మంగళవారం 07 జూలై 2020
Khammam - May 19, 2020 , 02:16:43

అయ్యో.. రామా!

అయ్యో.. రామా!

భద్రాచలం: నిత్యం వేలాది మంది భక్తులతో కళకళలాడే భద్రాద్రి దేవస్థానం కరోనా ఎఫెక్ట్‌తో వెళ వెళబోతోంది. రామాలయ పరిసరాలు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. భక్తులు రాకపో వడంతో రామయ్య ఆదాయానికి భారీగా గండి పడింది. ఆదాయం లేకపోవడంతో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాల చెల్లింపునకు కటకటయింది. 

భద్రాచలం దివ్యక్షేత్రానికి దేశ నలుమూలల నుంచి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు రా ముని దర్శనానికి  వస్తారు. కానుకల రూపం లో తమ మొక్కులు చెల్లించుకుంటారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో భద్రాద్రి రామాలయంలో దర్శనాలు నిలిపివేశారు. కొంత కాలం పాటు నిత్య కల్యాణాలు, ఆర్జిత సేవలు కూడా ఆగాయి. ఇటీవల తిరిగి ప్రారంభించారు. భక్తుల రాలేకపోవడంతో ఆ ప్రభావం రాముని ఆదాయంపై పడింది. రెండు నెలల కాలంలో సుమారు రూ.4 కోట్లకు పైగా ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఆర్జిత సేవలు నిలిచిపోవడంతో వివిధ రుసుములు రావడం లేదు. 

ఆర్జిత సేవల రూపంలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి నెలకు రూ.42 లక్షల వరకు ఆదాయం వస్తుంది. సత్రాల నిర్వహణ ద్వారా రూ.10 లక్షలు, ప్రసాదాల ద్వారా రూ.50 లక్షలు, హుండీ కానుకల ద్వారా రూ.50 లక్షలు , అన్నదాన విరాళాలకు రూ.50 లక్షలు వస్తాయి. ప్రస్తుతం ఇవి నిలిచిపోవడంతో ఆయా రూపాల్లో వచ్చే ఆదాయం ఆగిపోయింది. దీంతో రెండు నెలల కాలంలో రూ.4 కోట్లకు పైగానే దేవస్థానానికి ఆదాయం రాలేదు. ఈ ఏడాది శ్రీరామనవమి ఘనంగా నిర్వహిద్దామని అధికారులు ఏర్పాట్లను ప్రారంభించారు. ఇందు కోసం రూ.10 లక్షల వరకు ఖర్చుచేశారు. కరోనా ఎఫెక్ట్‌తో నిరాడంబరంగా ఆలయ ప్రాంగణంలోనే నిర్వహించారు. శ్రీరామ నవమి సందర్భంగా భక్తులు ఇచ్చే కానుకలు, వివిధ రుసుములతో ఏటా రూ.2 కోట్ల ఆదాయం వచ్చేది. ఈసారి ఆ ఆదాయం కూ డా రాకుండా పోయింది. దాతలు కూడా నిత్యం వివిధ రూపాల్లో రామునికి కానుకలు ఇస్తూ ఉంటారు. ఈ రెండు నెలలు కానుకలు ఏవీ రాలేదు. ఇటీవల  ఓ ఎన్‌ఆర్‌ఐ కుటుంబం నిత్యాన్నదానానికి రూ.38 లక్షల విరాళాన్ని దేవస్థానానికి అందజేసింది.

ఉద్యోగుల వేతనాలపై ప్రభావం..

దేవస్థానంలో పెద్ద సంఖ్యలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరికి దేవస్థానం నుంచే నెల నెలా వేతనాలు చెల్లిస్తారు. భక్తు ల నుంచి కానుకల రూపంలో వచ్చే ఆదాయం ద్వారానే వీరి వేతనాలు చెల్లించాలి. ప్రతి నెలా రూ.90 లక్షలకు పైగానే దేవస్థానం ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తోంది. ప్రస్తుతం దేవస్థానానికి ఆదాయం లేకపోవడంతో ఉద్యోగులకు, సిబ్బందికి వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు. అతికష్టం మీద ఏప్రిల్‌ నెల వేతనాలను ఈనెల 14, 15 తేదీల్లో చెల్లించారు. బ్యాంకుల్లో ఉన్న దేవస్థానం సేవింగ్‌ అకౌంట్స్‌ నుంచి వీటిని డ్రా చేసి ఇచ్చారు. ప్రస్తుతం ఆ అకౌంట్‌లో కూడా సొమ్ములు లేవని తెలిసింది. ఆలయ ఆదాయ ప్రభావంపై దేవాదాయ శాఖ కమిషనర్‌కు పూర్తిస్థాయి నివేదికను అందజేసినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి జీ నర్సింహులు ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.దేవస్థానం ఆదాయం పడిపోవడంతో ఈ పరిస్థితి ఉందన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఉన్నతాధికారులకు తెలిపిన అనంతరం తగు చర్యలు తీసుకుంటామని ఈవో వెల్లడించారు. భద్రాద్రికి భక్తుల రాక లేకపోవడంతో కళ తప్పింది. ఆలయ పరిసరాలతో పాటు పట్టణ పురవీధులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. భద్రాచలం పుణ్యక్షేత్రం గ్రీన్‌ జోన్‌లోనే ఉండటంతో త్వరలో ఆలయంలో దర్శనాలకు అవకాశం ఉంటుందని సమాచారం. 


logo