శనివారం 04 జూలై 2020
Khammam - Apr 30, 2020 , 03:02:35

59,932 మెట్రిక్‌ టన్నుల మక్కలను కొనుగోలు చేశాం

59,932 మెట్రిక్‌ టన్నుల మక్కలను కొనుగోలు చేశాం

  • మక్కల నిల్వలను తక్షణమే గోదాములకు తరలించాలి
  • మూడు లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణ లక్ష్యం
  • ధాన్యం తరుగు విషయంలో సమస్య ఉత్పన్నం కావొద్దు
  • పంటల నిల్వల కోసం ఫంక్షన్‌ హాళ్లు, జిన్నింగ్‌ మిల్లులను గుర్తించాలి 
  • సమీక్ష సమావేశంలో రవాణా శాఖ మంత్రి అజయ్‌కుమార్‌
  • నేటి వరకు 1,98,542 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాం: కలెక్టర్‌

ఖమ్మం వ్యవసాయం: కొనుగోలు కేంద్రాల్లోని మక్కల నిల్వలను సత్వరమే గోదాములకు తరలించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలో యాసంగి ధాన్యం, మక్కల సేకరణపై క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారం కోసం బుధవారం ఖమ్మంలోని టీటీడీసీ సమావేశ మందిరంలో వ్యవసాయ, రవాణా, మార్కెటింగ్‌, మార్క్‌ఫెడ్‌, సివిల్‌ సప్లయీస్‌, సహకార, డీఆర్‌డీఏ, ఉద్యానవన శాఖల జిల్లా స్థాయి అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 59,932 మెట్రిక్‌ టన్నుల మక్కలను కొనుగోలు చేశామన్నారు. కాంటా వేసిన మక్కలను సత్వరమే గోదాములకు తరలించాలని, రవాణా కోసం సుమారు 150 వాహనాలను వెంటనే సమకూర్చాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో, రైతుల కల్లాల్లో ఉన్న మక్కలు తడువకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 3 లక్షల మెట్రిక్‌ టన్నుల మక్కల సేకరణ లక్ష్యంగా ఉందని, ఇంకా సుమారు రెండున్నర లక్షల మెట్రిక్‌ టన్నులను సేకరించాల్సి ఉందని అన్నారు. వీటిని నిల్వ చేసేందుకు ఇప్పటికే గుంటూరు, మిర్యాలగూడెంలలోని గోదాములను ఎంపిక చేసి వాటి యజమానులతో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. జిల్లాలో కూడా ఫంక్షన్‌ హాళ్లు, జిన్నింగ్‌ మిల్లులు, ఏఎంసీ షెడ్లను గుర్తించాలని, మక్కల నిల్వలను వాటిల్లోకి తరలించాలని సూచించారు. మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడంలో రైస్‌ మిల్లర్లు సృష్టిస్తున్న సమస్యలపై పౌర సరఫరాల శాఖ మంత్రితో ఫోన్‌లో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించే సమయంలో రెవెన్యూ సిబ్బందిని బాధ్యులుగా పంపించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికీ ఒక గోదామును ఏర్పాటు చేయనున్నదని, ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గంలో స్థలాన్ని గుర్తించి సిద్ధంగా ఉంచాలని మంత్రి సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు యాసంగిలో సేకరించిన మక్కలకు ప్రభుత్వం రూ.24 కోట్ల 39 లక్షలు విడుదల చేసిందన్నారు. సంబంధించిన చెక్కులను మంత్రి రైతులకు అందించారు. పోస్టాఫీసు నుంచి డ్రా చేసుకుంటున్న రూ.1500 ప్రభుత్వ సాయం నగదును కూడా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 

1,98,542 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాం: కలెక్టర్‌

జిల్లాలో ఇప్పటి వరకు 388 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,98,542 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, 6 వేల మంది రైతుల ఖాతాల్లో రూ.80 కోట్లు జమచేశామని కలెక్టర్‌ కర్ణన్‌ తెలిపారు. నిరంతరం ఫోన్‌లో అందుబాటులో ఉండి రైతుల సమస్యలకు సమాధానం ఇవ్వాలని మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ను ఆదేశించారు. ధాన్యం సేకరణలో ఎటువంటి సమస్యలూ లేవన్నారు. అకాల వర్షాల వల్ల పంట నష్టం వాటిల్లిన ప్రాంతాల్లో అంచనాలు సిద్ధం చేసి నష్ట పరిహారం కోసం ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. సత్తుపల్లి, పాలేరు, వైరా ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, లావుడ్యా రాములునాయక్‌, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ధాన్యం, మక్కల కొనుగోళ్ల విషయంలో క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, మార్క్‌ఫెడ్‌ వైస్‌ చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, మేయర్‌ పాపాలాల్‌, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల శేషగిరిరావు, అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌రావు, డీఏవో విజయనిర్మల, డీఎస్‌వో రాజేందర్‌, డీసీవో రాజేశ్వరశాస్త్రి, డీటీవో రవీందర్‌, డీఆర్‌డీవో ప్రవీణ, మార్క్‌ఫెడ్‌ డీఎం సుధాకర్‌, సివిల్‌ సప్లయీస్‌ డీఎం సోములు పాల్గొన్నారు. 


logo