శనివారం 11 జూలై 2020
Khammam - May 13, 2020 , 02:51:40

ఆపత్కాలంలో అండగా..

ఆపత్కాలంలో అండగా..

ఖమ్మం, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ కారణంగా పనుల్లేక ఉపాధి కోల్పోయి జిల్లాలో అవస్థలు పడుతున్న ఇతర రాష్ర్టాల కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండంగా నిలిచింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తృత ఉపాధి అవకాశాలుండడంతో సుమారు 70 వేల మంది ఇతర రాష్ర్టాల కూలీలు వచ్చారు. వివిధ పరిశ్రమలు, ప్రాజెక్టుల్లో పనిచేసుకుంటూ జీవిస్తున్న తరుణంలో కరోనా లాక్‌డౌన్‌ మొదలైంది. ఎక్కడి పనులు అక్కడే నిలిచి పోవడంతో జీతభత్యాలు ఆగిపోయాయి. పూట గడవడం కష్టం కావడంతో కూలీలందరూ తమ సొంత రాష్ర్టాలకు కాలి నడకన పయనమయ్యారు. వీరికి ఖమ్మం మీదుగా వెళ్తున్న మరికొందరు కార్మికులు తోడయ్యారు. వందల కిలోమీటర్లు కాలినడకన వెళ్తుండడం, కరోనా సోకే ప్రమాదాలు ఉండడం వంటి కారణాలతో ఎక్కడి కార్మికులకు అక్కడే వసతి కల్పించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల భవనాల్లో వారికి వసతి సౌకర్యాలు ఏర్పాటుచేసింది. మందులు, వైద్య చికిత్సలను అందుబాటులోకి తెచ్చింది. రెండు విడతల్లో మనిషికి 12 కిలోల చొప్పున బియ్యం, సరుకుల కోసం కుటుంబానికి మొదటి విడతలో రూ.500, రెండో విడతలో రూ.1500 నగదు అందించింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఇటీవల నుంచి వాళ్లను తమ సొంత ప్రాంతాలకు పంపుతున్నది. ఈ ప్రక్రియలో సీఎం కేసీఆర్‌ దాతృత్వాన్ని వలస కార్మికులు కొనియాడుతున్నారు. 

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో వలస కార్మికుల భాగస్వామ్యం విడదీయలేనిది. మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, బీహార్‌ రాష్ర్టాల కార్మికులు మన జిల్లాకు వలస వచ్చి గ్రానైట్‌ ఫ్యాక్టరీలు, ఇటుక బట్టీలు, నిర్మాణ రంగాల్లో పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. మిషన్‌ భగీరథ, సీతారామ, బీటీపీఎస్‌ ప్రాజెక్టుల్లోనూ వారే ఎక్కువ మంది ఉన్నారు. వ్యవసాయ రంగ పనుల్లోనూ వారిదే కీలకపాత్ర. ఇలాంటి సమయంలో లాక్‌డౌన్‌ రావడంతో ఈ కార్మికులందరూ జిల్లాలో చిక్కుకుపోయారు. వీరందరి సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం తోడ్పాటునందించింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం స్వస్థలాలకూ పంపుతున్నది.   

సంక్షేమానికి చర్యలు.. 

లాక్‌డౌన్‌ సమయంలో వలస కూలీల్లో రాష్ట్ర ప్రభుత్వం ధైర్యాన్ని నింపింది. ఆహారంతోపాటు అన్ని సౌకర్యాలూ కల్పించింది. ఖమ్మం నగరంలో అంబేద్కర్‌ భవన్‌, షాదీఖానా, ఎంబీ గార్డెన్‌ తదితర ప్రాంతాల్లో వీరికి వసతి కల్పించారు. 

మండల కేంద్రాల్లోనూ అధికారులు భవనాలను సమకూర్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 70 వేల మంది వలస కార్మికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సీఎం కేసీఆర్‌ పిలుపునకు పలు స్వచ్ఛంద సంస్థల బాధ్యులు, పలువురు దాతలు కూడా స్పందించి వలస కూలీలకు నిత్యావసర వస్తువులను అందజేసి ఆదుకున్నారు. logo