గురువారం 02 జూలై 2020
Khammam - May 01, 2020 , 02:26:37

ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం..

ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం..

  • ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం..
  • మొక్కజొన్నల నిల్వకు గిడ్డంగులను గుర్తిస్తున్నాం
  • నేలకొండపల్లి, ముదిగొండ పర్యటనలో మంత్రి పువ్వాడ

నేలకొండపల్లి/ముదిగొండ: సీఎం కేసీఆర్‌ నిర్ణయం మేరకు రైతుల నుంచి ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, అన్నదాతలెవరూ ఆందోళన చెందొద్దని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నలను నిల్వ చేసేందుకు నేలకొండపల్లి, ముదిగొండ మండలాల్లో అనువుగా ఉన్న గిడ్డంగులను గురువారం మంత్రి పరిశీలించారు. తొలుత నేలకొండపల్లి మండలం మధుకాన్‌ షుగర్‌ ఫ్యాక్టరీలో ఉన్న గిడ్డంగిని కలెక్టర్‌ కర్ణన్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రైతులు పండించిన పంటలను నిల్వ చేసేందుకు ఆయా మండలాల్లో గిడ్డంగులను పరిశీస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే ఎంపీ నామా నాగేశ్వరరావు సహకారంతో మధుకాన్‌ పరిశ్రమలో ఉన్న 7 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గిడ్డంగిలో మొక్కజొన్నలు నిల్వ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ముదిగొండ, కూసుమంచి, చింతకాని, బోనకల్లు మండలాల్లోని జిన్నింగ్‌ మిల్లుల గిడ్డంగుల్లో కూడా నిల్వ చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటికే 2 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ కూడా పూర్తయిందన్నారు. ఈ ఏడాది 3.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి ఉంటుందని అంచనా వేసినట్లు చెప్పారు. గన్నీ బ్యాగులు, ధాన్యం సేకరణ, సరుకు రవాణా, పంట నిల్వలు వంటి అంశాల్లో రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. పంట కొనుగోళ్లకు సంబంధించి డీసీఎంఎస్‌ అధికారులు రైతుల నుంచి ఒప్పంద పత్రాలను తీసుకుంటున్నారని విలేకరులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పరిశీలించాలంటూ కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌, మధుకాన్‌ సీఓఓ విజయ్‌ప్రసాద్‌, తహసీల్దార్‌ వీరభద్రం, ఎంపీడీవో రవికుమార్‌ పాల్గొన్నారు.

మొక్కజొన్నల నిల్వకు స్థలాన్వేషణ చేయాలి.. 

మొక్కజొన్నలను నిల్వ చేసేందుకు మండలంలో అనువైన స్థలాలను గుర్తించి ప్రభుత్వానికి తెలియజేయాలని మంత్రి అజయ్‌కుమార్‌ అధికారులకు సూచించారు. ముదిగొండ జిన్నింగ్‌ మిల్లులో మొక్కజొన్నల నిల్వకు కేటాయించిన స్థలాన్ని గురువారం ఆయన పరిశీలించారు. తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంపీపీ హరిప్రసాద్‌, జడ్పీటీసీ దుర్గ, ఎంపీటీసీ మాధవి, ఏవో రాధ, ఏఈవో లిఖిత, రఘు, టీఆర్‌ఎస్‌ నేత మీగడ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

కరోనా వ్యాప్తిని కట్టడి చేశాం

  • రాష్ట్రం నుంచి వైరస్‌ పూర్తిగా కనుమరుగవుతుంది 
  • మరికొన్ని రోజులు ప్రజలు సహకరించాలి: మంత్రి

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను యంత్రాంగం పటిష్టంగా అమలు పర్చడం ద్వారానే జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయగలిగామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు. నగరంలోని కంటైన్మెంట్‌ జోన్‌ అయిన ఖిల్లా బజారును కలెక్టర్‌ కర్ణన్‌తో కలిసి గురువారం మంత్రి సందర్శించారు. వైరస్‌ బారిన పడి చికిత్స పొంది పూర్తిగా కోలుకొని ఇంటికి చేరుకున్న వ్యక్తి కుటుంబానికి మంత్రి నిత్యావసర వస్తువుల కిట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాబోయే మరికొద్ది రోజుల్లో మన రాష్ట్రం నుంచి కరోనా వైరస్‌ పూర్తిగా కనుమరుగవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకోసం ప్రజలు సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్‌ నిర్ణయం ద్వారానే వైరస్‌ పూర్తిగా అదుపులోకి వచ్చిందన్నారు. జిల్లాలో ఇప్పటికే నలుగురు వ్యక్తులు పూర్తిగా కోలుకొని ఇళ్లకు చేరుకున్నారని, మిగిలిన నలుగురు కూడా త్వరలోనే కోలుకుంటారని అన్నారు. తద్వారా ఖమ్మం జిల్లా కూడా గ్రీన్‌జోన్‌గా మారుతుందని చెప్పారు. కానీ ప్రజలు మాత్రం జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కేఎంసీ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి, జోన్‌ ఇన్‌చార్జి అధికారి రమేశ్‌, కార్పొరేటర్‌ షౌకత్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.


logo