గురువారం 02 జూలై 2020
Khammam - May 12, 2020 , 01:42:04

అప్రమత్తతే ఆయుధం

అప్రమత్తతే ఆయుధం

  • కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తే ప్రభుత్వాసుపత్రికి పంపండి: కలెక్టర్‌

ఖమ్మం, నమస్తే తెలంగాణ: అన్ని వర్గాల ప్రజలూ కరోనా నియంత్రణలో భాగస్వాములై అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ సూచించారు. సోమవారం జడ్పీ మీటింగ్‌ హాల్లో ఆయన నగరంలోని ప్రైవేట్‌ ఆసుపత్రుల నిర్వాహకులు, వైద్యులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను తప్పకుండా పాటించాలని సూచించారు. కొవిడ్‌ అనుమానిత లక్షణాలున్న వ్యక్తులను గుర్తించిన వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఖమ్మం ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో వ్యాధిగ్రస్తులకు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. సీజనల్‌ వ్యాధులు, ఎలీసా టెస్టులను ప్రభుత్వాసుపత్రిలోనే నిర్వహించాలని, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో నిర్వహించొద్దని ఆదేశించారు. కరోనా కట్టడిలో జిల్లా యంత్రాంగం సఫలమైందని అన్నారు. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో ప్రైవేట్‌ వైద్యశాలలు చికిత్సలు ప్రారంభించినందున వైద్య చికిత్స నిమిత్తం వచ్చే రోగులు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా తెలియజేయాలన్నారు. శానిటైజర్‌ అందుబాటులో ఉంచాలని, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు కలిగిన వారిని వెంటనే ప్రభుత్వాసుపత్రికి పంపాలని సూచించారు. డీఎంహెచ్‌వో మాలతి, ఆర్‌ఎంవో శ్రీనివాసరావు, ప్రైవేట్‌ ఆసుపత్రుల యజమానులు పాల్గొన్నారు.  


logo