గురువారం 02 జూలై 2020
Khammam - May 12, 2020 , 01:42:05

గ్రీన్‌జోన్‌లో పూర్తిస్థాయి కార్యకలాపాలు

గ్రీన్‌జోన్‌లో పూర్తిస్థాయి కార్యకలాపాలు

భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: కరోనా తొలినాళ్లలోనే నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం హైఅలెర్ట్‌ ప్రకటించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను రెడ్‌జోన్‌ పరిధిలో చేర్చింది. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో 20 శాతం ఉద్యోగులే పనిచేసి అత్యవసర ఫైళ్లను క్లియర్‌ చేస్తూ వచ్చారు. జిల్లా ఇప్పుడు గ్రీన్‌జోన్‌లోకి ప్రవేశించడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో సోమవారం నుంచి ఉద్యోగులు పూర్తిస్థాయిలో కార్యాలయాలకు హాజరై పనులు ప్రారంభించారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఉద్యోగులు, ప్రజలతో కిటకిటలాడాయి. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ కార్యాలయాల్లో తమ విధులను నిర్వహించారు. వ్యాపారులకు కూడా ప్రభుత్వం వెసలుబాటు కల్పించడంతో నాలుగు రోజులుగా వ్యాపార లావాదేవీలు కొనసాగుతున్నాయి. పట్టణాల్లో సరి, బేసి విధానంలో షాపులను తెరుస్తున్నారు. మండలాల్లో యథావిధిగా అన్ని షాపులూ తెరుచుకున్నాయి. 

పెండింగ్‌ ఫైళ్లు క్లియర్‌ చేయాలి

జిల్లా గ్రీన్‌ జోన్‌లోకి రావడంతో ప్రభుత్వ సిబ్బంది తప్పనిసరిగా విధులకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకున్నాం. ప్రతి రోజూ సిబ్బంది హాజరు వివరాలను, పనుల నివేదికలను కలెక్టరేట్‌కు అందజేయాలని సూచించాం. కార్యాలయాల్లో ఫైళ్ల క్లియరెన్స్‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలపై సమగ్ర నివేదికలు రూపొందించి అందజేయాలని అధికారులను ఆదేశించాం.

-కలెక్టర్‌ ఎంవీ రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం 


logo