శనివారం 11 జూలై 2020
Khammam - May 12, 2020 , 01:42:04

ఊపందుకున్న పౌర సేవలు

ఊపందుకున్న పౌర సేవలు

  • ఉద్యోగుల హాజరుతో ప్రభుత్వ కార్యాలయాలు కళకళ
  • గ్రామీణులకు అందుబాటులో రెవెన్యూ, వ్యవసాయ సిబ్బంది
  • పనుల కోసం ఆఫీసులకు వస్తున్న ప్రజలు
  • భౌతిక దూరం, మాస్కుల ధారణ యథాతథం

ఖమ్మం, నమస్తే తెలంగాణ: ప్రజాహిత కార్యక్రమాల నిర్వహణలో ప్రజలకు, ప్రభుత్వానికి వారధులుగా పనిచేసే ఉద్యోగుల హాజరుతో ప్రభుత్వ కార్యాలయాలు కళకళలాడుతున్నాయి. జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలూ సోమవారం యథాతథంగా పనిచేశాయి. లాక్‌డౌన్‌ అనంతరం ఉద్యోగులు విధులకు హాజరై ఉత్సాహంగా పని చేస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారు. కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రారంభించిన మొదటి రోజే అన్ని కార్యాలయాల సిబ్బంది విధులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఫలితంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టే శాఖలతోపాటు ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే శాఖల సిబ్బంది కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. కొద్దిమంది మాత్రమే విధుల్లో ఉన్నారు. వైద్యారోగ్య, పోలీసు వంటి శాఖల ఉద్యోగులు, సిబ్బంది మాత్రం నిరంతరం విధుల్లో కొనసాగారు. ఇటీవల లాక్‌డౌన్‌ నిబంధనలకు సడలింపులు ఇవ్వడంతో ఆదాయ వనరులను సమకూరుస్తున్న రిజిస్ట్రేషన్లు, రవాణా, ఎక్సైజ్‌ శాఖల కార్యకలాపాలు విస్తృతమయ్యాయి. భౌతిక దూరాన్ని పాటిస్తూ, మాస్కులను ధరిస్తూ ఉద్యోగులు పౌరసేవలను అందిస్తున్నారు. మిగతా కార్యాలయాల్లోని కార్యకలాపాలు కూడా యథావిధిగా కొనసాగుతున్నాయి. రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా జిల్లాలో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. అలాగే రవాణాశాఖలోనూ కార్యకలాపాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. టెన్త్‌, డిగ్రీ పరీక్షలను నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. మద్యం దుకాణాలకు కూడా ప్రభుత్వం అనుమతులివ్వడంతో ఎక్సైజ్‌ సిబ్బంది పనుల్లో నిమగ్నమయ్యారు. పలు ప్రజాహిత కార్యకలాపాలను గ్రామస్థాయి నుంచి నిర్వహించాల్సిన రెవెన్యూ శాఖ పూర్తిస్తాయిలో సేవలందిస్తున్నది. నిర్మాణ, వ్యవసాయ రంగాల పనులు ఊపందుకున్నాయి. వ్యవసాయశాఖ సిబ్బంది కూడా గ్రామాల బాట పడుతున్నారు. భవన నిర్మాణ రంగంలో కార్యకలాపాలు మొదలు కావడంతో అనుమతుల కోసం మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపల్‌ కార్యాలయాలకు తాకిడి పెరుగుతున్నది. ప్రధాన ప్రభుత్వాసుపత్రితోపాటు పలు పీహెచ్‌సీలు యథాతథంగా పనిచేస్తున్నాయి. 

భౌతిక దూరం పాటిస్తూనే..

పౌరసేవలను పూర్తిస్తాయిలో అందించేందుకు నిమగ్నమైన పలు శాఖల సిబ్బంది తమ కార్యాలయాల్లో భౌతిక దూరం పాటిస్తున్నారు. కార్యాలయాలకు అవసరాల రీత్యా వస్తున్న ప్రజలు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. 

నిరంతరం సేవలందిస్తున్నాం..

ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నాం. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కూడా వైద్యసేవలు అందించాం. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం చేస్తున్న సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలి. ప్రధానంగా భౌతిక దూరం పాటించాలి. మాస్కులు ధరించాలి.

-డాక్టర్‌ బొలికొండ శ్రీనివాసరావు, ప్రభుత్వాసుపత్రి ఆర్‌ఎంవో

విస్తృత సేవలు అందిస్తాం..

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాలన్నీ పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ స్ఫూర్తితో మరింత విస్తృత సేవలను అందించేందుకు ఉద్యోగులంతా సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో శక్తివంచన లేకుండా పనిచేస్తున్నాం. జాగ్రత్తలు పాటిస్తూనే ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్నాం. 

-అఫ్జల్‌హసన్‌, టీఎన్‌జీవోస్‌ నాయకుడు

ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం..

లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించిన అనంతరం ప్రభుత్వ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో కొంత మేర ఇబ్బంది ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేశాం. ఇప్పుడు సడలింపులు ఇవ్వడంతో గ్రామ, మండల స్థాయిల్లో మా సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. కార్యాలయాల్లో భౌతిక దూరం పాటిస్తూ పనులు చేస్తున్నాం.

-నర్సింహారావు, రఘునాథపాలెం తహసీల్దార్‌

ప్రభుత్వ సేవల కోసం ప్రజలు ఎదురు చూశారు..

లాక్‌డౌన్‌ వల్ల ప్రభుత్వ కార్యాలయాలు మూతపడడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తహసీల్‌, మున్సిపాలిటీ కార్యాలయాల్లోని ధ్రువీకరణపత్రాలు ఇప్పుడిప్పుడే క్లియర్‌ అవుతున్నాయి. ఈ సేవల కోసం ఇప్పటి వరకూ ప్రజలు ఎంతగానో ఎదురుచూశారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో ప్రజల కష్టాలు తీరుతున్నాయి.

-నర్రా యల్లయ్య, టీఆర్‌ఎస్‌ నాయకుడు 

ప్రభుత్వ నిర్ణయం బాగుంది..

ఉద్యోగుల సేవలను పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాగుంది. లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడిన ప్రజలందరూ ఇప్పుడు కార్యాలయాలకు వెళ్లి తమ పనులను చేయించుకుంటున్నారు. కొత్తగా పింఛన్ల కోసం, రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తులు పెరుగుతున్నాయి.

-అబ్బూరి వెంకటేశ్వర్లు, ఖమ్మంlogo