శనివారం 04 జూలై 2020
Khammam - May 09, 2020 , 01:49:36

సడలింపు సందడి

సడలింపు సందడి

  • ఉమ్మడి జిల్లాలో తెరుచుకున్న వ్యాపార సముదాయాలు
  • సరి, బేసి విధానంలో దుకాణాలు తెరచిన వ్యాపారులు
  • వినియోగదారులు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు
  • షాపుల వద్ద మాస్క్‌లు, శానిటైజర్ల ఏర్పాటు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి/ ఖమ్మం, నమస్తే తెలంగాణ: సుమారు నెలన్నర తర్వాత షాపులు తెరుచుకున్నాయి.. వ్యాపార సముదాయాలు వినియోగదారులతో దర్శనమిచ్చాయి.. లాక్‌డౌన్‌ సడలింపుతో ఉమ్మడి జిల్లాలో శుక్రవారం సందడి కనిపించింది. మంత్రి అజయ్‌కుమార్‌ ప్రత్యేక చొరవతో ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగాలను సమన్వయం చేసుకుంటూ కరోనా కట్టడికి కృషి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం గ్రీన్‌ జోన్‌ కాగా, ఖమ్మం జిల్లా ఆరెంజ్‌ జోన్‌గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయా జోన్లను బట్టి వ్యాపారులు దుకాణాలు తెరిచారు. ఖమ్మం జిల్లా ఆరెంజ్‌ జోన్‌ నుంచి గ్రీన్‌ జోన్‌కు వెళ్లే దిశగా పయనిస్తున్నది. ఖమ్మం జిల్లాలో కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌, కొత్తగూడెం జిల్లాలో కలెక్టర్‌ ఎంవీ రెడ్డి, ఎస్పీ సునీల్‌దత్‌ వ్యాపారులకు మార్గదర్శకాలు విడుదల చేశారు. గురువారం నుంచి ఉమ్మడి జిల్లాలో వాణిజ్య లావాదేవీలు ప్రారంభమయ్యాయి. కొత్తగూడెం జిల్లాకేంద్రంతో పాటు ఖమ్మంలోని కమాన్‌బజార్‌, కస్బాబజార్‌, గాంధీచౌక్‌, వైరారోడ్‌, ఇల్లెందు క్రాస్‌రోడ్‌, రోటరీనగర్‌, బస్‌డిపో రోడ్‌, కాల్వొడ్డు ప్రాంతాల్లో వ్యాపార సముదాయాల్లో సందడి కనిపించింది. వ్యాపారులు దుకాణాల వద్ద మాస్క్‌లు ఉన్న వారినే దుకాణంలోకి అనుమతిస్తున్నారు. షాపుల బయట శానిటైజర్లు అందుబాటులో ఉంచుతున్నారు. దుకాణాల్లో పనిచేసే వారు కూడా తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు.

సరి, బేసి విధానాల్లో దుకాణాలు ఓపెన్‌..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రీన్‌ జోన్‌లో ఉంది. ఇక్కడ సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో సరిసంఖ్య నంబర్లు గల షాపులు, మంగళ, గురు, శనివారాలు బేసి సంఖ్య గల షాపులను తెరిచే విధంగా అధికారులు దుకాణ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విధానాన్ని అమలుచేయని దుకాణాల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భారీ జరిమానా విధించనున్నారు. ఖమ్మం నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేట్‌ సెక్టార్‌లో ఉన్న కార్యాలయాలు కూడా తెరుచుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన విధంగా రిజిస్ట్రేషన్‌, రవాణాశాఖ కార్యాలయాలు తెరుచుకున్నాయి. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు లాక్‌డౌన్‌ పీరియడ్‌లో కూడా తెరవగా రవాణాశాఖ కార్యాలయాలు మాత్రం గురువారం నుంచి తెరుచుకున్నాయి. దీంతో వినియోగదారులు కార్యాలయాలకు పరుగులు తీశారు. ఆయా కార్యాలయాల వద్ద భౌతిక దూరాన్ని పాటించేలా ఏర్పాట్లు చేయడంతో పాటు మాస్కులను తప్పనిసరి చేశారు. శానిటైజర్లను కూడా వినియోగించాలని సూచించారు. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా రవాణాశాఖ సేవలకు వెసులుబాటు కలిగించడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయం వాహనదారులతో కళకళలాడుతోంది. అధికారులు భౌతికదూరం పాటిస్తూ వాహనదారులకు సేవలందిస్తున్నారు. కార్యాలయం ఎదుట శానిటైజర్లు అందుబాటులో ఉంచారు.

సందడిగా మారిన ప్రధాన రహదారులు

లాక్‌డౌన్‌తో నిర్మానుష్యంగా మారిన రహదారులు సడలింపుతో ఒక్కసారిగా సందడిగా మారాయి. ట్రాఫిక్‌ రద్దీ పెరిగింది. ఆటోలు, రవాణాకు సంబంధించిన వాహనాలు రోడ్లపైకి రావడంతో బజారులన్నీ మునుపటి కళను సంతరించుకున్నాయి. బస్సులు మినహా మిగతా వాహనాలన్నీ రోడ్డెక్కేందుకు అనుమతించడంతో ప్రైవేటు వాహన డ్రైవర్లలో కొంత ఊరట కలిగింది. ఆటోలు రోడ్డెక్కక ఇబ్బంది పడిన ఆటో డ్రైవర్లు సడలింపు నిర్ణయంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎప్పటిలాగే ఆటో నడుపుకుంటూ జీవనం ప్రారంభించారు.

వ్యాపార సముదాయాలను పరిశీలించిన మంత్రి అజయ్‌

రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్‌కుమార్‌, జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, ఖమ్మం మేయర్‌ డాక్టర్‌ పాపాలాల్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌ జయంతితో కలిసి నగరంలోని కమాన్‌బజార్‌, కస్బాబజార్‌లో పర్యటించారు. వ్యాపార సముదాయాలను తనిఖీ చేశారు. దుకాణాల యజమానులకు సూచనలు, సలహాలిచ్చారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలన్నారు. వినియోగదారులు భౌతిక దూరం పాటించేలా చూడాలన్నారు. మాస్క్‌లు ఉంటేనే లోపలికి అనుమతించాలన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్‌ను ఆదేశించారు. అనంతరం పువ్వాడ ఫౌండేషన్‌ సమకూర్చిన శానిటైజర్లు, మాస్క్‌లను నిరుపేదలకు పంపిణీ చేశారు. 

రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరుగుతున్నది..

లాక్‌డౌన్‌లోనూ కార్యాలయం తెరిచే ఉంది. మూడు రోజుల నుంచి మాత్రం రిజిస్ట్రేషన్లు చేయించుకునే వారి సంఖ్య పెరుగుతున్నది. కార్యాలయానికి వచ్చే ప్రతిఒక్కరూ మాస్క్‌ ధరించాలని సూచిస్తున్నాం. మాస్క్‌లేని వారిని కార్యాలయంలోనికి అనుమతించడం లేదు. భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం. కార్యాలయ సిబ్బంది కూడా భౌతిక దూరం పాటిస్తూ సేవలు అందిస్తున్నాం. కార్యాలయం బయట శానిటైజర్లు ఉంచాం.

-గంగవరపు నరేందర్‌, ఖమ్మం రూరల్‌ సబ్‌రిజిస్ట్రార్‌

భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు..

కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్‌ నిర్ణయం హర్షించదగినది. లాక్‌డౌన్‌ పొడిగింపుల్లో భాగంగా రవాణాశాఖ సేవలకు వెసులుబాటు కల్పించడంతో రెండు రోజులుగా వాహనదారులు కార్యాలయానికి వస్తున్నారు. గంటకు 12 మంది చొప్పున రోజుకు 40 మందికి మాత్రమే సేవలు అందిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

-టీ కిషన్‌రావు, ఖమ్మం జిల్లా రవాణాశాఖ అధికారి

లైసెన్స్‌ కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నా..

లాక్‌డౌన్‌కు ముందు హైదరాబాద్‌ నుంచి ఖమ్మం వచ్చా. సెలవుల నేపథ్యంలో లైసెన్స్‌ పొందాలని రవాణాశాఖ కార్యాలయ సేవల కోసం ఎదురు చూస్తున్నా. ప్రస్తుతం లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఆర్టీఏ సేవలు అందుబాటులోకి రావడం ఉపయోగకరం. సీఎం కేసీఆర్‌ వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాం.

-వై యశ్వంత్‌, ముస్తాఫానగర్‌, ఖమ్మం


logo