శనివారం 06 జూన్ 2020
Khammam - May 22, 2020 , 03:06:54

100శాతం వసూళ్లకు కార్యాచరణ

  100శాతం వసూళ్లకు కార్యాచరణ

ఖమ్మం నగర పాలక సంస్థలో ఆస్తి పన్ను బకాయిల కోసం చర్యలు 

ఈ నెలాఖరులోగా చెల్లించే యజమానులకు 5 శాతం మినహాయింపు   

నగర పాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి

ఖమ్మం, నమస్తే తెలంగాణ : ఖమ్మం నగర పాలక సంస్థలో 100 శాతం ఆస్తిపన్ను వసూళ్లకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది. 31వ తేదీలోపు ఇంటి యజమానుల నుంచి ఆస్తి పన్ను బకాయిలను రాబట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.  గడువులోపు చెల్లించే వారికి రాయితీలు కూడా ఇచ్చారు. నగరాభివృద్ధి పనులను పూర్తిస్థాయిలో చేపట్టేందుకు నిధులను సమకూర్చుకోవడానికి అధికారులు పన్నుల వసూళ్లపై దృష్టి కేంద్రీకరించారు. ఈ పన్ను వసూళ్ల బాధ్యతను నగర పాలక సంస్థలోని రెవెన్యూ ఇన్స్‌పెక్టర్లు, బిల్లు కలెక్టర్లపై కమిషనర్‌ అనురాగ్‌ జయంతి పెట్టారు. పన్నులను ఆన్‌లైన్‌లో చెల్లించేందుకు కూడా అవకాశమిచ్చారు. మున్సిపల్‌ కార్యాలయంలోనూ, నగర పాలక సిబ్బందికి కూడా బిల్లులను చెల్లించవచ్చు. లాక్‌డౌన్‌ కారణంగా ఏర్పడ్డ ఆస్తిపన్నుల అవరోధాన్ని అధిగమించేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్నది. గురువారం టీటీడీసీ సమావేశ మందిరంలో ఆర్‌ఐలు, బిల్లు కలెక్టర్‌లతో నగరపాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ నెల 31 లోపు బకాయిలు చెల్లించే యజమానులకు 5 శాతం మినహాయింపు ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

పన్ను బకాయిదారులను రాయితీ విషయంపై సిబ్బంది చైతన్య పరచాలని సూచించారు. లక్ష్యాలను అధిగమించేందుకు అన్ని డివిజన్లలో సిబ్బంది పర్యటించి ఇంటి పన్ను వసూళ్లకు  చర్యలను చేపట్టాలని ఆదేశించారు. అనంతరం దానవాయిగూడెం నీటిశుద్ధి కేంద్రం ఫిల్టర్‌బెడ్‌ను సందర్శించి క్లోరినేషన్‌ జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. నూటికి నూరు శాతం శుద్ధిజలాలను నగర వాసులకు అందించాలని ఆదేశించారు. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలోని సంపులను శుభ్రపరిచి నీటి సరఫరా కొనసాగించాలని ఆదేశించారు. 

ట్రేడ్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకోండి..

ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని దుకాణాల యజమానులు 2020-2021 సంవత్సరానికి సంబంధించి ట్రేడ్‌ లైసెన్స్‌ సర్టిఫికెట్‌ పొందేందుకు దరఖాస్తులు చేసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తుదారులు లైసెన్స్‌ల కోసం ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలని సూచించారు. మ్యానువల్‌ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించే అవకాశం లేదన్నారు. ప్రభుత్వం సూచించిన లింకు ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులను అందజేయాలని ఆయన సూచించారు. 


logo