గురువారం 09 జూలై 2020
Khammam - May 10, 2020 , 02:39:29

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

  • వేర్‌ హౌసింగ్‌ గోదాము నిర్మాణానికి 10 ఎకరాలు మంజూరు
  • స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్‌కుమార్‌

రఘునాథపాలెం: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. రఘునాథపాలెం మండలం జింకలతండా వద్ద వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ గోదాము నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ మేరకు మంత్రి పువ్వాడ శనివారం కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌తో కలిసి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 10 వేల మెట్రిక్‌ టన్నుల సరుకు నిల్వ ఉంచేందుకు మండల కేంద్రంలో గోదాము నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే రైతుల పంటలను నిల్వ చేసుకునేందుకు మంచుకొండ గ్రామంలో గోదాము నిర్మాణం చేపట్టినట్లు గుర్తుచేశారు. కరోనా వంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు రైతుల వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు ఇలాంటి గోదాములు ఎంతగానో దోహదపడుతాయని అన్నారు. రాష్ర్టాన్ని అగ్రికల్చర్‌ హబ్‌గా మార్చాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని జిల్లాల్లోనూ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ గోదాముల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని అన్నారు. మంజూరైన స్థలానికి త్వరితగతిన హద్దులు గుర్తించి మార్కెటింగ్‌ శాఖకు అప్పగించాలని తహసీల్దార్‌ నర్సింహారావును మంత్రి ఆదేశించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, మాజీ జడ్పీటీసీ వీరూనాయక్‌, వీఆర్‌వో ప్రసాద్‌, పలువురు సర్పంచ్‌లు పాల్గొన్నారు.


logo