సోమవారం 13 జూలై 2020
Khammam - May 01, 2020 , 02:22:27

మూగజీవాలు ఆకలితో అలమటించొద్దు..

మూగజీవాలు ఆకలితో అలమటించొద్దు..

  • రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ పిలుపునకు స్పందించిన ఎమ్మెల్యే సండ్ర
  • సత్తుపల్లి నియోజకవర్గం నుంచి 126 ట్రాక్టర్ల వరి గడ్డి వితరణ 
  • గోశాలలకు అందించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్‌


రఘునాథపాలెం/సత్తుపల్లి,నమస్తే తెలంగాణ/కల్లూరు/పెనుబల్లి: లాక్‌డౌన్‌ కారణంగా మూగజీవాలు ఆకలితో అలమటించొద్దనే ఉద్దేశంతో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఖమ్మంలోని గోశాలలకు 126 ట్రాక్టర్ల వరి గడ్డిని వితరణ చేశారు. సత్తుపల్లి నియోజకవర్గం నుంచి ఖమ్మానికి చేరుకున్న వరి గడ్డిని గురువారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ టేకులపల్లిలోని వెంకటేశ్వర, గొల్లగూడెంలోని శ్రీకృష్ణ గోశాలల బాధ్యులకు అందజేశారు. ముందుగా గోశాలలను మంత్రి అజయ్‌కుమార్‌ సందర్శించి గోవులకు దాణాను తినిపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తన నియోజవర్గంలోని గోశాలలకు వరి గడ్డిని వితరణ చేసిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.. మూగజీవాలను సైతం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, గోశాలల బాధ్యులు ఆరుట్ల శ్రీనివాసాచార్యులు, యల్లంపల్లి హనుమంతరావు, కార్పొరేటర్‌ ఆత్కూరి హనుమాన్‌, లక్ష్మణ్‌, సత్తుపల్లి, కల్లూరు, పెనుబల్లి మండలాల టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

ఖమ్మానికి తరలిన పశుగ్రాసం ట్రాక్టర్లు

లాక్‌డౌన్‌ కారణంగా గ్రాసం అందక అలమటిస్తున్న ఖమ్మం గోశాలల్లోని 900కు పైగా గోవులను చూసి చలించిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వాటి ఆకలిని తీర్చేందుకు ముందుకు వచ్చారు. తన నియోజకవర్గంలోని రైతుల సహకారంతో రూ.12 లక్షల విలువైన పశుగ్రాసాన్ని సేకరించారు. దానిని ఖమ్మం తీసుకెళ్తున్న 126 ట్రాక్టర్లను గురువారం ఉదయం కల్లూరులో ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను కోరిన వెంటనే నియోజకవర్గంలోని అన్ని మండలాల రైతులూ స్పందించి గోవులకు పశుగ్రాసం దానం చేయడానికి ముందుకొచ్చారని అన్నారు. గోవులను ఆదుకోవాలంటూ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా ఇచ్చిన పిలుపు మేరకు ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి 100 కిలోమీటర్ల దూరంలోని ఖమ్మం గోశాలలకు ఈ పశుగ్రాసాన్ని తరలించినట్లు వివరించారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల శేషగిరిరావు, ఆత్మ చైర్మన్‌ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, ఎంపీపీ దొడ్డా హైమావతి శంకర్‌రావు, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, నాయకులు పాలెపు రామారావు, పాల వెంకటరెడ్డి, కనగాల వెంకట్రావు, గంగారం సొసైటీ అధ్యక్షుడు మందపాటి వెంకటరెడ్డి, ఎంపీటీసీ దేశిరెడ్డి కృష్ణారెడ్డి, ఒగ్గు శ్రీనివాసరెడ్డి, బాలాజీరెడ్డి పాల్గొన్నారు. 


logo