శనివారం 06 జూన్ 2020
Khammam - May 23, 2020 , 23:38:04

లక్ష్యానికి చేరువగా ఇంటి పన్ను వసూళ్లు

లక్ష్యానికి చేరువగా ఇంటి పన్ను వసూళ్లు

ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌పై సంస్థ ప్రత్యేక దృష్టి 

ఇంటి పన్ను వసూలుపై ఐదు శాతం రాయితీ అస్త్రం..

కోవిడ్‌-19 ప్రభావంతో తగ్గిన రెవెన్యూ..

అన్ని మార్గాల్లో ఆదాయ పెంపునకు చర్యలు

ఖమ్మం, నమస్తే తెలంగాణ: కేఎంసీలో విలీనమైన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు, పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకు పాలకవర్గం ప్రత్యేక చర్యలు పడుతున్నది. ప్రధానంగా భూ క్రమబద్ధీకరణతోపాటు భవనాల క్రమబద్ధీకరణకు అవసరమైన చర్యలను చేపట్టి అమలు చేస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి భవనాల క్రమబద్ధీకరణకు అవసరమైన పనులను పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. భవనాల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను సేకరించి తక్షణమే అనుమతులు మంజూరు చేసేందుకు నగరపాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి పకడ్బందీ చర్యలు చేపట్టారు. సిబ్బంది తమ డివిజన్లలో దరఖాస్తు చేసుకున్న వారికి ఫోన్‌ ద్వారా సమాచారమిస్తూ తక్షణమే అనుమతులకు అవకాశం కల్పిస్తున్నామని చెబుతుండడంతో నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలాంటి ఆఫర్లు లేకపోవడం, ప్రస్తుతం లబ్ధిదారుల వద్దకే ప్రభుత్వ యంత్రాంగం వస్తుండడం వంటి కారణాలతో భవన నిర్మాణదారుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. దీని వల్ల కేఎంసీకి తక్షణమే రెవెన్యూ పెరుగుతుంది. ప్రజావసరాల కోసం ఆ మొత్తాన్ని వినియోగించే అవకాశం లభిస్తుంది. ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ వల్ల కేఎంసీకి రూ.కోట్లలో ఆదాయం సమకూరనుంది. బీఆర్‌ఎస్‌కు ఖమ్మం నగరంలో 4,185 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు వీటి ద్వారా రూ.16.50 కోట్ల ఆదాయం లభించింది. ఇంకా రూ.6.32 కోట్ల ఆదాయం రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం 4,185 దరఖాస్తులు అందగా అన్నింటినీ పరిశీలించారు. అందులో అన్ని ధ్రువీకరణ పత్రాలూ సక్రమంగా ఉన్న 3,570 మంది దరఖాస్తుదారులకు క్రమబద్ధీకరణ ఉత్తర్వులు మంజూరు చేశారు. ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం 18,048 దరఖాస్తులు అందాయి. వీటిల్లో అధికారులు 10,054 దరఖాస్తులను తక్షణమే పరిష్కరించి క్రమబద్ధీకరించారు. వివిధ కారణాల రీత్యా 497 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. మరికొన్ని దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటి వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు రూ.84.93 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది మరో రూ.2.95 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. 

పన్ను చెల్లింపుపై ఐదు శాతం రాయితీ..

కరోనా లాక్‌డౌన్‌ ప్రభావం కేఎంసీలో ఇంటి పన్నుల వసూలుపై పడింది. రాబడి తగ్గడంతో నగరపాలక యంత్రాంగం పన్నుల వసూలు కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంలో మే 31తేదీ లోపు ఇంటి యజమానులు పన్ను చెల్లిస్తే బకాయిలో ఐదు శాతం రాయితీ ఇస్తామని ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. డివిజన్లలో సంస్థ సిబ్బంది పర్యటిస్తూ ఇంటి యజమానులకు రాయితీ గురించి అవగాహన కల్పిస్తున్నారు. అలాగే 2020-21 ఆర్థిక సంవత్సరంలో దుకాణ యజమానులకు ట్రేడ్‌ లైసెన్సుల జారీ ద్వారా, వాటి పునరుద్ధరణ ద్వారా మరింత ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు.నిరుటికంటే ఈ ఏడాది అధిక ఆదాయాన్ని రాబట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.   

పన్ను వసూలుకు ప్రత్యేక చర్యలు..

నగర అభివృద్ధికి నిధులు అవసరం. ఇందుకోసం పన్ను వసూలుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. ప్రస్తుతం పూర్తిస్థాయిలో ఇంటి పన్ను వసూలుపై దృష్టి కేంద్రీకరించాం. ఈ నెలాఖరులోగా ఇంటి పన్ను చెల్లించేవారికి ఐదు శాతం రాయితీ ఇస్తున్నాం. మా సిబ్బంది ప్రజల వద్దకు వెళ్లి రాయితీ గురించి అవగాహన కల్పిస్తున్నారు. పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజా అవసరాల కోసం వినియోగిస్తాం. ఇంటి యజమానులు తక్షణమే పన్నులు చెల్లించాలి. ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ ద్వారా కూడా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

-అనురాగ్‌ జయంతి, కేఎంసీ కమిషనర్‌


logo