శనివారం 11 జూలై 2020
Khammam - May 04, 2020 , 02:06:42

సీఎం ముందుచూపుతోనే ‘వైరస్‌' కట్టడి

సీఎం ముందుచూపుతోనే ‘వైరస్‌' కట్టడి

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్‌ ముందు చూపుతోనే ‘కరోనా’ కట్టడి సాధ్యమైందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం గ్రీన్‌ జోన్‌గా మారడానికి కలెక్టర్‌ ఎంవీ రెడ్డి, జిల్లా అధికారులు తీసుకున్న చర్యలే కారణమని అన్నారు. నామా ముత్తయ్య ట్రస్ట్‌ తరఫున కలెక్టర్‌ ఎంవీ రెడ్డికి  10వేల లీటర్ల శానిటైజర్‌, ఐదువేల మాస్క్‌లను ఆదివారం కొత్తగూడెం క్లబ్‌లో ఎంపీ నామా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కరోనా నిర్మూలనకు మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దేశానికే దిక్సూచిగా నిలిచాయని అన్నారు. ‘కరోనా’ కట్టడికి కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి నేతృత్వంలో పటిష్ట చర్యలు చేపట్టిన జిల్లా యంత్రాంగానికి సెల్యూట్‌ చేస్తున్నట్లు చెప్పారు. మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ మాట్లాడుతూ... ‘కరోనా’ కట్టడికి కృషి చేసిన కలెక్టర్‌ను, జిల్లా అధికార యంత్రాంగాన్ని అభినందించారు. కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి మాట్లాడుతూ... ‘కరోనా’ కట్టడికి జిల్లా యంత్రాంగం సైనికుల్లాగా  పనిచేశారని చెప్పారు. జిల్లా, అంతర్రాష్ట్ర సరిహద్దులను రేయింబవళ్లు కాపలా కాయడం ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించినట్లు చెప్పారు. ప్రజాప్రతినిధులు, ప్రజలు, వ్యాపారులు, మీడియా సహకారంతోనే నేడు మనం సురక్షిత స్థానంలో ఉన్నామని అన్నారు. పరిశ్రమల నిర్వహణకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా పరిశ్రమల అధికారులతో సమావేశం నిర్వహించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సన్నద్ధులను చేసినట్లు వివరించారు. జిల్లాలోని దాదాపు 25,017మంది వలస కూలీలను స్వరాష్ర్టాలకు పంపేందుకు అన్ని చర్యలు  తీసుకున్నట్లు చెప్పారు. కలెక్టర్‌ను ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ దిండిగాల రాజేందర్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ కంచర్ల చంద్రశేఖర్‌రావు తదితరులు పాల్గొన్నారు. 


logo