గురువారం 02 జూలై 2020
Khammam - May 03, 2020 , 02:37:23

ఇంటింటికీ మామిడికాయ పచ్చడి

ఇంటింటికీ మామిడికాయ పచ్చడి

  • 2500 కుటుంబాలకు అందజేసేందుకు ఏర్పాట్లు..
  • రూ. 3.50 లక్షలతో తయారు చేస్తున్న కార్పొరేటర్‌ పగడాల 
  • 5న మంత్రి అజయ్‌కుమార్‌ ద్వారా పంపిణీకి సన్నాహాలు

ఖమ్మం, నమస్తే తెలంగాణ: ప్రజాజీవనాన్ని కరోనా మహమ్మారి ఛిన్నాభిన్నం చేసింది. లాక్‌డౌన్‌ కారణంగా పేదలు మరిన్ని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉపాధి కోల్పోయిన కూలీలను, పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వ సాయానికి తోడు దాతలూ ముందుకు వస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల బాధ్యులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు మరో అడుగు ముందుకేసి బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలను విరివిగా పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో నగరంలోని 26వ డివిజన్‌ కార్పొరేటర్‌ పగడాల నాగరాజు భిన్నమైన ఆలోచన చేశారు. నిత్యావసర సరుకులు, కూరగాయలను అందిస్తున్న మాదిరిగానే తాను కూడా ఇంటింటికీ కిలో మామిడికాయ పచ్చడిని అందజేస్తే సుమారు నెల రోజుల పాటు పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని భావించారు. వెంటనే ఆచరణలోకి దిగారు. 

రూ.3.50 లక్షలతో పచ్చడి తయారీ..

తన డివిజన్‌లో పేదలు, రెక్కాడితే గానీ డొక్కాడని కూలీలే అత్యధిక మంది ఉన్నందున వారికి అందించాలనే ఉద్దేశంతోనే ఈ ఆలోచన చేశారు కార్పొరేటర్‌ పగడాల. డివిజన్‌లోని దాదాపు 2500 కుటుంబాలకు ఇంటికి కేజీ చొప్పున మామిడికాయ పచ్చడిని అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజులుగా నగరంలోని ఓ ఫంక్షన్‌ హాల్లో సుమారు 70 మంది ఈ పచ్చడిని తయారు చేస్తున్నారు. 2500 కేజీల (25 క్వింటాళ్ల) పచ్చడి తయారీ కోసం 15 క్వింటాళ్ల మామిడికాయలు, 8 క్వింటాళ్ల మంచి నూనె, 4 క్వింటాళ్ల కారం తదితరాలను వినియోగిస్తున్నారు. పచ్చడి తయారయ్యాక దాన్ని మూడు రోజులు మాగ బెట్టనున్నారు. ఈ నెల 5న రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం అనంతరం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఖమ్మం చేరుకున్నాక ఆయన చేతుల మీదుగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పగడాల నాగరాజు. అదే విధంగా దాతల సహకారంతో సుమారు రూ.5 లక్షల వ్యయంతో పది రోజులపాటు రోజుకు 500 మందికి ఉచిత భోజనాలనూ అందజేశారు. కాగా ఈ పచ్చడి తయారీలో టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం నాయకులు కొల్లు పద్మ, కొలనుపాక రమాదేవి, కొనకంచి సరళ, బానోత్‌ ప్రమీలా, జయ, విజయలక్ష్మి, నాయకులు అబ్బాస్‌, రాజు, ఉదయ్‌ కిరణ్‌, చిన్న నాగరాజు, సతీశ్‌, ఖాసీం, రమేశ్‌, భద్రం, లింగయ్య యాదవ్‌, మంచాల ఉపేందర్‌, అఫ్జల్‌, మిన్ను, చిలక ప్రసాద్‌, శ్రీను తదితరులు నిమగ్నమయ్యారు. 

పచ్చడైతే నెలరోజుల పాటు తింటారని..

“లాక్‌డౌన్‌లో కుటుంబాలను పోషించుకోవడం కోసం పేదలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నెలకు రూ.1500 చొప్పున అందించారు. మనిషికి 12 కేజీల చొప్పున బియ్యం కూడా ఇచ్చారు. ఇవి పేదలకు ఎంతో ఉపయోగడుతున్నాయి. కూరగాయలు అందజేస్తే అవి పేదలకు రెండు మూడు రోజులే వస్తాయి. ఆ తరువాత వారు మళ్లీ కూరగాయల కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. అదే కేజీ మామిడికాయ పచ్చడిని అందజేస్తే ఒక నెల రోజుల పాటు కూరలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ ఉద్దేశంతో ఈ పచ్చడిని తయారు చేసేందుకు శ్రీకారం చుట్టాను.” -పగడాల నాగరాజు, కార్పొరేటర్‌ 


logo