ఆదివారం 05 జూలై 2020
Khammam - May 19, 2020 , 02:16:41

సిండి‘కేటుగాళ్లు’

సిండి‘కేటుగాళ్లు’

అశ్వారావుపేట: అశ్వారావుపేటలో మద్యం వ్యాపారుల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతున్నది. కొందరు వ్యాపారులు ‘సిండికేట్‌' అయ్యారు. మద్యం బాటిళ్లపై 25 నుంచి 30 శాతం అధికంగా వసూలు చేస్తున్నారు. ఈ దందా విలువ రూ.113 కోట్లకు పైనే ఉంది. ఇటీవల అన్ని మండలాల్లోనూ వ్యాపారులు ఒక్కటై మద్యం దందాకు తెరలేపారు. బ్రాండ్‌ను బట్టి వ్యాపారులు బెల్టు దుకాణాలకు 25 నుంచి 30 శాతం అధిక ధరలకు అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారు. దమ్మపేట, ములకలపల్లి, చండ్రుగొండ మండలాల్లో సిండికేట్‌ అయిన వ్యాపారులు అశ్వారావుపేటలో సిండికేట్‌ కావటానికి 9 నెలల సమయం పట్టింది. అన్నపురెడ్డిపల్లిలో ఒకే దుకాణం ఉండటంతో సిండికేట్‌ లేకున్నా అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. మన రాష్ట్రం మద్యం ధరల కంటే ఏపీలో ధరలు ఎక్కువగా ఉండటంతో అక్కడి వారంతా  గ్రామాల్లోని బెల్టు దుకాణాల వైపు చూస్తున్నారు. 

సిండికేట్‌ ఇలా..

మద్యం వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయాలు నిర్వహించాలి. టార్గెట్‌ పూర్తయితే తదుపరి సరఫరా చేసే మద్యానికి మరో 14 శాతం పైగా వ్యాపారులు పన్ను చెల్లించాలి. ప్రభుత్వం సుమారు 16 శాతం వరకు మద్యం వ్యాపారులకు లాభం అందిస్తుంది. టార్గెట్‌ పూర్తయిన తర్వాత అదనంగా చెల్లించే 13 శాతం పన్నుతో లాభం 3 శాతానికి తగ్గిపోతుంది. రెండేళ్ల లైసెన్స్‌ ఉన్నప్పటికీ ఏడాది టార్గెట్‌ను దుకాణాలు 3 నెలల్లోనే పూర్తి చేస్తాయి.  మిగిలిన 9 నెలల్లో జరిపే మద్యం విక్రయాలతో కేవలం 3 శాతం వచ్చే లాభంతోనే జీతాలు, అద్దెలు, అన్నీ సరిపెట్టు కోవాల్సి ఉంటుంది. అందుకే ఒక నిర్ణయానికి వచ్చిన మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారి ప్రభుత్వం ప్రకటించిన ధరల కంటే సుమారు 25 నుంచి 30 శాతం ధరలు పెంచి బెల్టు దుకాణాల ద్వారా వ్యాపారం సాగిస్తుంటారు. అశ్వారావుపేటలో రెండు రోజుల క్రితమే వ్యాపారులు సిండికేట్‌ అయ్యారు.  

దోపిడీ రూ.113 కోట్లకు పైనే.. 

మద్యం సిండి‘కేటు’ గాళ్ల దోపిడీ రూ.కోట్లలోనే ఉంది. అశ్వారావుపేటలో ఉన్న 5 మద్యం దుకాణాల ద్వారా ప్రతి రోజూ రూ.25 లక్షల వరకు వ్యాపారం జరుగుతుంది. తాజాగా సిండికేట్‌ అయిన వ్యాపారులు డిమాండ్‌ను బట్టి క్వార్టర్‌కు రూ.30 నుంచి రూ.40 వరకు పెంచి బెల్టు దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ఈ లెక్కన రోజూ ప్రభుత్వ ధర కంటే అదనంగా వసూలు చేయగా వచ్చే సంపాదన రూ.6.25 లక్షల నుంచి రూ.7.50 లక్షల వరకు ఉంటుంది. ఏడాదికి రూ.22.50 కోట్ల నుంచి రూ.27 కోట్లకు పైనే.  నియోజకవర్గంలో 14 మద్యం దుకాణాలున్నాయి. రోజువారి అమ్మకాలు రూ.56 లక్షల వరకు ఉంటాయి. అదనపు ధరలతో రూ.14 లక్షల నుంచి రూ.16.80 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. బెల్టు షాపుల నిర్వాహకులు మరో రూ.11.20 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన  ఏడాదిలో మద్యం దోపిడీ రూ.50.40 కోట్ల నుంచి రూ.60.48 కోట్లు దాటుతుంది. బెల్టు వ్యాపారుల వాటా కూడా రూ.40.32 కోట్ల నుంచి రూ.50. 40 కోట్ల వరకు ఉంది. లైసెన్స్‌ అనుమతి మరో 15 నెలలు ఉండటంతో గడువు ముగిసే సరికి సిండికేటుగాళ్ల మద్యం దందా  మొత్తం విలువ రూ.113.40 కోట్ల నుంచి రూ.138.60 కోట్ల పైమాటే. కాగా మద్యం వ్యాపారుల దోపిడీలో సంబంధిత అధికారుల పాత్ర కీలకమనే వాదనలు ఉన్నాయి. ఎక్సైజ్‌ సీఐ నాగయ్యను వివరణ కోరగా సిండికేట్‌ విషయం తన దృష్టికి రాలేదని, అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు.


logo