మంగళవారం 07 జూలై 2020
Khammam - May 21, 2020 , 02:48:57

నూతన ఒరవడికి శ్రీకారం

 నూతన ఒరవడికి శ్రీకారం

 నియంత్రిత సాగుతోనే లాభాలు

 రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌

 ఉపాధి కూలీలకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, బత్తాయిల పంపిణీ

రైతుల పండించే పంటలకు గిట్టుబాటు ధర అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం సాగులో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. రఘునాథపాలెం మండలం చిమ్మపుడి, పంగిడి చెరువుల్లో ఉపాధి పనులు నిర్వహిస్తున్న కూలీలకు బుధవారం ఆయన మాస్క్‌లు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, బత్తాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్నదాతలు నియంత్రిత వ్యవసాయ పద్ధతులు పాటించాలన్నారు. అనంతరం ఖమ్మం బస్టాండ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోదాడ డిపో బస్సులో శానిటైజర్‌ లేకపోవడంతో        ఆ డిపో మేనేజర్‌ను సస్పెండ్‌ చేయాలని నల్లగొండ ఆర్‌ఎంను ఆదేశించారు. 

రఘునాథపాలెం/ఖమ్మం కమాన్‌బజార్‌

రఘునాథపాలెం : మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలనే రైతులు పండించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. అందుకు ప్రభుత్వం సూచించిన నియంత్రిత వ్యవసాయ విధానాన్ని పాటించాలని సూచించారు. బుధవారం మండలంలోని చిమ్మపూడి, పంగిడి గ్రామాల చెరువుల్లో ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు కూరగాయలు, బత్తాయి పండ్లు, మాస్కులు, ఓఆర్‌ఎస్‌, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉమ్మడి జిల్లా రైతులు ఎట్టిపరిస్థితుల్లోనూ వానకాలంలో మక్క పంటను వేయకూడదన్నారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పత్తి, కంది, మిర్చి పంటలను సాగు చేయాలన్నారు. యాసంగిలోనే మక్కలను సాగు చేయాలని చెప్పారు. పంటల సాగుపై నేడు సీఎం కేసీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఫలాలు దేశానికి అందించడంతో పాటు తెలంగాణ రైతన్నను ఉన్నత స్థాయిలో ఉంచాలన్నదే సీఎం కేసీఆర్‌ ప్రధాన ఆశయమని పేర్కొన్నారు.  కరోనా కట్టడిలో చురుకైన పాత్ర పోషించి కరోనా ఫ్రీ ఖమ్మంగా తీర్చిదిద్దిన కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. అంతేగాక ఉపాధి పనుల్లో రాష్ట్రంలో 13వ స్థానంలో ఉన్న ఖమ్మం జిల్లా 3వ స్థానంలో ఉండడం కలెక్టర్‌ కృషితోనే సాధ్యమైందన్నారు. చిమ్మపూడి గ్రామంలో వైకుంఠధామాన్ని సుందరంగా తీర్చిదిద్దిన అధికారులు, ప్రజాప్రతినిధులను మంత్రి అజయ్‌ అభినందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, అడిషనల్‌ కలెక్టర్‌ మొగిలి స్నేహలత, డీఆర్‌డీఏ పీడీ ప్రవీణ, ఖమ్మం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, వైస్‌ చైర్మన్‌ పిన్ని కోటేశ్వరరావు, రైతుబంధు జిల్లా  సభ్యుడు మందడపు సుధాకర్‌, టీఆర్‌ఎస్‌  మండల అధ్యక్షుడు కుర్రా భాస్కర్‌రావు, ఎంపీపీ గౌరి, వైస్‌ ఎంపీపీ గుత్తా రవికుమార్‌, ఆత్మ చైర్మన్‌ బోయినపల్లి లక్ష్మణ్‌గౌడ్‌, ఎంపీడీవో శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

సేవాగుణం అభినందనీయం  

ఖమ్మం: ఎమ్మెల్సీ రాజేశ్వరరావు సేవాగుణం అభినందనీయమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. బుధవారం మంత్రి ఖమ్మం నగరంలోని క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని 600 మంది నిరుపేద క్రైస్తవ సేవకులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క్రిస్టియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ తెలంగాణ పేరుతో ఎమ్మెల్సీ రాజేశ్వరరావు ఖమ్మం జిల్లాతో పాటు 25 జిల్లాలో ఈ కార్యక్రమం చేపట్టారన్నారు. మిగిలిన నాలుగు జిల్లాలో సైతం పంపిణీకి ఏర్పాట్లు చేశారన్నారు. ఎమ్మెల్సీ రాజేశ్వరరావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ పాలనలో ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో మేయర్‌ జీ పాపాలాల్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు ఆర్జేసీ కృష్ణ, కార్పొరేటర్‌ కమర్తపు మురళి, బచ్చు విజయ్‌కుమార్‌, ఖమ్మం జిల్లా క్రిస్టియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ పీటర్‌ తడిగొండ, బిషప్‌ జాకబ్‌, బిషప్‌ జాన్‌కాంతారావు, సత్యపాల్‌, యేసురత్నం, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.

మాస్కులు ధరిస్తేనే టిక్కెట్లు ఇవ్వాలి 

ఖమ్మం కమాన్‌బజార్‌ : మాస్కుల్లేకుండా బస్సులో ప్రయాణికులను అనుమతించకూడదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. మాస్కు ధరిస్తేనే టిక్కెట్లు ఇవ్వాలన్నారు. బుధవారం ఖమ్మం బస్టాండ్‌ను కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌తో కలిసి మంత్రి ఆకస్మికంగా సందర్శించారు. ప్రయాణికులతో మాట్లాడి జాగ్రత్తలు సూచించారు. వైరస్‌ బారిన పడకుండా ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రతి డిపోలో కండక్టర్‌కు తప్పనిసరిగా హ్యాండ్‌ శానిటైజర్‌ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బస్సులో ప్రయాణికులకు హ్యాండ్‌ శానిటైజ్‌ చేశాకే టికెట్‌ ఇవ్వాలని తెలిపారు. అనంతరం బస్టాండ్‌లో ఉన్న కోదాడ డిపోకు చెందిన బస్సులోకి ఎక్కారు. మీ శానిటైజర్‌ ఏది అని కండక్టర్‌ను ప్రశ్నించగా డీఎం ఇవ్వలేదని సమాధానం ఇచ్చాడు. ఆగ్రహించిన మంత్రి పువ్వాడ ఉమ్మడి నల్గొండ జిల్లా ఆర్‌ఎంతో ఫోన్‌లో మాట్లాడారు. వెంటనే కోదాడ డిపో మేనేజర్‌ను సస్పెండ్‌ చేయాలని ఆదేశించారు. అనంతరం మంత్రి స్వయంగా ప్రయాణికులకు హ్యాండ్‌ శానిటైజ్‌ చేశారు. మంత్రి వెంట మేయర్‌ పాపాలాల్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి  ఉన్నారు. 


logo