బుధవారం 15 జూలై 2020
Khammam - May 07, 2020 , 01:12:34

‘సరి’..‘బేసి’ అమలు..

‘సరి’..‘బేసి’ అమలు..

  • జిల్లాలో 50 శాతం దుకాణాల్లో విక్రయాలకు అనుమతి 
  • ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అమ్మకాలు 
  • 29 వరకు నిబంధనలు వర్తింపు
  • రాత్రి వేళల్లో పకడ్బందీగా కర్ఫ్యూ  
  • కరోనా వైరస్‌ నియంత్రణ చర్యలకు సహకరించాలి
  • రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ 

ఖమ్మం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రజావసరాల కోసం వస్తు విక్రయ దుకాణాలను ‘సరి’..‘బేసి’ విధానంలో తెరిచి ఉంచేందుకు జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించే వరకు ఈ విధానాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా వైరస్‌ను నియంత్రించడంలో సాధ్యమైనంత మేరకు సఫలీకృతమయ్యామని అన్నారు. అయితే లాక్‌డౌన్‌ సమయంలో నిత్యావసర వస్తువులతో పాటు ఇతర వస్తువుల దుకాణాల నిర్వహణకు అవసరమైన అనుమతిని ప్రభుత్వం కల్పించిందన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిత్యావసరేతర వస్తు విక్రయ షాపులు తెరుచుకునేందుకు అనుమతించినట్లు పేర్కొన్నారు. మున్సిపాలిటీల పరిధిలో ‘సరి’..‘బేసి’ సంఖ్య ఆధారంగా దుకాణాదారులు భౌతిక దూరాన్ని పాటిస్తూ వస్తువిక్రయాలు చేసేందుకు అవకాశం కల్పించామన్నారు. గురువారం నుంచి జిల్లాలో ఈ పద్ధతి లాక్‌డౌన్‌ ఎత్తివేసే వరకు కొనసాగుతుందన్నారు. నిత్యావసరాల విక్రయ దుకాణాలు ఎప్పటి మాదిరిగానే ఎటువంటి ఆంక్షలు లేకుండా నిర్వహించుకునే వెసులుబాటు కల్పించామన్నారు. రాత్రి కర్ఫ్యూ జిల్లావ్యాప్తంగా అమలులో ఉంటుందని, రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు దుకాణాలను తప్పనిసరిగా మూసివుంచాల్సిందేనని అన్నారు. దుకాణ యజమానులు, వాటిలో పనిచేస్తున్న వర్కర్లు, కొనుగోలుదారులు తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించా లన్నారు. ఈ బాధ్యత దుకాణ యజమానులపై ఉందని, నిబంధనలు పాటించని దుకాణాలను అధికారులు గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. మత, రాజకీయపరమైన సమావేశాలు, సామూహిక కార్యకలాపాల నిర్వహణ నిషిద్ధమన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు యథాతథంగా పనిచేస్తూ ప్రజలకు అవసరమైన సేవలందిస్తాయని చెప్పారు. వ్యవసాయం, వ్యవసాయేతర, భవన నిర్మాణ సంబంధిత వస్తు సామగ్రి విక్రయాలు జిల్లాలో యథాతథంగా కొనసాగుతాయన్నారు. ప్రస్తుతం జిల్లాలో కంటైన్మెంట్‌ జోన్లు ఏమీలేవని కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ తెలిపారు.

వస్తు విక్రయ దుకాణాల నిర్వహణకు గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి ఆంక్షలు లేవని ఆయన పేర్కొన్నారు. మున్సిపాలిటీల పరిధిలో మాత్రమే నిబంధనలు కఠినంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. విద్యాసంస్థలు, సినిమాహాళ్లు, జిమ్‌లు, స్టేడియాలు, రెస్టారెంట్లు తదితర వాటిపై ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 775 కరోనా వైరస్‌ శాంపిల్స్‌ సేకరించి పరీక్షలకు పంపామన్నారు. వాటిలో కేవలం 8 మాత్రమే పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని అవి కూడా ఒకే కుటుంబంలో ఐదు ఉన్నాయని ఆయన వివ రించారు. ప్రస్తుతం ఆరుగురు చికిత్స అనంతరం దవాఖాన నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని, మరో ఇద్దరు త్వరలో డిశ్చార్జ్‌ కానున్నట్లు వివరించారు. జిల్లాలో 44,807 మంది వలస కార్మికులున్నారని, ఇప్పటికే 32,757 మందిని వారి స్వస్థలాలకు పంపించామని తెలిపారు. లాక్‌డౌన్‌ సందర్భంగా జిల్లాలో ఇప్పటి వరకు 1830 వాహనాలను సీజ్‌చేసి 840 మంది పై కేసులు నమోదు చేశామని పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌ చెప్పారు. సమాజ శ్రేయస్సు కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ నిబంధనలను ప్రజలు తప్పనిసరిగా పాటించి తమకు సహకరించాలని ఆయన కోరారు. లాక్‌డౌన్‌ నిబంధనల అమలుకు జిల్లావాసులు సహకరిస్తున్నారని అదే ఒరవడిని కొనసాగిస్తూ  కరోనా వైరస్‌ నియంత్రణకు పాటుపడదామని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీచైర్మన్‌ లింగాల కమల్‌రాజు, నరగ పాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిణి డాక్టర్‌ మాలతి తదితరులు పాల్గొన్నారు.  


logo