శుక్రవారం 10 జూలై 2020
Khammam - May 15, 2020 , 01:16:25

గాడిన పడుతున్న

గాడిన పడుతున్న

  • లాక్‌డౌన్‌ సడలింపుతో కూలీలకు భరోసా
  • జిల్లాలో వేగం పుంజుకుంటున్న పనులు
  • కూలీలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

ఖమ్మం, నమస్తే తెలంగాణ: రెక్కాడితే గానీ డొక్కాడని బడుగు జీవులు వారు.. ప్రపంచాన్ని వణికిస్తూ వచ్చిన కరోనా కూలీల కుటుంబంలో కల్లోలం రేపింది.. లాక్‌డౌన్‌ కారణంగా కొంతకాలం వారికి ఉపాధి దూరమైంది. ఇలాంటి పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ నిబంధనలను సడలిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు వారి జీవితాల్లో వెలుగులు నింపాయి. వారం రోజులుగా ఉపాధి దొరుకుతుండటంతో వేలాది మందికి భరోసా లభించింది. పనులు వేగం పుంజుకుంటే సుమారు 2 లక్షల మంది అసంఘటిత కార్మికులకు లబ్ధిచేకూరనుంది. వీరిలో 30 శాతం మంది మహిళలే పనిచేస్తున్నట్లు ఒక అంచనా.

ఖమ్మం నగరంలో పనులు మొదలు..

లాక్‌డౌన్‌ సడలింపు అనంతరం జిల్లాలో భవన నిర్మాణ రంగం పుంజుకుంటున్నది.భవన నిర్మాణంలో తాపీ పని చేసే వారి నుంచి మేస్త్రిల వరకు ప్రస్తుతం ఉపాధి దొరుకుతున్నది. ఖమ్మంలోని సీక్వెల్‌, గాంధీచౌక్‌, బైపాస్‌రోడ్‌లోని ఎన్టీఆర్‌ మార్గ్‌ వద్ద అడ్డాల వద్ద కూలీలు ప్రతిరోజూ కూలీ కోసం నిలబడుతున్నారు. వీరిలో సెంట్రింగ్‌, రాడ్‌ బెండింగ్‌, ఎలక్ట్రికల్‌, ఫ్లంబింగ్‌, శానిటరీ వర్క్‌, సీలింగ్‌ వర్క్‌, రైలింగ్‌ వర్క్‌, జాలీల నిర్మాణం, పెయింటింగ్‌, కార్పెంటరీ వర్క్‌.. అనేక రంగాల్లో పనిచేసే వారు ఉన్నారు. జిల్లాలో ఇక్కడి కార్మికులే కాక మహబూబాబాద్‌, సూర్యాపేట జిల్లాల నుంచి కూడా కార్మికులు వస్తారు. అందరూ కలిపి నగర పరిధిలో రోజుకు సుమారు 5 వేల మంది పని చేస్తుంటారు. 

గతంలోనూ సంక్షేమ కార్యక్రమాలు..

అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం గతంలో ప్రభుత్వం వేల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేసింది. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం రూ.కోట్ల నిధులు కేటాయించింది.18- 60 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి కార్మికునికి బీమా అందేలా చర్యలు తీసుకున్నది. దీని ద్వారా పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు కార్మికుడు మరణిస్తే తన కుటుంబానికి రూ.6 లక్షల పరిహారం అందుతుంది. గాయాలైతే తీవ్రతను బట్టి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు నగదు అందనుంది. బోర్డులో సభ్యత్వం పొందిన కార్మికుని ఇద్దరు కుమార్తెల వివాహానికి రూ.30,000 చొప్పున అందజేస్తారు. ఇలా జిల్లాలో ఇప్పటివరకు సుమారు 2 వేల మందికి రూ.14 కోట్ల లబ్ధి చేకూరింది.

ఆదుకున్న ప్రభుత్వం..

లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత నిర్మాణ వ్యయం పెరిగింది. దీంతో ఇండ్లు నిర్మించే వారు వెనకడుగు వేస్తున్నట్లు కార్మిక వర్గాలు భావిస్తున్నాయి. ఇటుక, ఇసుక, కంకర, ఇనుము, సిమెంట్‌ ధరలు పెరగడంతో ఆ ప్రభావం కార్మిక రంగంపై కూడా పడింది. లాక్‌డౌన్‌కు ముందు సిమెంట్‌ బస్తా రూ.260 ఉండగా ప్రస్తుతం రూ.360 ఉంది. ఒక్కో  సిమెంట్‌ ఇటుక ఖరీదు రూ.10 నుంచి రూ.14కు పెరిగింది. ఇసుక టన్ను సుమారు రూ.1600 ఉండగా ప్రస్తుతం రూ.2400కు చేరింది. ట్రాక్టర్‌ మట్టి గతంలో రూ.500 ఉండగా ఇప్పుడు రూ.వెయ్యికి కూడా దొరకడం కష్టతరంగా మారింది. ఒకవైపు ఇంటి నిర్మాణ సామగ్రి ధర పెరుగుతున్నా కూలీ రేట్లు పెరగడం లేదని కార్మిక రంగం భావిస్తున్నది. అదేవిధంగా భవన నిర్మాణ రంగంలో ఎక్కువ మందికి ప్రభుత్వం అందించే రేషన్‌ బియ్యం, ప్రభుత్వ సాయం అందిందని యూనియన్‌ నాయకులు తెలుపుతున్నారు. అదేవిధంగా సీఎం కేసీఆర్‌ పిలుపుతో టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని నిత్యావసర సరుకులు పంపిణీ చేశారని వెల్లడించారు.

ఉపాధి దొరుకుతున్నది..

నేనూ నా భర్త భవన నిర్మాణ పనులకు వెళ్తుంటాం. లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడ్డాం.సీఎం కేసీఆర్‌ అర్హులను గుర్తించి ఆదుకున్నారు. ఇందులో భాగంగా మా కుటుంబంలో ఒక్కొక్కరికీ 12 కిలోల బి య్యం అందింది. నగదు కూడా ఖాతాలో జమ అయింది. ఇప్పుడు ఉపాధి దొరుకుతున్నది. నిర్మాణాలకు వినియోగించే సామగ్రి ధరలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నాం.    

- కడియం సత్యావతి, కూలీ, ఖమ్మం

కార్మిక పక్షపాతి సీఎం కేసీఆర్‌..

భవన నిర్మాణ కార్మికులను సీఎం కేసీఆర్‌ ఆదుకున్నారు. ఇప్పుడు పని దొరుకుతున్నది. మేం ఇంటి వద్ద ఉన్న సమయంలో ఉచిత బియ్యం, నగదు ఇచ్చి ఆదుకుని కార్మిక పక్షపాతిగా సీఎం కేసీఆర్‌ మిగిలారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి మమ్మల్ని సభ్యులుగా చేర్చుకున్నారు. కేసీఆర్‌ సార్‌కు రుణపడి ఉంటాం.

- సీహెచ్‌ కృష్ణ, తాపీ మేస్త్రి


logo