మంగళవారం 26 మే 2020
Khammam - May 23, 2020 , 23:38:09

అగ్గి బుగ్గి

అగ్గి బుగ్గి

 ఉమ్మడి జిల్లాలో తరచూ అగ్ని ప్రమాదాలు

 పదుల సంఖ్యలో పూరిళ్లు దగ్ధం

 నిరాశ్రయులవుతున్న  ప్రజలు

 అడవుల్లో రాజుకుంటున్న నిప్పు

 పరిశ్రమల్లో షార్ట్‌సర్క్యూట్‌ రూ.లక్షల్లో ఆస్తినష్టం.. 

 అప్రమత్తతే శ్రీరామరక్ష అవగాహనతోనే ప్రమాదాల నివారణ

గత నెల 22న అబ్బుగూడెంలో టార్పాలిన్‌ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం. 16 ఇళ్లు        దగ్ధమయ్యాయి. రూ.10 లక్షల విలువైన ఆస్తినష్టం వాటిల్లింది.

ఈ  నెల 21న చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి మండలంలోని అటవీప్రాంతంలో అగ్ని కీలలు.. 45 హెక్టార్లలో చెట్లు దగ్ధం.. సుబాబుల్‌,                 జామాయిల్‌ తోటల్లో తరచూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈనెల 20న రుద్రాక్షపల్లిలో అగ్ని ప్రమాదం. ఆరు ఇళ్లు దగ్ధం. 21న సీతంపేటలో షార్ట్‌ సర్క్యూట్‌. ఆరు ఇళ్లు అగ్నికి ఆహుతి. 22న రామచంద్రాపురంలో మూడు పూరిళ్లు దగ్ధం.. ఈ చొప్పున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తరచూ               అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి.. &వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువ.. రెండు జిల్లాల పరిధిలో ప్రతిరోజూ ఏదో ఒక గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవిస్తున్నది.. పదుల సంఖ్యలో కుటుంబాలు నిరాశ్రయులవుతున్నాయి.. అప్రమత్తంగా లేకపోతే ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టం వాటిల్లే  ప్రమాదం ఉంది.. బతుకులు  బుగ్గి పాలు కాకుండా ఉండాలంటే అవగాహన పెంచుకుంటేనే మేలు..! 

   -ఖమ్మం, నమస్తే తెలంగాణ/కొత్తగూడెం క్రైం 

ఇంటికి తాళం వేసి బయటకు వెళ్తున్నప్పుడు, రాత్రి వేళ దుకాణాన్ని మూసే ముందు తప్పని సరిగా విద్యుత్‌ మెయిన్‌ ఆఫ్‌ చేయండి. అగ్గి పెట్టె లు, లైటర్లు, టపాకాయలు వంటి అగ్నిజనిత వస్తువులను పిల్లలకు అందుబాటులో ఉంచవద్దు. కాల్చి న సిగరెట్లు/బీడీలు/అగ్గి పుల్లలను ఆర్పకుండా పడేయవద్దు. ఇళ్లు/షాపుల్లో ఐఎస్‌ఐ ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ను, నాణ్యమైన విద్యుత్‌ పరికరాలను మాత్రమే ఉపయోగించాలి. పాడైన వైర్లను వాడకూడదు. ఓవర్‌ లోడ్‌ విద్యుత్‌ వాడకూడదు. ఎలక్ట్రికల్‌ సాకెట్‌లో దాని సామర్థ్ధ్యానికి తగిన ప్ల గ్‌ను మాత్రమే వాడాలి. టపాకాయలు కాల్చాల్సి వస్తే.. నైలాన్‌/పాలిస్టర్‌ దుస్తులు ధరించకూడదు. 

అగ్గి అంటుకుంటే... 

ఒంటిపై దుస్తులకు నిప్పంటుకున్నప్పుడు పరుగెత్తకూడదు. నేలపై దొర్లాలి, లేదా దుప్పటిని చుట్టుకోవాలి. ఇలా చేస్తే మంటలు ఆరిపోయేందుకు అవకాశాలుంటాయి. కాలిన శరీర భా గంపై చల్లని నీళ్లు పోయాలి. అగ్ని ప్రమాదం జరిగి గదిలో పొగంతా వ్యాపించినప్పుడు.. మీరు అక్కడే ఉన్నట్టయితే.. వెం టనే మోచేతులు, మోకాళ్లపై పా క్కుంటూ సురక్షిత ప్రదేశానికి వెళ్లాలి. ముక్కుకు,నోటికి తడిగుడ్డ కట్టుకోవాలి.

గ్రామీణ ప్రాంతాల్లో...

పూర్తిగా ఎండిన గడ్డిని మా త్రమే వాములుగా వేయాలి. ని వాస గృహాలకు కనీసం 60 అడుగుల దూరంలో గడ్డివా ము ఉండాలి. ఒక్కో గడ్డివాము మధ్య దూరం 50 అడుగులు ఉండాలి. పెద్ద గడ్డివాములకు బదులుగా చిన్న గడ్డి వాములను ఏర్పాటు చేసుకోవాలి. గడ్డివాము మధ్యలో ఖాళీలను ఏర్పర్చుకోవాలి. గుడిసెల మధ్య 30 అడుగుల దూరాన్ని పాటించాలి. ఆయా ప్రాంతాల్లో బహిరంగంగా మంట వే యడాన్ని అనుమతించకూడ దు. వంట పూర్తవగానే, రాత్రి వేళ పడుకునే ముందు (కట్టెల) పొ య్యిని ఆర్పేయాలి. అగ్ని ప్రమాదం నుంచి రక్షణకు తగినంత నీటిని నిత్యం అందుబాటులో నిల్వ చేసుకోవాలి.

పౌరులుగా మనం ఏం చేయాలంటే

ఏదేని అగ్ని ప్రమాదం జరిగినప్పుడు పౌరులుగా మనం ఏం చేయాలన్న దానిపై అందరికీ అవగాహ న ఉండాలి. విద్యుత్‌ ప్రమాదాలకు నీటిని ఉపయోగించకూడదు. పొడి ఇసుకను మాత్రమే వాడాలి. ఎలక్ట్రికల్‌ ఫైర్‌ జరిగినప్పుడు ముందుగా మెయిన్‌ స్విచ్చాఫ్‌ చేయాలి. ఆ తర్వాతే మంటలను ఆర్పడానికి ప్రయత్నించాలి. అగ్ని ప్రమాదాలకు కారణమై న విద్యుత్‌ వాహక వైర్లు/తీగెలపై అత్యవసర పరిస్థితుల్లో కార్భన్‌ డై ఆక్సైడ్‌ ఎక్స్‌ట్వింగిషర్‌ను ఉపయోగించాలి. అగ్ని ప్రమాద స్థలాల్లో తప్పనిసరిగా అగ్నిమాపక సిబ్బందికి సహకరించాలి.

భవనాల్లో ప్రమాదాల నివారణకు..

పాఠశాలలు, ఆసుపత్రులు, షాపింగ్‌ మాల్స్‌ లో, ఇతరత్రా పెద్ద పెద్ద భవనాల్లో ప్రమాదాలు జరిగితే ఆస్తి-ప్రాణ నష్టం తీవ్రంగా ఉంటుంది. అందుకే అక్కడ అన్ని ముందస్తు జాగ్రత్తలు తీ సుకోవాలి. సాధ్యమైనంత వరకు పైకప్పు ఆర్‌సీసీ లేదా కాంక్రీట్‌ శ్లాబ్‌ అయితేనే మంచిది. ఫైర్‌ అలారం, ఫైర్‌ స్మోక్‌ డిటెక్టర్లను అమర్చుకోవాలి. సెల్లార్లలో ఆటోమెటిక్‌ స్ప్రిం క్లర్స్‌ను ఉపయోగించాలి. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే బయటకు వెళ్లేందుకు వీలుగా ప్రత్యేక ద్వారాలు ఉండాలి. నాణ్యమైన/ఐఎస్‌ఐ మా ర్కు కలిగిన విద్యుత్‌ సామగ్రిని మాత్రమే వినియోగించాలి. ఎలక్ట్రికల్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరిగినప్పుడు అగ్ని ప్రమాదం వాటిల్లకుండా మినీయేచర్‌ సర్క్యూ ట్‌ బ్రేకర్స్‌ అమర్చుకోవాలి. ఫ్లేమ్‌ ప్రూఫ్‌ మోటర్‌ స్పార్క్‌ స్విచ్‌లను మాత్రమే వినియోగించాలి. ముందు జాగ్రత్తగా సరిపడినంత నీటిని, ఫిక్స్‌డ్‌ ఫైర్‌ ఫైటింగ్‌ ఎక్స్‌ట్వింగిషర్స్‌ను (నిబంధనల మేరకు) నిత్యం అందుబాటులో ఉంచుకోవాలి. ఖ మ్మం నగరంలోని ప్రభుత్వ వసతి గృహంలో కొన్నాళ్ల క్రితం జరిగిన విద్యు త్‌ ప్రమాదంలో ఓ విద్యార్థిని చనిపోయింది, కొందరు విద్యార్థినులు గాయపడ్డారు. ఖమ్మం నగరంలోని రద్దీ ప్రదేశమైన కమాన్‌బజార్‌లో ఓ దుకాణంలో పెద్ద ప్రమాదం జరిగింది. వాహనాల్లో లూజ్‌ కనెక్షన్ల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనాల్లో డ్రై కెమికల్‌ పౌడర్‌ (డీసీపీ)ను ఉంచుకుంటే ప్రమాదాన్ని నివారించేందుకు అవకాశముంటుంది.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రమాదాలు..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ నెల  21వ తేదీన అగ్ని ప్రమాదాలకు సంబంధించి ఫైర్‌ స్టేషన్లకు 28 ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. చిన్న చిన్న పొరపాట్ల కారణంగానే అగ్ని ప్రమాదాలు జరుగుతు న్నాయి. ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా వరి/మొక్కజొన్న వ్యర్థాలు(గడ్డి), సుబాబుల్‌, మొక్కజొన్న వ్యర్థాలను తగలబెడుతున్న క్రమంలో ప్రమాదాలు జరిగాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ నెల 20న 19 కాల్స్‌, 21న 28 కాల్స్‌, 22న 12 కాల్స్‌ వచ్చినట్లు వివరించారు. ఉమ్మడి జిల్లాలో 2018-19లో 459 ప్రమాదాలు జరిగాయి. ఈ సంవత్సరంలో ఇప్పటికే ఈ సంఖ్య 468కి చేరింది. రూ.4.97 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ఏప్రిల్‌ 22న అన్నపురెడ్డిపల్లి మండలం అ బ్బుగూడెం టార్పాలిన్‌ ఫ్యాక్టరీలో సాంకేతిక లోపాలతో అగ్ని ప్రమాదం జరిగి, సుమారు రూ. 10లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. మే 21న పినపాక మండలం సీతంపేట గ్రామంలో మానవ తప్పిదాల కారణంగా ఆరు ఇళ్లు కాలిపోయాయి. సుమారు రూ.10లక్షల ఆస్తి నష్టం జరిగింది. ఇదే రోజున చండ్రుగొండ మండలంలోని కనిగిరి అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

వంటింట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

వంటింటిలోకి గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. గ్యాస్‌ ట్యూబ్‌ దెబ్బతిన్నట్టయితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వెంట నే ఐఎస్‌ఐ మార్కుగల,నాణ్యమైన కొత్త ట్యూబ్‌ అమర్చుకోవాలి. గ్యాస్‌ స్టౌవ్‌పై వంట పూర్తవగానే సిలిండర్‌ రెగ్యులేటర్‌ వాల్వ్‌ ఆఫ్‌ చేయాలి. గ్యాస్‌ లీకవుతున్నదని అనిపిస్తే.. వెంటనే రెగ్యులేటర్‌ వా ల్వ్‌ ఆఫ్‌ చేసి, తలుపులు-కిటికీలు పూర్తిగా తెరవాలి. వెంటనే విద్యు త్‌ మెయిన్‌ ఆఫ్‌ చేయాలి. వంట గదిలో కిరోసిన్‌, డీజిల్‌, పెట్రోల్‌, అదనపు గ్యాస్‌ సిలిండర్‌ ఉంచకూడదు. వంట చేస్తున్నప్పు డు నూలు వస్ర్తాలు,ఏప్రాన్‌ ధరించడం మంచిది. కిరోసిన్‌ స్టౌవ్‌ వాడుతున్నట్టయితే.. అది మండుతున్నప్పుడు కిరోసిన్‌ పోయకూడదు.

గోదాములు, గిడ్డంగుల్లో

గోదాముల్లో స్టాక్‌ను చెక్క స్లీపర్లపై మాత్రమే నిల్వ చేయాలి. వివిధ రకాల వస్తువులను స్టోరేజ్‌ అరల్లో వేరు గా నిల్వ చేయాలి. నిల్వల మధ్యలో గ్యాంగ్‌ వే/క్రాస్‌ సెక్షన్లను ఉంచాలి. తగినంత నీరు, ఇతర అగ్నిమాపక సాధనాలను సిద్ధ్దంగా ఉంచుకోవాలి. వస్తువులను 4.5 మీటర్లకు మించిన ఎత్తులో నిల్వ చేయకూడదు. పైకప్పుకి, స్టాక్‌కు మధ్య కనీసం రెండు అడుగుల దూరం ఉండాలి. ట్రక్కులు/వాహనాల నుంచి వస్తువుల లోడింగ్‌/అన్‌లోడింగ్‌ చేసేటప్పుడు వాహన ఇంజన్‌ను ఆఫ్‌ చేయాలి. గోదాముల్లోకి కచ్చితంగా తగినంత గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి.

అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ..

అగ్ని ప్రమాదాల నివారణకు నిరంతరం అప్రమత్తత ఒక్కటే పరిష్కారం. ప్రధానంగా చెత్త కు నిప్పు పెట్టడం మానుకోవాలి. ఇలా నిప్పు పెడుతుండగా ప్రమాదం జరిగిందంటూ మాకు ఎక్కువ ఫోన్లు వస్తున్నాయి. మేం అక్కడకు వెళుతున్నప్పుడో, వెళ్లిన తర్వాతో ఇంకెక్కడో పెద్ద ప్రమాదం జరిగినట్టుగా ఫోన్‌ కాల్‌ వచ్చినా.. అక్కడకు వెంటనే వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోం ది. కేవలం నిర్లక్ష్యంతోనో.. అజాగ్రత్తతోనో జరిగే చిన్న చిన్న అగ్ని ప్రమాదాల నివారణ కు ప్రజలే బాధ్యత తీసుకోవాలి. పూర్తిగా ఎండిన గడ్డిని తగలబెట్టకుండా దుక్కి దున్నుకుంటే భూసారం పెరుగుతుంది. ఒకవేళ వ్యర్థాలను కాల్చక తప్పదనుకుంటే చుట్టూ సుమారు 30 అడుగుల దూరం పాటించాలి. తగినంత నీటిని కూడా అందుబాటులో ఉంచుకోవాలి.

-సీహెచ్‌ రాజయ్య, ఫైర్‌ ఆఫీసర్‌ ఖమ్మం

ప్రమాదం జరగక  ముందే జాగ్రత్తలు తీసుకోవాలి.. 

ప్రజలు అగ్ని ప్రమాదం జరగక ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఏడాది అగ్ని ప్రమాదాల తీవ్రత కొంత ఎక్కువగా ఉంది. కాబట్టి అందరూ ఈ విషయంలో అప్రమత్తంగా ఉండడం ఎంతో అవసరం. ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అగ్ని ప్రమాదానికి సం బం ధించిన ఎక్కువ కాల్స్‌ వస్తున్నాయి. కేవలం మానవతప్పిదాల వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. వీటిని నివారించేందుకు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు పాటిస్తే జరగ బోయే ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. ఊళ్లకు వెళ్లే వారు, రాత్రిళ్లు దు కాణా లు మూసే ముందు ఇంట్లో విద్యుత్‌ మెయిన్‌ ఆఫ్‌ చేయడం మంచిది. ఇలాంటి ముందస్తు నిర్ణయాల వల్ల ప్రమాదాలను నివారించవచ్చు.

-మురహరి క్రాంతి కుమార్‌, ఫైర్‌ ఆఫీసర్‌ కొత్తగూడెం


logo