ఆదివారం 05 జూలై 2020
Khammam - May 14, 2020 , 02:16:06

తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే సహించం

తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే సహించం

  • పొరుగు రాష్ట్రం తలపెడుతున్న పోతిరెడ్డిపాడు నిర్మాణాన్ని అడ్డుకుంటాం 
  • కేసీఆర్‌ ఉండగా తెలంగాణ రైతులకు అన్యాయం జరుగదు 
  • రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ 

ఖమ్మం: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ పోతిరెడ్డిపాడు కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర భంగకరమైన ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే ప్రక్రియను చేపట్టారని, న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారని అన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని సంప్రదించకుండానే ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం నీటి విషయంలో నిర్ణయం తీసుకోవడం, అపెక్స్‌ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణాన్ని తలపెట్టడం ఏపీ చేసిన తప్పిదాలని అన్నారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి రాజీలేని ధోరణి అవలంబిస్తామని మంత్రి స్పష్టం చేశారు. కృష్ణా నీటిని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తరలించుకుపోతే ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగు నీటి సమస్య ఏర్పడుతుందని అన్నారు. అందువల్ల ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగకుండా ఆదేశాలు జారీ చేయాలని కేఆర్‌ఎంబీలో ఫిర్యాదు చేశామన్నారు. గతంలో ఉన్న వివాదాలను, విభేదాలను పక్కన పెట్టి రెండు రాష్ర్టాల రైతుల ప్రయోజనాల కోసం నదీ జలాలను వినియోగించుకుందామని తెలంగాణ ప్రభుత్వం స్నేహహస్తం అందిస్తే ఏపీ ప్రభుత్వం కనీసం తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం అత్యంత బాధాకరమని అన్నారు. సహకార స్ఫూర్తికి విఘాతమని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగునీటి అవసరాల కోసం నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రూ.12 కోట్ల అదనపు నిధులు మంజూరు చేశారని మంత్రి గుర్తుచేశారు. ఎన్‌ఎస్‌పీ ఆయకట్టును స్థిరీకరించనున్నామన్నారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌, డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, సీడ్స్‌ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శేషగిరిరావు, ఏఎంసీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, టీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు కమర్తపు మురళి పాల్గొన్నారు.


logo