శనివారం 04 జూలై 2020
Khammam - May 07, 2020 , 01:12:34

రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్టంగా తనిఖీలు చేపట్టాలి

రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్టంగా తనిఖీలు చేపట్టాలి

  • ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ 

వైరా, నమస్తే తెలంగాణ  : మండలంలోని గన్నవరం గ్రామ సమీపంలో ఉన్న తెలుగు రాష్ర్టాల సరిహద్దుల్లో తనిఖీలు మరింత పటిష్టంగా చేపట్టాలని ఎమ్మెల్యే రాములునాయక్‌ పోలీస్‌ అధికారులను ఆదేశించారు. మండలంలోని గన్నవరం  సమీపంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ వైస్‌ చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌తో కలిసి బుధవారం ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోలీస్‌ అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఏ ఒక్కరిని తెలంగాణ ప్రాంతంలోకి అనుమతించవద్దని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా ఆరెంజ్‌ జోన్‌లో ఉండి సురక్షితంగా ఉందన్నారు. అయితే సరిహద్దులోని కృష్ణా జిల్లా రెడ్‌జోన్‌లో ఉందన్నారు. కృష్ణా జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి ఈ చెక్‌పోస్ట్‌ ద్వారా ఏ ఒక్కరిని అనుమతించవద్దన్నారు. అనంతరం దాచాపురం  సర్పంచ్‌ వేమిరెడ్డి విజయలక్ష్మి ఆంధ్రప్రదేశ్‌లోని నెమలిలో ఉన్న ఎస్‌బీఐలో గన్నవరం, దాచాపురం గ్రామాల వారి ఖాతాలు ఉన్నాయని, బ్యాంకు పనుల నిమిత్తం ఆయా గ్రామాల ప్రజలు నెమలి వెళ్లాల్సి వస్తుందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అందుకు స్పందించిన ఎమ్మెల్యే నెమలిలో ఉన్న బ్యాంకు అకౌంట్లను వైరాకు బదిలీ చేయించేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడతానని చెప్పారు. కార్యక్రమంలో ఏసీపీ కె.సత్యనారాయణ, సీఐ జె.వసంతకుమార్‌, ఎస్సై వి.సురేష్‌, మున్సిపాలిటీ చైర్మన్‌ సూతకాని జైపాల్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గుమ్మా రోశయ్య, ఎంపీపీ వేల్పుల పావని, జెడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పసుపులేటి మోహన్‌రావు, మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌ ముళ్ళపాటి సీతారాములు, శేషిరెడ్డి పాల్గొన్నారు.  


logo