోని ప్రాణుల సంగతి చెప్పక్కర్లేదు. వాగులు, వంకలు ఎండిపోయి నీరు దొరకని పరిస్థితి. నీటి కోసం ఒకవేళ అడవి దాటి వచ్చిన వన్యప్రాణులు వేటగాళ్ల ఉచ్చుకు బలికావాల్సిందే. ఈ నేపథ్యంలో అటవీశాఖ వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు చేపట్టింది. అడవిలోనే వన్యప్రాణుల దాహార్తి తీర్చడానికి నీటి కుంటలను ఏర్పాటు చేసింది. ఖమ్మం జిల్లాలోని కారేపల్లి అటవీశాఖ రేంజ్‌ ఏన్కూరు మండలం బురదరాఘవాపురం సెక్షన్‌ పరిధిలో తొలిసారిగా ప్రయోగాత్మకంగా సౌరశక్తి నీటి కుంటల పథకాన్ని ప్రారంభించింది. అడవుల్లో నీటి కుంటలు తవ్వించింది. సౌరశక్తి ద్వారా నడిచే బోర్ల నుంచి నీటిని ఈ కుంటలకు సరఫరా చేస్తున్నది. మొత్తం ఆరు నీటి కుంటలను ఏర్పాటు చేసి సోలార్‌ నీటి పంపుల ద్వారా సరఫరా చేస్తున్నారు. ప్రతి నిత్యం అటవీశాఖ సిబ్బంది ఈ కుంటలను ఎప్పటికప్పుడు నీటితో నింపుతున్నారు. వీటికి తోడు సహజ సిద్ధంగా ఉన్న చెలిమల్లో చెత్తాచెదారం, పూడిక తొలగించి నీరు ఊరే విధంగా కూడా చేస్తున్నారు. ఈ సెక్షన్‌ పరిధిలో సుమారు 8280 ఎకరాల్లో అటవీ విస్తీర్ణం ఉంది. దీని పరిధిలో 27 గ్రామాలున్నాయి. 

వివిధ రకాల వన్యప్రాణులు.. 

ఈ అడవిలో కొండగొర్రెలు, తోడేళ్లు, అడవిదున్నలు, అడవిబర్రెలు, అడవిపందులు, బుర్రజింకలు, కుందేళ్లు, కణుజులు, దుప్పులతో పాటు వివిధ  రకాల పక్షులు ఉన్నాయి. వీటన్నింటికీ ఈ నీటి కుంటలే ఆధారం. నీటి చెలిమల్లాగా ఈ సోలార్‌ చెలిమలు వన్యప్రాణుల దాహార్తిని తీరుస్తున్నాయి. అలాగే వన్యప్రాణులకు వేటగాళ్ల నుంచి ఎలాంటి హానీ జరుగకుండా ఉండేందుకు అడవుల్లో కెమెరాలను ఏర్పాటు చేశారు. వేటగాళ్ల కదలికలపై నిఘా ఉంచారు. అలాగే జంతువులను ఈ కెమెరాల ద్వారా గుర్తిస్తున్నారు. logo