ఆదివారం 12 జూలై 2020
Khammam - May 08, 2020 , 06:35:34

అదును చూసి అరక.. పదును చూసి మొలక

అదును చూసి అరక.. పదును చూసి మొలక

  • కార్తెలకు అనుగుణంగా పంటలు...
  • అదును చూసి నారుమళ్లు వేస్తే అధిక దిగుబడి 
  • కాలాన్ని బట్టి నాట్లు వేస్తే మరింత రాబడి
  • రోహిణి సాగుతో రెండు పంటలకు మేలు
  • అన్నదాతలను ఆలోచింపజేసిన సీఎం కేసీఆర్‌ ప్రకటన
  • చీడపీడల బెడద ఉండబోదంటున్న శాస్త్రవేత్తలు, అధికారులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ ఖమ్మం వ్యవసాయం : పూర్వ కాలంలో వాతావరణంలో వచ్చే మార్పులను కార్తెలుగా విభజించి వాటికి అనుగుణంగా వ్యవసాయాన్ని చేస్తూ వచ్చేవారు. కాలాన్ని బట్టి పంటలు వేసి అధిక దిగుబడి సాధించారు. రానురాను వర్షాభావ పరిస్థితులు, ఇతరత్రా కారణాలతో కార్తెలు కాస్తా కనుమరుగై నెలల విధానం అమలవుతూ వస్తుంది. దీనికి స్వస్తిపలికి అనాదిగా వస్తున్న కార్తెలకు అనుగుణంగా వ్యవసాయం చేసే విధానాన్ని అవలంబించి మెరుగైన ఫలితాలను సాధించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు ఎక్కడ చూసిన చుక్కనీరు లేకపోవడం గతంలో తెలంగాణ రాష్ట్ర పరిస్థితి. స్వరాష్ట్ర సాధన జరిగిన తరువాత సాగులో మార్పులు రావడం, సాగునీటి ప్రాజెక్టులు అందుబా టులోకి రావడంతో వ్యవసాయానికి మంచిరోజులు వచ్చాయి. ఈ ఏడాది పంట దిగుబడి పెరిగింది. సాగుకు అవసరమైన నీరు పుష్కలంగా ఉంది. రోహిణి కార్తెలోనే నారుమళ్లను సిద్ధం చేసుకోవాలని సీఎం కేసీఆర్‌ రైతులకు పిలుపునివ్వడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం ఆసక్తి కనపరుస్తుంది. పంటకాలాన్ని ముందుకు తీసుకువచ్చే ప్రక్రియపై జిల్లా వ్యవసాయశాఖ అధికారులు, కృషి విజ్ఞాన కేంద్రం, డాట్‌సెంటర్‌ శాస్త్రవేత్తలు హర్షిస్తున్నారు. అన్నదాతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే వానకాలం పంటతో పాటు యాసంగి పంటలసాగు ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసేందుకు మార్గం సుగమం అవుతుందని వారు సూచిస్తున్నారు. అయితే ఈ ఆలోచనను ఈ సంవత్సరం నుంచే అమలు చేసేందుకు     అన్నదాతలు ఆసక్తి చూపిస్తున్నారు.

ముందస్తు సాగుతో బహుళ ప్రయోజనాలు..

సంప్రదాయ పద్ధతిలో సాగు చేపట్టి అనేక అవస్థలు, నానా యాతలు పడుతున్న రైతాంగానికి సీఎం కేసీఆర్‌ చేసిన సూచనతో బహుళ ప్రయోజనాలు కలుగనున్నాయి. నెల రోజుల ముందుగానే సాగును ఆరంభించేందుకు అవసరమైన సాగునీరు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్న తరుణంలో ఇదే అదునుగా భావించి సాగుకు శ్రీకారం చుట్టే యోచనలో  రైతాంగం ఉంది. గతంలో ఆయిటి మొదట్లో వానలు కురవకపోవడంతో ఆకాశం వైపు అన్నదాతలు ఎదురుచూడటం పరిపాటిగా మారింది. దీంతో జూన్‌లో మొదలు కావాల్సిన వానకాలం సాగు పనులు ఆగస్టు నెలలో ప్రారంభించడం తద్వారా పంటకాలాన్ని పెంచుకోవడంతో యాసంగి సాగుపై తీవ్ర ప్రభావం చూపెట్టింది. దీంతో యాసంగి సాగు సకాలంలో పూర్తి కాకపోవడంతో సాగునీటి ఇబ్బందులతో పాటు వడగండ్ల వానలతో చేతికొచ్చిన పంటలు నేలపాలయ్యాయి. అదునుకు తగ్గట్టుగా సాగు చేయకపోవడంతో చీడపీడల బెడద రెట్టింపు కావడం తద్వారా అన్నదాతలు ఆర్థికంగా నష్టపోవడం జరిగింది. దీంతో ఒక్కో సమయంలో  రైతులు సాగుకు స్వస్తిపలికే యోచన చేశారు. వానకాలం సాగు రోహిణి కార్తెలోనే ప్రారంభిస్తే ఇలాంటి సమస్యలకు చెక్‌పెట్టడమే కాకుండా ఆశించిన ఫలితాలను పొందవచ్చు.

పంటల కాలం ముందుకు వస్తుంది..

రోహిణి కార్తెలో నారుమళ్లు పోసుకుంటే పంటల కాలం ముందుకు జరుగుతుంది. ఆలస్యంగా నాట్లు వేయడంతో చీడపీడల బెడద తట్టుకోవడం ప్రతి రైతుకు ఇబ్బందిగా మారింది. సీఎం కేసీఆర్‌ చేసిన ఆలోచన అమలులో పెట్టేందుకు అదే అదునుగా ఉంది. సాగుకు అవసరమైన నీరు పుష్కలంగా ఉంది. సీజన్‌ ఆరంభంలో కురిసే వానలతో పంట ఏపుగా పెరుగుతుంది. ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రోహిణి కార్తెలో మొలక కట్టుకుంటే సాగుకు అనుకూలంగా ఉంటుంది. 

-డాక్టర్‌ హేమంత్‌కుమార్‌, వైరా కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్‌

పంట పొలానికి బీమార్ల బెడద ఉండదు..

అదునుకు ముందుగానే రోహిణికార్తెలో రైతులు మొలక అలుక్కుంటే బహుళ ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా పంటపొలానికి బీమార్ల బాధ ఉండదు.  పూర్వకాలంలో ఉన్న పరిస్థితి నేడు యా వత్‌ తెలంగాణలో కనబడుతుంది. వర్షం కోసం ఆకా శం వైపు ఎదురుచూసే అవసరం లేకుండా  సాగునీరు అందుబాటులో ఉంది. ఈ పరిస్థితులను, వనరులను సద్వినియో గం చేసుకుంటే రైతులకు  మేలు చేకూరుతుంది. జూన్‌ నెల 15 లోపు విత్తనపొడ్లు మండెకట్టుకుని మొలకను నారు మళ్లలో అలుక్కోవాలి.

-అత్తోట ఝాన్సీలక్ష్మీకుమారి, ఖమ్మం జిల్లా వ్యవసాయశాఖ అధికారి 

పాత పద్ధతిలోనే వ్యవసాయం చేస్తే బాగుంటది 

 పాత పద్ధతిలో వ్యవసాయం చేస్తే బాగుంటది. మే నెలలో వేసవి దుక్కులు దున్ని ఉంచుకొని తొలి వా నకే విత్తనాలు నాటడం వల్ల పంట దిగుబడి పెరుగుతది. ‘పంట ముదురు అయితే పైరుకు ఎదురు లేద నే’ సామెతకు తగ్గట్టుగా ముందస్తు వ్యవసాయంతో రైతులు లాభాల బాట పట్టవచ్చు. ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ ఆ దిశగా ఆలోచించటం అభినందనీయం. తెలంగాణలో పాత పద్ధతులు  అవలంబించి సన్నరకం వరిని పండిస్తే రానున్న రోజుల్లో రైతులకు సిరుల పంటే.

  -అంకిరెడ్డి కృష్ణారెడ్డి, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు 


logo