మంగళవారం 26 మే 2020
Khammam - May 23, 2020 , 03:30:29

8 నుంచి టెన్త్‌ పరీక్షలు

 8 నుంచి టెన్త్‌ పరీక్షలు

  •  ప్రతి పరీక్షకు రెండు రోజుల గ్యాప్‌
  • హైకోర్టు సూచనలమేరకు షెడ్యూల్‌ రూపకల్పన
  • కరోనా నేపథ్యంలో రక్షణ చర్యలు
  • పరీక్షా కేంద్రాల్లో మాస్క్‌లు, శానిటైజర్‌ పంపిణీ

ఖమ్మం ఎడ్యుకేషన్‌/కొత్తగూడెం ఎడ్యుకేషన్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడ్డ పదో తరగతి పరీక్షలు జూన్‌ 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. హైకోర్టు అనుమతితో పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రతి సబ్జెక్టుకు రెండ్రోజుల విరామం ఉండేలా ప్రణాళికను రూపొందించారు. ఆదివారం కూడా పరీక్షను నిర్వహించనున్నారు. లాక్‌డౌన్‌ కంటే ముందే తెలుగు, హిందీ పరీక్షలు అయ్యాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వాయిదా పడ్డ మిగతా సబ్జెక్టుల పరీక్షలు జూన్‌ 8వ తేదీ నుంచి జరుగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. రెగ్యులర్‌ పది పరీక్షలు జూన్‌ 29న ముగుస్తుండగా ఒకేషనల్‌ కోర్సు పరీక్షలు జూలై 5న ముగియనున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉమ్మడి జిల్లాలో పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వైరస్‌ను దృష్టిలో  ఉంచుకొని అదనంగా పరీక్ష కేంద్రాలను పెంచుతున్నారు. గతంలో ఖమ్మం జిల్లాలో 89 పరీక్ష కేంద్రాలు ఉండగా వాటి సంఖ్యను 178కి పెంచుతున్నారు.  కొత్తగూడెం జిల్లాలో 75 ఉండగా మరిన్ని పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. థర్మల్‌ స్క్రీనింగ్‌ తర్వాతనే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ప్రతి బెంచ్‌పై ఒక్కరు మాత్రమే కూర్చోవాలి. పరీక్ష కేంద్రానికి గంట ముందే అనుమతిస్తారు. విద్యార్థులు, తల్లిదండ్రుల సలహాలు, సూచనల కోసం హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయనున్నారు. జలుబు, దగ్గు, జ్వరం ఉండే విద్యార్థులను ప్రత్యేక గదుల్లో పరీక్షలు రాయిస్తారు.  పరీక్షల నిర్వహణలో కీలకంగా ఉండే ఇన్విజిలేటర్లు, సీఎస్‌లు, డీఓలు, కస్టోడియన్‌, పర్యవేక్షణాధికారులు, సిబ్బంది అందరికీ మాస్కులు, గ్లౌవ్స్‌లు అందించనున్నారు. ప్రతి విద్యార్థికి ఒక మాస్కుతో పాటు ప్రతి పరీక్షకు 5ఎంఎల్‌ చొప్పున 8 రోజులు శానిటైజర్‌ అందించనున్నారు.  


logo