గురువారం 09 జూలై 2020
Khammam - May 03, 2020 , 02:36:13

రక్తదానం.. ప్రాణదానం..

రక్తదానం.. ప్రాణదానం..

  • తలసేమియా బాధితులు, గర్భిణులకు రక్తదానం సంజీవని
  • ఎమ్మెల్యే సండ్ర కృషి అభినందనీయం : ఎంపీ నామా
  • రక్తదాతలు ముందుకురావడం గొప్ప విషయం : కలెక్టర్‌ కర్ణన్‌
  • మెగా రక్తదాన శిబిరానికి అపూర్వ స్పందన..

సత్తుపల్లి, నమస్తే తెలంగాణ, మే 2: అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానమని భావించిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు  చేయడం అభినందనీయమని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. తలసేమియా బాధితులు, ఆపదలో ఉన్న గర్భిణులను ఆదుకునేందుకు యువనేత కేటీఆర్‌ పిలుపుతో ఎమ్మెల్యే సండ్ర ఆధ్వర్యంలో సత్తుపల్లిలోని సిద్ధారం రోడ్‌లో గల ఎంఆర్‌ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని శనివారం కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ ప్రారంభించారు. ఎంపీ నామా నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా రక్తనిల్వలు నిండుకున్నందున యువనేత కేటీఆర్‌ పిలుపుతో ఎమ్మెల్యే సండ్ర స్పందించి మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారన్నారు. వెయ్యి మంది వరకు దాతలు రక్తం అందించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో తలసేమియా బాధితులకు 8 లక్షల లీటర్ల రక్తం అవసరముందని, కరోనా వల్ల దాతలు ముందుకు రావడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో  ఎమ్మెల్యే సండ్ర రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ప్రశంసనీయమన్నారు. సత్తుపల్లి నియోజకవర్గానికి ఆంధ్రా సరిహద్దు రెడ్‌జోన్‌ ఆనుకొని ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం కరోనా నుంచి త్వరలో గ్రీన్‌జోన్‌గా మారబోతున్నదని, సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో కరోనాను కట్టడి చేయగలుగుతున్నామని అన్నారు. కలెక్టర్‌ కర్ణన్‌, అధికారుల పనితీరు అభినందనీమని అన్నారు. 

రక్తదాతలు ముందుకురావడం అభినందనీయం : కలెక్టర్‌ కర్ణన్‌

‘తలసేమియా బాధితులు, గర్భిణులను ఆదుకునేందుకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం, దాతలు ముందుకు రావడం అభినందనీయం. ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర సమయాల్లో గర్భిణులకు రక్తం చాలా అవసరం. అలాంటి వారికి, తలసేమియా బాధితులకు రక్తం ఎంతో విలువైనది. సత్తుపల్లి నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేపట్టినా దాతలు ముందుండటం శుభసూచికం.’ అని కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ పేర్కొన్నారు.

ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందిస్తాం : ఎమ్మెల్యే సండ్ర

‘నియోజకవర్గంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే లక్ష్యం. ప్రతిఒక్కరికీ ఆపన్నహస్తం అందిస్తాం. లాక్‌డౌన్‌లో దాతలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి పేదలందరికీ నిత్యావసరాలు అందించడం మరువలేనిది. నియోజకవర్గంలో రైతులు, దాతలు స్పందించి మూగజీవాల ఆకలి తీర్చేందుకు 126 ట్రాక్టర్ల పశుగ్రాసం అందించడం నా జీవితంలో మర్చిపోలేని ఘట్టం. తలసేమియా వ్యాధిగ్రస్తులు, గర్భిణులను ఆదుకోవాలని యువనేత కేటీఆర్‌ ఇచ్చిన పిలుపుతో మెగా రక్తదాన శిబిరానికి శ్రీకారం చుట్టాం. వెయ్యి మంది దాతల నుంచి రక్తం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా శనివారం 600 మందికి పైగా రక్తదానం చేశారు. ఇటీవల వేంసూరు మండలం కుంచపర్తి, మర్లపాడు, తల్లాడ మండలం రామానుజవరంలో శిబిరాలు ఏర్పాటు చేయగా 250 మందికి పైగా రక్తదానం చేశారు.’ అని సండ్ర వివరించారు. ఇప్పటి వరకు 827 యునిట్ల రక్తం సేకరించామన్నారు. అనంతరం సండ్ర కూడా రక్తదానం చేశారు. కలెక్టర్‌ కర్ణన్‌, ఏసీపీ వెంకటేశ్‌, డీసీహెచ్‌ఎస్‌ వెంకటేశ్వర్లు, విద్యుత్‌, వైద్యశాఖల అధికారులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల శేషగిరిరావు, ఆర్డీవో దశరథ్‌, డీసీసీబీ మాజీ చైర్మన్‌ విజయ్‌బాబు, మున్సిపల్‌ చైర్మన్‌ మహేశ్‌, ఎంపీపీ దొడ్డా హైమావతి, వైస్‌ చైర్‌పర్సన్‌ తోట సుజలారాణి, ఆత్మ చైర్మన్‌ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, నాయకులు తుళ్లూరి బ్రహ్మయ్య, మద్దినేని బేబీ స్వర్ణకుమారి పాల్గొన్నారు. 


logo