ఆదివారం 05 జూలై 2020
Khammam - May 25, 2020 , 00:16:42

కళ తప్పిన కల్యాణం

కళ తప్పిన కల్యాణం

50 మంది లోపు అతిథుల మధ్యే..

 లాక్‌డౌన్‌తో వివాహ వేడుకలు వాయిదా

 ఒకవేళ జరిగినా 50 మంది అతిథుల మధ్యే..

 నిరాడంబరంగా పెళ్ల్లి తంతు

 పురోహితులు, కార్మికులకు ఉపాధి కరువు

 వెలవెలబోయిన వస్త్ర దుకాణాలు

 ఉసూరుమన్న టెంట్‌హౌస్‌ నిర్వాహకులు, ఫొటోగ్రాఫర్లు

ఆకాశమంత పందిళ్లు లేవు.. భూదేవంత వేదికలు లేవు.. సన్నాయి మేళాలు లేవు.. ఊరేగింపులు లేవు.. పెళ్లి పిలుపులు లేవు.. అప్పగింతలు లేవు.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పెళ్లి వేడుకలకు బ్రేక్‌ పడింది.. ఈ ప్రభావం కార్మికులపై పడింది.. ఒకటి, రెండు వేడుకలు జరిగినప్పటికీ  పరిమిత సంఖ్యలో హాజరైన అతిథుల సమక్షంలో నిరాడంబరంగా జరిగాయి..  లాక్‌డౌన్‌ కాలమంతా పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో వస్త్ర, నగల వ్యాపారమూ పడిపోయింది.. కల్యాణ మండపాలు వెలవెల బోయాయి.. టెంట్‌హౌస్‌, డీజే, డెకరేషన్‌, క్యాటరింగ్‌.. ఇలా అనేక రంగాల్లో పనిచేస్తున్న వారి ఉపాధి దెబ్బతిన్నది.. ఆర్థికంగా నష్టాలే మిగిలాయి.. మొత్తానికి                 ఈ ఏడాది ‘కల్యాణాలు’ కళతప్పాయి.

 -భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ ఖమ్మం కల్చరల్‌


మార్చి 22న జనతా కర్ఫ్యూతో ప్రారంభమైన లాక్‌డౌన్‌ సుమారు 50 రోజుల పాటు కొనసాగింది. సడలింపుల తర్వాత 50 మంది అతిథుల మధ్య వివాహ వేడుకలు నిర్వహించుకోవచ్చని ప్రకటన రావడంతో కొందరు పరిమిత కుటుంబ సభ్యుల మధ్య వివాహ వేడుకలు నిర్వహిస్తున్నారు. వచ్చే నెల 22 నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కానుండటంతో మున్ముందే పెళ్లిళ్లు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు జరిగిన వేడుకల్లో భౌతిక దూరం పాటిస్తూ, శానిటైజర్లు వినియోగిస్తూ అతిథులు వివాహ వేడుకలకు హాజరయ్యారు. ఫంక్షన్‌ హాల్స్‌ కూడా తెరిచేందుకు అవకాశం లేకపోవడంతో ఎవరి ఇంటి వద్దనే వారు నిరాడంబరంగా తంతు పూర్తి చేసుకుంటున్నారు.

ఉసూరుమంటున్న వస్త్ర, టెంట్‌, పూల వ్యాపారులు

ఏటా వేసవి ఆరంభంలో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుంటాయి. వస్త్ర దుకాణాలు, పూల దుకాణాల్లో సందడి వాతావరణం కనిపించేది. ఈ సీజన్‌లో ఎక్కువ అమ్మకాలు జరిగేవి. టెంట్‌హౌస్‌లు, బ్యాండ్‌ మేళాలు, క్యాటరింగ్‌, డెకరేషన్‌కు మంచి డిమాండ్‌ ఉండేది. లాక్‌డౌన్‌ వచ్చాక పరిస్థితి మారిపోయింది. ఆయా రంగాలపై ఆధారపడి జీవించే వారి స్థితిగతులు మారిపోయాయి. ఆదాయం లేకపోవడంతో వేలాది మంది కార్మికులపై ప్రభావం పడింది.

వెలవెలబోతున్న కల్యాణ మండపాలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 600 ఫంక్షన్‌ హాళ్లు ఉన్నాయి. ప్రతిరోజూ  ఏదో ఒక శుభకార్యం జరిగేది. గెట్‌ టు గెదర్‌, అన్నప్రాశన, జన్మదిన, పెళ్లి వేడుకలు.. ఇలా అన్నింటికీ ఫంక్షన్‌ హాళ్లపైనే ఆధారపడేవారు. వివాహ వేడుకలకు అయితే ఆర్థిక వనరులను బట్టి వారాల తరబడి సెట్టింగులు వేసిన సందర్భాలు ఉన్నాయి. ఏసీ హాళ్లయితే రోజుకు రూ.3 లక్షల వరకు వసూలు చేసిన సందర్భాలూ  ఉన్నాయి. చిన్న హాళ్లయితే రూ.50 వేల 

వరకు కిరాయి ఉంటుంది. కల్యాణ వేదిక సెట్టింగ్‌లకు కూడా రూ.2 లక్షల వరకు వెచ్చించిన సందర్భాలు ఉన్నాయి. ఇవి కాక సంగీత్‌, డీజే ఉంటాయి. వీటిపై ఆధారపడిన వందలాది మంది లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉపాధి కోల్పోయారు. మరోవైపు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ అందుబాటులోకి వచ్చినా ఆ రంగంలో ఉన్నవారు కూడా ఆర్థికంగా నష్టపోయారు.

తిరిగి వైభవం ఎప్పుడో..?

కరోనాతో సహజీవనం తప్పదా..? ఒకవేళ పరిస్థితి ఇలాగే కొనసాగితే కల్యాణ మండపాలు తిరిగి పూర్వ వైభవం పొందేదెప్పుడు..? అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు చూసే సమయం మళ్లీ వస్తుందా..? అనే విషయాలు ప్రస్తుతానికి ప్రశ్నార్థకాలే.. మరోవైపు తమ వ్యాపారాలు ఎప్పుడు గాడిన పడతాయోనని వ్యాపారులు, కూలి కోసం కార్మికులు ఎదురుచూస్తున్నారు.

ఎక్కడి సామగ్రి అక్కడే.. 

లాక్‌డౌన్‌ వల్ల రెండు నెలల నుంచి ఒక్క టెంట్‌ కూడా వేయలేదు. శుభకార్యాలు, ఇతరత్రా ఏ కార్యక్రమాలు లేకపోవడంతో సామగ్రి అంతా టెంట్‌హౌస్‌లోనే ఉన్నది. లాక్‌డౌన్‌ వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. రానున్న రోజులు ఏ విధంగా ఉంటాయో తలుచుకుంటే భయమేస్తుంది. ఆర్థికంగా చితికిపోయాం. కిరాయి కట్టడానికి కూడా ఇబ్బందిగా ఉంది. దీని నుంచి కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది.

-బన్సీలాల్‌, టెంట్‌హౌస్‌ నిర్వాహకుడు, కొత్తగూడెం

ఇబ్బంది పడుతున్నాం.. 

సాధారణంగా చైత్రం, వైశాఖం, జ్యేష్ఠ మాసాల్లో మంచి ముహూర్తాలు ఉంటాయి. వేసవి ఆరంభం నుంచి పంట చేతికొస్తుంది. డబ్బులు చేతిలో ఉండి శుభకార్యాలు చేసుకునే సమయం ఇది. ఈ సమయంలోనే లాక్‌డౌన్‌ వచ్చింది. రెండు నెలలుగా ఎలాంటి శుభకార్యాలూ లేకపోవడంతో పురోహితులు ఉపాధి కోల్పోయారు. పెళ్లిళ్ల సీజన్‌లో వచ్చే సంభావనతోనే వారు ఏడాదంతా కుటుంబాన్ని పోషించుకుంటారు. గృహ ప్రవేశాలు, శంకుస్థాపన  శుభకార్యాలు కూడా లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం.

 - తాటికొండాల సీతారామశాస్త్రి, వైదిక బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు, ఖమ్మం

ఫొటోగ్రాఫర్లను ఆదుకోవాలి 

ప్రస్తుతం ఫొటోగ్రాఫర్ల జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. ఏటా వేసవిలో వందల సంఖ్యలో వేడుకలు జరిగేవి కాబట్టి, అంతోఇంతో ఉపాధి దొరికేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కుటుంబాలు పోషించుకోవడం కష్టతరంగా ఉంది. ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుంది. ఈ పరిస్థితి నుంచి ఎప్పుడు బాగుపడతామోనని ఆందోళనగా ఉంది.

- ఎం.రామకృష్ణ, ఫొటోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు, కొత్తగూడెం


logo