బుధవారం 08 జూలై 2020
Khammam - May 11, 2020 , 02:08:36

మద్యం ప్రియుల జేబులకు చిల్లు

మద్యం ప్రియుల జేబులకు చిల్లు

  • అధిక ధరలకు లిక్కర్‌ విక్రయిస్తున్న దుకాణాదారులు
  • ప్రభుత్వ నియమ, నిబంధనలు బేఖాతరు
  • ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో అదే తీరు..
  • తక్షణమే చర్యలు తీసుకోవాలని కొనుగోలుదారుల డిమాండ్‌

ఖమ్మం, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ సడలింపులు.. మద్యం ప్రియుల అవసరాన్ని క్యాష్‌ చేసుకుంటున్నారు మద్యం దుకాణాల నిర్వాహకులు. అందినంత దోచుకుంటున్నారు.. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. ఖమ్మం నగరంలోని ఇల్లెందుక్రాస్‌ రోడ్‌లోని ఓ వైన్స్‌ దుకాణంలో ప్రతి క్వార్టర్‌ బాటిల్‌కు రూ.10 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారని, ఈ చొప్పున పది సీసాలకు రూ.100 నష్టపోతున్నామని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. శనివారం ఓ వినయోగదారుడు తాను క్రెడిట్‌ కార్డు ద్వారా మద్యం కొనుగోలు చేశానని, మద్యం దుకాణాదారుడు తాను కొనుగోలు చేసిన మద్యానికి రూ.3,400 తీసుకోవాల్సి ఉండగా రూ.3,636 తీసుకున్నాడని జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. సాధారణంగా క్రెడిట్‌కార్డు ద్వారా చెల్లింపులు జరిపితే ఒక శాతం జీఎస్టీ ఉంటుందని, కానీ మద్యం దుకాణాదారులే ఎక్కువ నగదు వసూలు చేయడం ఏమిటని ప్రశ్నించాడు. రాష్ట్ర ప్రభుత్వం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దుకాణాల్లో అమ్మకాలకు అవకాశం ఇచ్చింది. ఆదాయం తక్కువగా ఉన్న ప్రాంతాల్లోని మద్యం దుకాణాదారులు ఎక్కువగా ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

అధిక ధరలకు విక్రయం..

కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో జిల్లాలోని 89 దుకాణాలు లాక్‌డౌన్‌లో భాగంగా మూతపడ్డాయి. దీంతో మద్యం విక్రయాలు నిలిచిపోయాయి. గ్రామాల్లో కల్తీ మద్యం అమ్మకాలు, గుడుంబా తయారీకి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు ప్రభుత్వం కొన్ని సడలింపులు ప్రకటించింది. రాష్ట్రంలో మద్యం దుకాణాల్లో విక్రయాలకు అవకాశం కల్పించింది. దీనిలో భాగంగా జిల్లాలోని 89 దుకాణాలకు  86 దుకాణాల్లో మద్యం విక్రయించేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ నెల 6వ తేదీ నుంచి జిల్లాలో విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఆ ఒక్కరోజే జిల్లాలో రూ.3 కోట్లకు పైగా విక్రయాలు జరిగాయి. గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో అమ్మకాలకు అవకాశం కల్పించడంతో ఈ నెల 6వ తేదీన మద్యం ప్రియులు దుకాణాల వద్ద క్యూ కట్టారు. చాలారోజుల తర్వాత షాపులు తెరుచుకోవడంతో వేలాది మంది వినియోగదారులు షాపుల ఎదుట బారులు తీరి మద్యం కొనుగోలు చేశారు. అయితే.. మద్యం దుకాణాల నిర్వాహకులు ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తున్నట్లు ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. ఎక్సైజ్‌ అధికారులు మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ అవి పట్టించుకోకుండా దోపిడీకి పాల్పడుతున్నారని తెలుస్తున్నది. అదనపు వసూళ్లకు పాల్పడితే చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో ఎక్సైజ్‌ అధికారులు కొరడా ఝలిపించేందుకు సిద్ధమవుతున్నారు.

చర్యలు తీసుకునేందుకు సిద్ధం.. 

ఈ విషయమై ఎక్సైజ్‌ అధికారులను వివరణ కోరగా వినియోగదారుల నుంచి అదనపు వసూలుకు పాల్పడే మద్యం దుకాణాదారులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్సైజ్‌శాఖ ధరలకు సంబంధించి ఒక యాప్‌ రూపొందించిందని, దానికి అనుగుణంగా మాత్రమే దుకాణదారులు విక్రయాలు చేపట్టాలన్నారు.

వినియోగదారులు ఆ యాప్‌లో ఉన్న ధరలను, లేదా దుకాణం బయట ప్రదర్శించిన పట్టికలో ధరలను పరిశీలించి మద్యం కొనుగోలు చేయవచ్చన్నారు. ప్రభుత్వం మద్యం ధరలను 16 శాతం మాత్రమే పెంచిందన్నారు. దాని ప్రకారమే విక్రయాలు జరగాలన్నారు. logo