గురువారం 02 జూలై 2020
Khammam - May 16, 2020 , 03:21:17

భానుడి భగ భగ

భానుడి భగ భగ

ఖమ్మం/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ : ఎండలు మండిపోతున్నాయి.. ఉదయం 10 గంటల నుంచే సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు.. ఒకవైపు లాక్‌డౌన్‌, మరోవైపు మండే ఎండల ప్రభావంతో జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరోనా రహిత జిల్లాగా మారడంతో ప్రభుత్వం ఈ జిల్లాను గ్రీన్‌జోన్‌గా ప్రకటించింది. ఖమ్మం జిల్లాలో ఒకటి, రెండు కరోనా కేసులు నమోదు కావడంతో ఆరెంజ్‌ జోన్‌గా ప్రకటించింది. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత ఉమ్మడి జిల్లాలో వ్యాపార, వాణిజ్య సముదాయాలు ప్రారంభమయ్యాయి. ఒకవైపు కరోనా నిబంధనలు, మరోవైపు ఎండల ప్రభావంతో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.

ఖమ్మం జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు

ఖమ్మం జిల్లాలో మార్చిలో పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు నమోదు కాగా, ప్రస్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40-41 డిగ్రీలు నమోదవుతున్నది. ఈ ఏడాది మార్చి 22న జనతా కర్ఫ్యూ, 23 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యా రు. ఈ నెల 5వ తేదీ నుంచి సడలింపులు ఇవ్వడంతో ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు తెరచుకున్నాయి. అయినప్పటికీ ప్రజ లు అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లే దు. జిల్లాలో సింగరేణి ప్రభావిత ప్రాంతమైన సత్తుపల్లి ఏరియాలో మిగతా ప్రాంతం కంటే ఒకటి, రెండు డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోహిణి కార్తె సమీపిస్తుండడంతో మన్ముం దు ఎండలు ఏ స్థాయిలో ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో తీవ్రత..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు, ఇల్లెందు, కొత్తగూడెం ఏరియాలోని సింగరేణి ప్రాంతం, పారిశ్రామిక వాడగా పేర్గాంచిన పాల్వం చ పరిధిలో ఎండల తీవ్రత ఎక్కువగా కనిపిస్తున్నది. సాధారణంగానే కొత్తగూడెం జిల్లాలో మిగతా జిల్లాల కంటే ఒకటి, రెండు డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది కూడా ఇలాగే నమోదవుతున్నాయి. భద్రాద్రి  జిల్లాలో శుక్రవారం 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత, 27 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు శీతల పానీయాలు, కొబ్బరి బోండాల షాపులను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు లాక్‌డౌన్‌ సడలింపులతో దుకాణాలు తెరచుకోవడంతో ఉమ్మడి జిల్లాలో ముఖ్యపట్టణాలైన కొత్తగూ డెం, భద్రాచలం, మణుగూరు, ఖమ్మం, సత్తుపల్లి, మధిర, వైరా తదితర పట్టణాల్లో కూలర్లు, ఏసీల కొనుగోళ్లు  పెరిగాయి.

నిరంతర విద్యుత్‌..

వలస పాలనలో కరెంటు కోతలతో అల్లాడిన ప్రజలు స్వరాష్ట్రం వచ్చాక నిరంతర విద్యుత్‌ సదుపాయం పొందుతున్నారు. మం డే ఎండల్లో సైతం ఉపశమనం పొందుతున్నారు. ఫ్యాన్లు, కూల ర్లు, ఏసీలు నిరంతరం పనిచేస్తుండటంతో ఉపశమనం లభిస్తున్నది. ఒకవైపు వ్యవసాయానికి, మరోవైపు ఇండ్లకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరాతో ప్రజానీకం నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. 


logo